Share News

ఆంధ్ర వైద్య కళాశాలలో స్వాతంత్య్ర వీచిక

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:31 AM

భారత స్వాతంత్య్ర పోరాటంలో విశాఖకు విశిష్ట స్థానం ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటం ఒకటి. దేశంలో తొలితరం వైద్య కళాశాలల్లో ఒకటైన ఆంధ్ర వైద్య కళాశాల విద్యార్థులు 1921లో అప్పటి పాలకుల ఆదేశాలను ధిక్కరించి ఖాదీ దుస్తులు ధరించి తరగతులకు హాజరయ్యారు.

ఆంధ్ర వైద్య కళాశాలలో స్వాతంత్య్ర వీచిక

  • ఆంగ్లేయుల డ్రెస్‌ కోడ్‌ ఉల్లంఘటన

  • 1921 సెప్టెంబరు 28న సూటు, బూటు వదిలి టోపీ, ఖాదీ వస్ర్తాలతో తరగతులకు హాజరు

  • క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన 32 మందిని డిబార్‌ను చేసిన పాలకులు

  • తన యంగ్‌ ఇండియా పత్రికలో ప్రస్తావించిన గాంధీ

విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):

భారత స్వాతంత్య్ర పోరాటంలో విశాఖకు విశిష్ట స్థానం ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటం ఒకటి. దేశంలో తొలితరం వైద్య కళాశాలల్లో ఒకటైన ఆంధ్ర వైద్య కళాశాల విద్యార్థులు 1921లో అప్పటి పాలకుల ఆదేశాలను ధిక్కరించి ఖాదీ దుస్తులు ధరించి తరగతులకు హాజరయ్యారు. దీంతో 32 మంది విద్యార్థులను కళాశాల నుంచి తొలగించారు. దాని గురించి మహాత్మాగాంధీ తన ‘యంగ్‌ ఇండియా’లో ప్రత్యేకించి ప్రస్తావిస్తూ వారి దేశభక్తిని ప్రశంసించారు.

విశాఖపట్నంలో 1902లో పాత పోస్టాఫీసు సమీపాన పది మంది విద్యార్థులతో విక్టోరియా డైమండ్‌ జూబ్లీ వైద్య పాఠశాల ప్రారంభమైంది. గోడే కుటుంబానికి చెందిన గోడే నారాయణగజపతిరావు పాఠశాలకు సాయం అందించారు. నారాయణ గజపతిరావు కోర్కె మేరకు ఆయన సతీమణి చిట్టిజానకమ్మ వాల్తేర్‌లో కొంత భూమి, భవనాలు విరాళంగా ఇవ్వడంతో 1912లో పాఠశాలను అక్కడకు తరలించారు. అక్కడే ఆంధ్ర వైద్య కళాశాలగా ప్రారంభం కావడంతో తొలిసారిగా 32 మంది విద్యార్థులకు ప్రవేశాలు ఇచ్చారు. ఉత్తరాంధ్ర పరిసరాలకు చెందిన విద్యార్థులు ఎంబీబీఎస్‌ ఇంకా లైసెన్సియట్‌ ఎల్‌ఎంఎస్‌ కోర్సుల్లో చేరారు. అయితే కళాశాల నిర్వహణ పూర్తిగా ఆంగ్లేయులు రూపొందించిన నిబంధనల మేరకు నడిచేది. అప్పటికే స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగుతోంది. విద్యార్థులు పోరాటంలో పాల్గొనే అవకాశం ఉందని భావించిన ఆంగ్లేయ అధికారులు, సూటు, బూటు నిబంధన అమలుచేశారు. అయితే 1921 సెప్టెంబరు 28వ తేదీన వైద్య కళాశాలలో చదువుతున్న 142 మంది విద్యార్థులు సూటు, బూటును వదిలి స్వాతంత్య్ర పోరాటానికి సంఘీభావంగా గాంధీ టోపీలు, ఖాదీ వస్త్రాలు ధరించి తరగతులకు హాజరయ్యారు. ఇది ఒక్కసారిగా వైద్య కళాశాలలో కలకలం రేపింది. విద్యార్థులను ప్రశ్నించడంతో వారంతా ఎదురుతిరిగారు. డ్రెస్‌ కోడ్‌పై స్థానిక కోర్టులు విధించిన ఆంక్షల పట్ల నిరసన తెలిపారు. డ్రెస్‌ కోడ్‌ ఉల్లంఘనపై క్షమాపణ చెప్పాలని వైద్య కళాశాల అధికారులు ఆదేశించగా, 32 మంది నిరాకరించారు. దీంతో ఆ 32 మందిని వైద్య కళాశాల నుంచి తొలగించారు.

