‘స్మార్ట్ సిటీ’పై ఇన్‌చార్జి మంత్రి ఆరా
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:58 AM
జీవీఎంసీలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీవీరాంజనేయస్వామి ఆరా తీసినట్టు తెలిసింది.
ఆ ప్రాజెక్టులను జీవీఎంసీకి అప్పగించాలంటూ కౌన్సిల్‌లో తీర్మానం చేసినట్టు చెప్పిన మేయర్
అయినప్పటికీ టెండర్లు పిలవడంతో నోటీస్ ఇచ్చినట్టు వెల్లడి
విశాఖపట్నం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీవీరాంజనేయస్వామి ఆరా తీసినట్టు తెలిసింది. స్మార్ట్ సిటీ గడువు ముగిసినా జీవీఎంసీలో ఆ ప్రాజెక్టులు కొనసాగుతుండడం, దానిని రద్దు చేసి పెండింగ్ ప్రాజెక్టులను జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించాలని మేయర్ ఆదేశించినా పట్టించుకోకపోవడంపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి...మేయర్ పీలా శ్రీనివాసరావుతో చర్చించినట్టు సమాచారం. స్మార్ట్ సిటీని రద్దు చేస్తూ కౌన్సిల్‌లో తీర్మానం చేయడం, స్మార్ట్ సిటీ ఆస్తులు, ప్రాజెక్టులను జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించాలని తాను ఆదేశించడం వాస్తవమేనని మేయర్ చెప్పినట్టు తెలిసింది. అయినప్పటికీ తనకు తెలియకుండా గాజువాకలో రూ.30 కోట్లతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవన నిర్మాణానికి టెండర్లు పిలవడంతో షాక్‌కు గురయ్యానని, దీనిపై స్మార్ట్ సిటీ అధికారులకు సోమవారం నోటీస్ జారీచేశానని వివరించినట్టు తెలిసింది. ఇదిలావుండగా స్మార్ట్ సిటీని జీవీఎంసీలో కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల కిందట ఉత్తర్వులు ఇచ్చిందని, ఆ కార్పొరేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకే కేంద్ర ప్రభుత్వం మూడు వర్కింగ్ వుమెన్స్ హాస్టళ్ల నిర్మాణానికి రూ.174 కోట్లు కేటాయించిందని జీవీఎంసీ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక ప్రకటనలో పేర్కొనడం విశేషం.
చంద్ర గ్రహణం సందర్భంగా అప్పన్న దర్శన వేళల మార్పు
సింహాచలం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ఈనెల 7, 8 తేదీల్లో సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనవేళల్లో స్వల్పమార్పులు చోటుచేసుకుంటాయని ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఈనెల 7న ఆదివారం రాత్రి 9.56 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై 1.24 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో 7న ఉదయం 6.30 నుంచి 11.30 గంటల వరకూ మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందన్నారు. తిరిగి 8వ తేదీ సోమవారం ఉదయం ప్రభాత ఆరాధనలు, గ్రహణానంతర సంప్రోక్షణలు చేసి, ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిఇస్తామన్నారు. గ్రహణం కారణంగా 7, 8 తేదీల్లో సుప్రభాతం, ఆరాధన, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేశామని, 7న మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే నిత్యాన్న ప్రసాద వితరణ ఉంటుందన్నారు.
6న జిల్లా సమీక్ష కమిటీ సమావేశం
విశాఖపట్నం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
జిల్లా సమీక్షా కమిటీ సమావేశం (డీఆర్‌సీ) ఈ నెల ఆరో తేదీ ఉదయం పది గంటలకు ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అధ్యక్షతన కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పార్లమెంట్ సభ్యులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారన్నారు. జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఒక ప్రకటనలో కలెక్టర్ సూచించారు.
డబుల్ డెక్కర్ టికెట్ ధర పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.100
సాగర్‌నగర్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
పర్యాటక శాఖ, జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సంయుక్తంగా బీచ్‌రోడ్డులో నడుపుతున్న డబుల్ డెక్కర్ బస్సులకు సంబంధించి టికెట్ ధర పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.100గా నిర్ణయించారు. ఆర్కే బీచ్, వుడా పార్కు, రుషికొండ బీచ్‌ల వద్ద టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. రోజులో ఒకసారి (కాలపరిమితి 24 గంటలుగా నిర్ణయించారు) టికెట్ తీసుకుని ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకూ ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు. ఆర్కే బీచ్, సబ్‌మెరైన్, హెలికాప్టర్ మ్యూజియం, విశాఖ మ్యూజియం, వీఎంఆర్‌డీఏ పార్కు, కైలాసగిరి రోప్‌వే, తెన్నేటి పార్కు, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు, ఇస్కాన్ టెంపుల్, టీటీడీ టెంపుల్, రుషికొండ బీచ్, తొట్లకొండల వద్ద డబుల్ డెక్కర్ బస్సులు ఆగుతాయి.
ఏయూ రిజిస్ర్టార్‌గా ప్రొఫెసర్ రాంబాబు బాధ్యతల స్వీకారం
విశాఖపట్నం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్‌గా ప్రొఫెసర్ కె.రాంబాబు మంగళవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు వైస్ చాన్సలర్ జీపీ రాజశేఖర్, రెక్టార్ ప్రొఫెసర్ ఎన్.కిశోర్‌బాబు, పూర్వ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ ఈన్ ధనుంజయరావు, పలువురు ప్రిన్సిపాల్స్, డీన్లు, ప్రొఫెసర్లు, ఇతర అధికారులు, ఏయూ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రొఫెసర్ రాంబాబు విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. వర్సిటీ అభివృద్ధికి తన శాయక్తులా కృషిచేస్తానన్నారు.