Share News

భువనేశ్వర్‌కు భారత్‌, దక్షిణాఫ్రికా క్రికెటర్లు

ABN , Publish Date - Dec 08 , 2025 | 01:20 AM

ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో పాల్గొన్న భారత్‌, దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఆదివారం తిరుగు పయనమయ్యారు.

భువనేశ్వర్‌కు భారత్‌, దక్షిణాఫ్రికా క్రికెటర్లు

భువనేశ్వర్‌కు భారత్‌, దక్షిణాఫ్రికా క్రికెటర్లు

సొంత నగరాలకు బయలుదేరిన కోహ్లీ, రోహిత్‌

విశాఖపట్నం, స్పోర్ట్స్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి):

ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో పాల్గొన్న భారత్‌, దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఆదివారం తిరుగు పయనమయ్యారు. రాడిసన్‌ హోటల్‌ నుంచి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రత్యేక బస్సుల్లో ఇరుజట్ల ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. మంగళవారం కటక్‌లో తొలి టీ-20 మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా, భారత్‌ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌ వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కటక్‌ చేరుకుంటారు. కాగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌శర్మ మరో విమానంలో వారి సొంత నగరాలకు వెళ్లినట్టు సమాచారం.


రేషన్‌ డిపోల్లో రాగులకు డిమాండ్‌

విశాఖపట్నం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి):

రేషన్‌ డిపోల ద్వారా కార్డుదారులకు అందజేస్తున్న రాగులకు డిమాండ్‌ పెరిగింది. ఈ మేరకు బియ్యంలో మూడుకిలోలు తగ్గిస్తారు. జిల్లాలో 5.25 లక్షల కార్డుదారులుండగా ఈనెలకు 1577.3 టన్నుల రాగులు కేటాయించారు. అయితే 300 టన్నులు మాత్రమే వచ్చాయి. ఆదివారం వరకు 5.25 లక్షల మందిలో 71,698 మందికి (13.64 శాతం) 193 టన్నుల రాగులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రెండు మూడుసార్లు జిల్లాకు వచ్చిన రాగుల్లో నాణ్యత లేకపోవడంతో కార్డుదారులు విముఖత చూపారు. ఇప్పుడు వచ్చిన రాగులు నాణ్యంగా ఉండడంతో డిమాండ్‌ ఏర్పడింది. ఈనెలలో డిమాండ్‌ మేరకు వచ్చేనెల ఇండెంట్‌ పెంచుతామని జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్‌ తెలిపారు.


నగరంలో పెరిగిన చలి

పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో 14.8 డిగ్రీలు

విశాఖపట్నం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి):

నగరం, పరిసరాల్లో చలి గాలుల తీవ్రత పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా వస్తున్న చలిగాలుల ప్రభావంతో ప్రజలు గజగజలాడుతున్నారు. అర్థరాత్రి తరువాత చలి తీవ్రత పెరిగింది. తెల్లవారుజామున మంచు దట్టంగా కురుస్తుండంతో వణుకుతున్నారు. ఆదివారం పెందుర్తి దరి అక్కిరెడ్డిపాలెంలో 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఓల్డ్‌డెయిరీఫారంలో 16.9, పద్మనాభంలో 17.1, ఎయిర్‌పోర్టులో 17.4 డిగ్రీలు నమోదైంది. రా రెండుమూడు రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది.

Updated Date - Dec 08 , 2025 | 01:20 AM