Share News

మన్యంలో పెరిగిన చలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:55 AM

తుఫాన్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి పొడి వాతావరణం నెలకొనడంతో మన్యంలోని కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతన్నాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు దట్టంగా కమ్ముకుంటున్నది.

మన్యంలో పెరిగిన చలి
ముంచంగిపుట్టులో దట్టంగా కమ్ముకున్న పొగ మంచు

దట్టంగా కమ్ముకున్న పొగమంచు

తగ్గుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

అరకులోయలో 11.7 డిగ్రీలు నమోదు

పాడేరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి పొడి వాతావరణం నెలకొనడంతో మన్యంలోని కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతన్నాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు దట్టంగా కమ్ముకుంటున్నది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై శీతల గాలులు వీచాయి. శుక్రవారం అరకులోయలో 11.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ముంచంగిపుట్టులో 11.3, పెదబయలులో 12.1, డుంబ్రిగుడలో 12.6, జి.మాడుగులలో 13.6, హుకుంపేటలో 13.7, చింతపల్లిలో 14.5, పాడేరులో 15.5, కొయ్యూరులో 16.1 డిగ్రీలు నమోదయ్యాయి.

ముంచంగిపుట్టులో పెరిగిన చలితీవ్రత

ముంచంగిపుట్టు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో చలితీవ్రత పెరుగుతున్నది. మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల వరకు పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో వాహనాలు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. మంచు, చలితీవ్రత కారణంగా శ్వాస సంబంధిత సమస్య వున్న వారు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. చలిబారి నుంచి ఉపశమనం కోసం చలిమంటలు వేసుకుంటున్నారు.

కొయ్యూరులో..

కొయ్యూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలో రెండు రోజుల నుంచి చలి తీవ్రత, పొగమంచు పెరిగాయి. ఉదయం 10 గంటల వరకు మంచు ప్రభావం తగ్గడంలేదు. సాయంత్రం నాలుగు గంటలకు సూర్యాస్తమ వాతావరణం నెలకొంటున్నది. రాత్రి పది గంటల నుంచే మంచు కురువడం మొదలవుతున్నది. జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి.

Updated Date - Dec 06 , 2025 | 12:55 AM