Share News

పెరుగుతున్న బైక్‌ ప్రమాదాలు

ABN , Publish Date - Mar 14 , 2025 | 01:17 AM

ఈనెల ఐదో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత తాటిచెట్లపాలెం-కంచరపాలెం రోడ్డులో బైక్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది.

పెరుగుతున్న బైక్‌ ప్రమాదాలు

గత మూడేళ్లలో ద్విచక్రవాహనాల ప్రమాదాలు

సంవత్సరం ప్రమాదాలు మరణాలు

2023 350 95

2024 295 130

2025(ఫిబ్రవరి వరకు) 54 21

-------------------------

  • గడచిన వారం రోజుల్లో ఆరుగురి మృతి

  • అపరిమిత వేగంతో వెళుతూ అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్న యువత

(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)

ఈనెల ఐదో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత తాటిచెట్లపాలెం-కంచరపాలెం రోడ్డులో బైక్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈనెల ఆరో తేదీ తెల్లవారుజామున హనుమంతవాకజంక్షన్‌లో లారీని వెనుక నుంచి బైక్‌ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు.

గురువారం కూర్మన్నపాలెం జంక్షన్‌లో బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఇద్దరు చనిపోయారు.

నగరంలో గత వారం, పది రోజుల్లో ఐదుచోట్ల ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురికాగా...ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాల సంఖ్య రానురాను పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో ద్విచక్ర వాహన ప్రమాదాలు 350 జరిగితే అందులో 95 మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. 2024లో 295 ద్విచక్ర వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురైతే 130 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025లో జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే 54 బైక్‌లు ప్రమాదాలకు గురైతే...దాదాపు 21 మంది మృతిచెందడం విశేషం. ఏటేటా ద్విచక్ర వాహన ప్రమాదాలు, వాటితోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు అపరిమిత వేగంతో వాహనాలు నడుపుతూ హఠాత్తుగా ఏదైనా అడ్డువస్తే అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నెల ఐదో తేదీ రాత్రి రైల్వేన్యూకాలనీ-కంచరపాలెం రోడ్డులో బైక్‌ రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీక్టొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరున తెల్లవారుజామున హనుమంతవాక జంక్షన్‌లో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన బైక్‌ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. అదేరోజు హెచ్‌పీసీఎల్‌ గేటు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. గురువారం ఉదయం కూర్మన్నపాలెం జంక్షన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల అవగాహన కల్పిస్తున్నా బేఖాతరు

వాహనాన్ని అపరిమిత వేగంతో నడపడం వల్ల ఎదురయ్యే అనర్థాలు, ప్రమాదం జరిగిన తర్వాత పరిస్థితులపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మైనర్‌ డ్రైవింగ్‌, అధిక శబ్ధం ఇచ్చే సైలెన్సర్లతో కూడిన వాహనాలను నడిపే వారిపై కేసులు నమోదుచేస్తున్నారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.

రైటప్‌: నక్కా కృష్ణ (ఫైల్‌ ఫొటో)

13 వీఎస్‌పి 2 ద్రోణాద్రి రాంబాబు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

స్టీల్‌ సిటీ ఆర్టీసీ డిపో జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొన్న టిప్పర్‌

కూర్మన్నపాలెం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ సిటీ ఆర్టీసీ డిపో జంక్షన్‌ వద్ద గురువారం ఉదయం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వాడ సమీపాన కొత్తూరులో నక్కా కృష్ణ (45), ద్రోణాద్రి రాంబాబులు కుటుంబాలతో నివాసముంటున్నారు. వీరు ఇరువురూ స్టీలుప్లాంటులో కూలీ పనులకు వెళుతుంటారు. బుధవారం రాత్రి సీ షిఫ్ట్‌ డ్యూటీకి వెళ్లి గురువారం ఉదయం ఒకే ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా కూర్మన్నపాలెం వద్ద అనకాపల్లి నుంచి గాజువాక వైపు అతి వేగంగా వెళుతున్న టిప్పర్‌ వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్నవారు...ఆ సమయంలో పక్కనుంచి వెళుతున్న బస్సు కిందపడడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఈ ప్రమాదంలో రోడ్డుపై వెళుతున్న పి.శ్రీను అనే అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలిసిన వెంటనే దువ్వాడ ట్రాఫిక్‌ సీఐ కె.వెంకట్రావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన శ్రీనును ఆసుపత్రికి తరలించారు. కృష్ణ, రాంబాబు కుటుంబాలు బతుకుతెరువు కోసం పదేళ్ల క్రితం ఏలూరు నుంచి నగరానికి వచ్చాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతులు కుటుంబీకులు మృతదేహాలతో రహదారిపై ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఆందోళనకు దిగారు. ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్‌, ఏసీపీ టి.త్రినాథ్‌, సీఐ మల్లేశ్వరరావు, ఎస్సైలు శ్రీనివాస్‌, జగదీష్‌, కార్పొరేటర్లు బొండా జగన్‌, ఎం.ముత్యాలునాయుడు, టీడీపీ నాయకుడు నల్లూరు సూర్యనారాయణలు టిప్పర్‌ యజమానితో మాట్లాడారు. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. నక్కా కృష్ణకు భార్య సింహాచలం, ఇద్దరు కుమార్తెలు, ద్రోణాద్రి రాంబాబుకు భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 01:17 AM