ఈ విషయం దేశంలో స్వాతంత్య్ర ఉద్యమ నాయకులకు చేరింది. 32 మంది వైద్య విద్యార్థుల దేశభక్తిని మహాత్మాగాంధీ తన యంగ్‌ ఇండియా పత్రికలో అదే ఏడాది నవంబరు 24న ప్రస్తావించారు.

‘దేశం దీర్ఘకాలిక బానిసత్వ వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధికి నిజమైన నివారణను కనుగొనేందుకు అంకితం చేసుకునే వారే నిజమైన సర్జన్లు, వైద్యులు అవుతారు. ఆ సార్వత్రిక వ్యాధి నయమైనప్పుడు ప్లేగు, కలరా, మలేరియా తదితర వ్యాధులు చాలావరకు అదృశ్యమవుతాయి.’ అని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులకు ఏవీఎన్‌, సీబీఎం స్కూలు విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ఈ ఘటనపై దేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ఉత్తరాలను యంగ్‌ ఇండియాలో ప్రచురించడానికి గాంధీ అంగీకరించారని విశాఖలో స్వాతంత్య్ర పోరాటానికి ముందు నుంచి ఇటీవల జరిగిన అనేక మార్పులపై పరిశోధన చేసిన జాన్‌ కాస్టిల్‌ పేర్కొన్నారు.

ఖాదీ దుస్తులు, టోపీ ధరించినందుకు సస్పెండైన 32 మంది వైద్య విద్యార్థులలో కొంతమందిని తరువాత చేర్చుకోగా, మరికొందరు వేరే కళాశాలలకు వెళ్లిపోయారు. ఇలా సస్పెండైన వారిలో నగరానికి చెందిన డాక్టర్‌ ఎంవీ కృష్ణారావు ఒకరు. ఆయన ఆంధ్ర వైద్య కళాశాల మొదటి బ్యాచ్‌ విద్యార్థి. వైద్య విద్య పూర్తిచేసి రాజకీయాల్లోకి వచ్చి మద్రాస్‌ రాష్ట్రంలో చక్రవర్తుల రాజగోపాలాచారి మంత్రివర్గంలో వైద్య, విద్య, హరిజన వెల్ఫేర్‌ (ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ) మంత్రిగా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యుడిగా 40 ఏళ్లు పనిచేశారు.

నేడే జెండా పండుగ

పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌

ఎనిమిది స్టాళ్లు, ఏడు శకటాలు సిద్ధం

పలు వర్గాలకు రూ.214 కోట్లు ప్రోత్సాహకాల పంపిణీ

విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పోలీస్‌ పరేడ్‌ మైదానం సిద్ధమైంది. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆహుతుల కోసం వేదికకు రెండు వైపులా టెంట్లు వేసి కుర్చీలు వేశారు. ఎనిమిది పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇంకా జీవీఎంసీతో పాటు సమాచార పౌర సంబంధాలు, వ్యవసాయం, ఉద్యానవన, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్‌, పశుసంవర్థక శాఖ, డ్వామా, మత్స్యశాఖ, బీసీ, ఎస్సీ సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ, తదితర శాఖలు స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నాయి. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, విద్య, వైద్య ఆరోగ్య, గృహ నిర్మాణ, ప్రణాళికా శాఖలు, ఈపీడీసీఎల్‌ శకటాలు సిద్ధమయ్యాయి. పలు వర్గాలకు రూ.214.99 కోట్ల ప్రోత్సాహకాలను అందించనున్నారు. కాగా జిల్లాలో పలు శాఖల అధికారులు, ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన సుమారు 400 మందికి ప్రశంసాపత్రాలు అందించనున్నారు. వర్షం వచ్చినప్పటికీ కార్యక్రమం కొనసాగేలా ఏర్పాట్లుచేశారు.

Updated Date - Aug 15 , 2025 | 01:31 AM