ఇంటర్‌లో పెరిగిన ప్రవేశాలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:28 AM
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య పెరిగింది.
గత ఏడాదితో పోల్చితే మెరుగుదల
హైస్కూలు ప్లస్‌లో కొన్నిచోట్ల సంతృప్తికరం
అవరోధంగా మారుతున్న అధ్యాపకుల కొరత
విశాఖపట్నం,ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య పెరిగింది. జడ్పీ, జీవీఎంసీ ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న హైస్కూల్ ప్లస్‌లో కొన్నిచోట్ల ప్రవేశాల్లో మెరుగుదల పెరుగుదల మరికొన్నిచోట్ల ఎలాంటి వృద్ధి నమోదుకాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాభివృద్ధిపై దృష్టి సారించడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగిందని భావిస్తున్నారు.
జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ఇంతవరకు ప్రథమ ఏడాదిలో 2,882 మంది విద్యార్థులు చేరారు. మరింతమంది చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా గత ఏడాది 2,816 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. పాతజైలు రోడ్డులోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఇప్పటివరకు 831 మంది విద్యార్థినులు చేరారు. దీంతో ప్రథమ, ద్వితీయ ఏడాది మొత్తం 1,470 మంది విద్యార్థినులున్నారు. కృష్ణా డిగ్రీ కళాశాలలో జనరల్, ఒకేషనల్ కలిపి 850 మంది ప్రవేశాలు పొందగా, మధురవాడ జూనియర్ కళాశాల ప్రథమ ఏడాదిలో 83 మంది చేరారు. ఇప్పటివరకు గెస్టు ఫ్యాకల్టీతోనే బోధించే ఈ కళాశాలకు ఇటీవల కొన్ని సబ్జెక్టులకు రెగ్యులర్ అధ్యాపకులు వచ్చారు. ఆనందపురం, మల్కాపురం కళాశాలల్లో 25 నుంచి 30 మంది చేరారు. గతంలో ఈ రెండుచోట్లా ప్రవేశాల సంఖ్య స్వల్పంగానే ఉండేది.
ప్రభుత్వ చర్యలతోనే...
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. తల్లికి వందనం పథకం వర్తింపచేయడం ప్రవేశాల సంఖ్య పెరగడానికి కారణమని అధ్యాపకులు చెబుతున్నారు. ఈ ఏడాది పోటీ పరీక్షలు రాసేందుకు వీలుగా విద్యార్థులకు రూ.10 వేల విలువచేసే ఐఐటీ, నీట్ మెటీరియల్ పుస్తకాలు ఉచితంగా అందజేశారు. ఒకేషనల్ కోర్సుల్లోని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ పుస్తకాలు అందించారు. ప్రతిరోజూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు తరగతులు బోధిస్తున్నారు. వారంలో మూడు రోజులు పోటీ పరీక్షలకు సంబంధించి తరగతులు నిర్వహిస్తున్నారు.
హైస్కూలు ప్లస్‌లో
జిల్లాలోని ఆరు ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్ ప్లస్ తరగతులు నిర్వహిస్తున్నారు. పీజీ అర్హత గల స్కూలు అసిస్టెంట్లతో తరగతులు బోధిస్తున్నారు. ప్రత్యేకించి ప్రిన్సిపాళ్లు లేకపోవడంతో పురోగతి కనిపించలేదు. అయితే అఽధ్యాపకుల నియామకం, ప్రిన్సిపాళ్ల నియామకాలను చేపట్టాలనే అభిప్రాయం ఉంది. ఈ విద్యాసంవత్సరంలో హైస్కూళ్ల ప్లస్‌లో రెండుమూడు చోట్ల ప్రవేశాలు పెరిగాయి. గాజువాకలో ఎంపీసీ 26, బైపీసీ 42 మొత్తం 68 మంది, గోపాలపట్నంలో ఎంపీసీ, బైసీపీలో 95 మంది చేరారు. రాంపురంలో ఏంపీసీలో ఒకరు, బైపీసీలో ముగ్గురు మాత్రమే చేరారు. గంగవరంలో ఎంపీసీలో కేవలం ఐదుగురు ఉండగా, బైపీసీలో 18మంది చేరారు. మల్కాపురంలో ప్రథమ ఏడాది ప్రవేశాలు లేవు. ఇక్కడ ద్వితీయ ఏడాదిలో 22 మంది అదే ప్రాంగణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులకు హాజరవుతున్నారు. సీతమ్మధార ఎన్‌ఎంసీ పాఠశాలలో రెండు గ్రూపులకు ప్రథమ ఏడాదిలో 20మంది చేరారు. ఇక్కడ ఏడుగురు పీజీటీలుండగా నలుగురికి హెచ్‌ఎంలుగా పదోన్నతి రావడంతో ఉన్న ముగ్గురే పాఠాలు బోధిస్తున్నారు.