వ్యవసాయానుబంధ రంగాలకు రుణ పరపతి పెంచండి
ABN , Publish Date - Jun 25 , 2025 | 10:48 PM
వ్యవసాయానుబంధ రంగాలకు రుణ పరపతి పెంచాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశం
రుణాల రికవరీపై అవగాహన కల్పించాలి
గత ఏడాది రుణాల లక్ష్యాన్ని అధిగమించిన బ్యాంకర్లు
2025-26 వార్షిక రుణ ప్రణాళిక రూ.1,364 కోట్లు
పాడేరు, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానుబంధ రంగాలకు రుణ పరపతి పెంచాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బుధవారం నిర్వహించిన నాలుగో త్రైమాసిక జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, చిరు వర్తకులు, స్వయం సహాయక సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను బ్యాంకులు ప్రోత్సహించాలన్నారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,364 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించారు. అలాగే బ్యాంకు అధికారులు, వివిధ శాఖల గతేడాది రుణ ప్రణాళికపై ఆయన సమీక్షించారు. 2024-25 ఆర్థిక సంత్సరంలో రూ.975.72 కోట్ల రుణ లక్ష్యం నిర్ధేశించగా.. రూ.1,145.67 కోట్ల రుణాలను అందించారన్నారు. జిల్లాలో సచివాలయాలవారీగా రైతులను గుర్తించి జాబితా సిద్థం చేయాలని సూచించారు. రుణ ప్రణాళిక లక్ష్యాలను సాధించిన అధికారులు రికవరీపై అదేవిధంగా దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులు రుణాలను తిరిగి చెల్లించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో జీడి రైతులు ఎంత మంది ఉన్నారు? ఎంత మంది బ్యాంకుల నుంచి గతేడాది రుణాలు తీసుకున్నారని ఉద్యానవన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో రూ.254 కోట్లు లక్ష్యంగా నిర్ధేశించగా.. 27,321 మంది రైతులకు రూ.256 కోట్లు స్వల్పకాలిక రుణాలు అందించి 100.81 శాతం లక్ష్యం సాధించారన్నారు. రబీలో 17,043 మంది రైతులకు రూ.169 కోట్లు రుణ లక్ష్యం నిర్ధేశించగా రూ.176.96 కోట్ల రుణాలను అందించి 104.71 శాతం రుణ లక్ష్యాలు సాధించారని కలెక్టర్ వివరించారు. ఈఏడాది అదనంగా 500 మంది రైతులను గుర్తించి వ్యవసాయ రుణాలు అందించాలని, ఉత్సాహంగా పనిచేస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రుణాలు అందించాలన్నారు. అలాగే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో భాగంగా పశువులు, పందులు, గొర్రెలు, మేకలు, కోళ్లు పెంపకందారులకు 50 శాతం రాయితీపై రుణాలు మంజూరు చేయాలన్నారు. మత్స్యకారులకు రుణాలు అందించి చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. మల్బరీ సాగు చేస్తున్న రైతులకు షెడ్డు నిర్మాణానికి ఒక లక్ష రూపాయలు రుణంగా అందించాలని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 8,735 స్వయం సహాయక సంఘాలకు రూ.483.23 కోట్ల బ్యాంకు లింకేజీ అందించారన్నారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండేలా ఉపాధి పథకాలను మంజూరు చేయాలని సూచించారు. అలాగే జిల్లాలో కొత్తగా బ్యాంకు శాఖలు ఏర్పాటు చేసేందుకు డీఆర్‌డీఏ పీడీ, జిల్లా వ్యవసాయనుబంధ రంగాలకు చెందిన అధికారులు ఎంపీడీవోలతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగ వెంకటసాహిత్, యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ జితేంద్రశర్మ, ఎల్‌డీఎం మాతునాయుడు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళీ, నాబార్డు డీడీఎం గౌరిశంకర్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నంద్, జిల్లా ఉద్యానవనాధికారి ఎ.రమేశ్‌కుమార్‌రావు, యూనియన్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ పి.నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.