పెరుగుతున్న ‘బలిమెల’ నీటి నిల్వలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:48 PM
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల నిర్వహణలోని బలిమెల జలాశయం నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. జోలాపుట్ నుంచి నీటి విడుదల, ఇటీవల కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
జోలాపుట్ నుంచి 10 వేలు క్యూసెక్కుల నీరు చేరిక
పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో డొంకరాయి జలాశయం
సీలేరు కాంప్లెక్సులో 52.3170 టీఎంసీల నీటి నిల్వ
గత ఏడాదితో పోలిస్తే.. బలిమెలలో తగ్గిన నీటి నిల్వలు
సీలేరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల నిర్వహణలోని బలిమెల జలాశయం నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. జోలాపుట్ నుంచి నీటి విడుదల, ఇటీవల కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బలిమెల జలాశయం దిగువన ఉన్న గుంటవాడ(సీలేరు), డొంకరాయి జలాశయాలకు భారీగా వరద నీరు వస్తోంది. బలిమెల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,516 అడుగులు. ఇక్కడ 127.50 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చును. ఈ ఏడాది జూన్ చివరి నాటికి ఇక్కడ నీటిమట్టం డెడ్ లెవల్‌కు చేరినప్పటికీ జూలైలో ఈ ప్రాంతంలో కురిసిన ఒక మోస్తరు వర్షాలకు జూలై 3 నాటికి బలిమెలలో నీటిమట్టం 1,457 అడుగులకు చేరుకుని 13.7650 టీఎంసీల నీటి నిల్వలు చేరాయి. ఆగస్టు నెలలో ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు, ఎగువన ఉన్న జోలాపుట్ నుంచి పది వేల క్యూసెక్కుల చొప్పున నీటిని బలిమెలకు విడుదల చేస్తుండడం, వాగుల నుంచి కూడా మరో 11 వేలు క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నది. దీంతో బలిమెలకు మెత్తంగా 21 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆగస్టు 30వ తేదీ నాటికి బలిమెలలో 1,481.20 అడుగులకు నీటిమట్టం చేరి, 39.3100 టీఎంసీల నిల్వ ఉంది. బలమెల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాలంటే మరో 34.80 అడుగుల నీటిమట్టం చేరాల్సి ఉంది. బలిమెల జలాశయం నీటి నిల్వలు గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది తక్కువగానే ఉన్నట్టు సీలేరు కాంప్లెక్సు జెన్‌కో అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఆగస్టు 30 నాటికి బలిమెలలో 1491.60 అడుగులు నీటి నిల్వలు నమోదై 53.5750 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, దీని ప్రకారం 14.2650 టీఎంసీలు తక్కువగా ఉన్నట్టు జెన్‌కో అధికారులు తెలిపారు. అలాగే బలిమెల దిగువన ఉన్న గుంటవాడ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,360 కాగా ఇక్కడ 4.33 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చును. ఇటీవలగా కురిసిన వర్షాలకు శనివారం నాటికి 1,349 అడుగుల నీటిమట్టం చేరి 1.4524 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా, ఇక్కడ 16.50 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చును. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 5,457 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడంతో శనివారం నాటికి డొంకరాయి జలాశయం 1032.10 అడుగులకు (11.8436 టీఎంసీలకు) చేరింది. డొంకరాయి జలాశయంలో మరో 4.40 అడుగుల నీటిమట్టం పెరిగితే నీటిని దిగువకు విడుదల చేయాల్సి ఉంటుందని జెన్‌కో అధికారులు తెలిపారు. ఈ వర్షాలకు బలిమెలలో ఆంధ్రా వాటాగా 39.0210 టీఎంసీలు, గుంటవాడ, డొంకరాయి జలాశయాల్లో 13.2960 టీఎంసీలతో కలిసి మొత్తంగా సీలేరు కాంప్లెక్సుకు 52.3170 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నట్టు సీలేరు కాంప్లెక్సు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ మేరకు సీలేరు కాంప్లెక్సులో రోజుకు 5 మిలియన్ నుంచి 6 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నట్టు జెన్‌కో అధికారులు తెలిపారు.
సీలేరు కాంప్లెక్సు జలాశయాల్లో ఆగస్టు 30 నాటికి నీటి మట్టాల వివరాలు