జల వనరుల శాఖలో ఇన్‌చార్జుల పాలన
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:43 AM
ఉత్తరాంధ్ర రీజియన్ జల వనరుల శాఖలో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఎస్‌ఈ, సీఈ పోసుల్లో ధవళేశ్వరం సర్కిల్ అధికారులు
ఇక్కడి కీలక ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, నిల్వ సామర్థ్యం సమీక్షించడం ఎలా సాధ్యమని ఉద్యోగుల ప్రశ్న
ఖాళీ పోస్టుల భర్తీకి ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని డిమాండ్
విశాఖపట్నం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర రీజియన్ జల వనరుల శాఖలో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల నార్త్ కోస్టల్ సీఈగా పదోన్నతి పొందిన రామ్‌గోపాల్ గత నెలలోనే పదవీ విరమణ చేశారు. నార్త్ కోస్టల్ సీఈ పరిధిలో ఐదారు పోస్టులకు గాను ప్రస్తుతం ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ఎస్‌ఈలున్నారు. వారిలో విజయనగరం తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు ఎస్‌ఈ స్వర్ణకుమార్‌కు విశాఖ సర్కిల్, నార్త్ కోస్టల్ సీఈ పోస్టు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన మెడికల్ లీవ్‌లో వెళ్లడంతో పర్యవేక్షించే మూడు పోస్టుల బాధ్యతలు ధవళేశ్వరం సర్కిల్ ప్రాజెక్టులో పనిచేసే అధికారులకు అప్పగించారు. ధవళేశ్వరం ప్రాజెక్టు సీఈకి నార్త్ కోస్టల్ సీఈ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ధవళేశ్వరంలో పనిచేసే ఇద్దరు ఎస్‌ఈలలో ఒకరిని విజయనగరంలోని తారకరామ తీర్థసాగర్ ఎస్‌ఈగా, మరొకరిని విశాఖపట్నం సర్కిల్ ఎస్‌ఈగా ఇన్‌చార్జి బాధ్యత లు అప్పగించారు. బొబ్బిలి సర్కిల్ ఎస్‌ఈ అప్పారావుకు వంశధార ప్రాజెక్ట్సు ఎస్‌ఈ బాధ్యతలు అప్పగించారు. వర్షాకాలంలో గోదావరికి వరదలు వస్తుంటాయి. ఆ సమయంలో అక్కడ ఏఈ నుంచి సీఈ వరకూ ప్రతి ఒక్కరిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రుతుపవనాలు సీజన్ గోదావరికి వచ్చే వరదపై ఎప్పటికప్పుడు సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇటువంటి సమయంలో వారు ఇక్కడకు వచ్చి ఉత్తరాంధ్రలోని కీలక ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, నిల్వ సామర్థ్యం ఇత్యాది అంశాలను సమీక్షించి ఆదేశాలు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని జల వనరుల శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల ఈఈలకు మూడు పాత జిల్లాల్లో ఎస్‌ఈ బాధ్యతలు అప్పగించి ఉంటే సబబుగా ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. జల వనరుల శాఖలో డీఈ, సీఈల ఖాళీలను భర్తీచేయకుండా కొందరు ఉన్నతాధికారులు మోకాలడ్డుతున్నారనే ఆరోపణలున్నాయి. ఉత్తరాంధ్రలోని లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు ఇక్కడ ఖాళీలను భర్తీచేసేలా ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాల్సి ఉంది.