Share News

పెరిగిన కూరగాయల ధరలు

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:11 AM

నగరంలోని రైతుబజార్లలో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి.

పెరిగిన కూరగాయల ధరలు

ప్రియంగా మారిన ఆకుకూరలు, బీన్స్‌ రకాలు

వర్షాలతో పంటలు దెబ్బతినడం, కార్తీకమాసంలో వినియోగం పెరగడం కారణం

బీరకాయలు, కాకరకాయలు కిలో రూ.50

వంకాయలు రూ.50-70

విశాఖపట్నం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని రైతుబజార్లలో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల మొంథా తుఫాన్‌ ప్రభావంతో వరుసగా నాలుగు రోజులు భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలో చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వాటి ప్రభావం బజార్లలో కనిపిస్తోంది.

ఆకుకూరలన్నీ ప్రియమైపోయాయి. వర్షాలకు ముందు పది రూపాయలకు రెండు తోటకూర కట్టలు లభించేవి. ఇప్పుడు ఒక కట్ట ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు. పాలకూర అయితే దొరకడమే కష్టంగా ఉంది. మెంతి కూర రూ.30 పెడితే నాలుగు చిన్నకట్టలు ఇస్తున్నారు. మార్కెట్‌లో టమాటా రేటు కిలో రూ.30కి అటుఇటుగా నడుస్తోంది. లారీల్లో ఎక్కువ సరకు వస్తే రూ.24 నుంచి రూ.26కు, రాకపోతే కిలో రూ.30 చొప్పున అమ్ముతున్నారు. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కిలో రూ.19 నుంచి రూ.20కి లభిస్తున్నాయి. ఈ మూడింటి ధరలే ధరలే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

వంకాయల ధర అధికంగా ఉంది. తెలుపు రకం కిలో రూ.50, నలుపైతే రూ.70 చొప్పున అమ్ముతున్నారు. బెండకాయలు కిలో రూ.30కి లభించేవి. ఇప్పుడు రూ.50 పలుకుతున్నాయి. దొండకాయలు కూడా కిలో రూ.40 నుంచి రూ.50 మధ్య అమ్ముడవుతున్నాయి. బీరకాయలు, కాకరకాయలు కిలో రూ.40లోపే ఉండేవి. ఇప్పుడు కిలో రూ.50కు అమ్ముతున్నారు. క్యారెట్‌ రేటు రూ.40 నుంచి రూ.60కి పెరిగింది. బీన్స్‌ రకాలు కిలో రూ.40కే ఇచ్చేవారు. ఇప్పుడు అవి డబుల్‌ రేటు పలుకుతున్నాయి. కిలో రూ.70 నుంచి రూ.80కి విక్రయిస్తున్నారు. ఆనపకాయ చిన్నదైతే రూ.20, పెద్దదైతే రూ.30కి దొరికేది. ఇప్పుడు వాటిని రూ.40 కంటే తక్కువకు ఇవ్వడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో బీర, బెండ, దొండ, ఆనప పండిస్తున్నారు. వీటిని రైతులు పది రూపాయలు అటుఇటుగా అమ్మేసి త్వరగా ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇతర జిల్లాల నుంచి హోల్‌సేల్‌ వ్యాపారులు తెప్పిస్తున్న బీన్స్‌ రకాలు, క్యారెట్‌, బీట్‌రూట్‌ తదితరాల ధరలు అధికంగానే ఉన్నాయి. ఇది కార్తీకమాసం, అయ్యప్ప స్వాముల దీక్షలు ప్రారంభం కావడంతో అత్యధికులు శాకాహారమే తీసుకుంటున్నారు. దాంతో కూరగాయల వినియోగం బాగా పెరిగింది. రేటు ఎక్కువ పెట్టినా తప్పనిసరిగా కొంటారనే ధీమా ఉండడంతో హోల్‌సేల్‌ వ్యాపారులు డిమాండ్‌కు సరిపడా సరకులు తెప్పించకుండా కొంచెం తక్కువ రప్పిస్తూ కృత్రిమ డిమాండ్‌ సృష్టించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. దీనిపై వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖాధికారులు దృష్టి పెడితే సరకుల లభ్యత పెరిగి ధరలు తగ్గుతాయి.

Updated Date - Nov 09 , 2025 | 01:11 AM