వదలని వాన
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:19 PM
దిత్వా తుఫాన్ ప్రభావంతో మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతూ మంగళవారం జల్లులతో కూడిన వర్షం కురిసింది.
దిత్వా తుఫాన్ ప్రభావంతో జల్లులు
వరి రైతుల్లో ఆందోళన
పాడేరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్ ప్రభావంతో మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతూ మంగళవారం జల్లులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతమైంది. అప్పుడప్పుడు జల్లులు పడడంతో పాటు సాయంత్రం నాలుగు గంటల తరువాత పొగమంచు అలముకుంది. రైతులు పంటను కోసి, ఇళ్లకు తరలించే పనుల్లో ఉన్నారు. కాగా తాజా వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.
పెరుగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
దిత్వా తుఫాన్ ప్రభావంతో వాతావరణం మారడంతో ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కానీ చలి ప్రభావం మాత్రం తగ్గుముఖం పట్టలేదు. తెల్లవారుజామున పొగమంచు సైతం కొనసాగుతున్నది. మంగళవారం అరకులోయలో 13.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, జి.మాడుగులలో 14.3, డుంబ్రిగుడలో 14.8, పాడేరు, హుకుంపేటలో 15.1, చింతపల్లిలో 15.5, ముంచంగిపుట్టు, పెదబయలులో 15.7, కొయ్యూరులో 17.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: తుఫాన్ ప్రభావంతో మండలంలో వర్షం కొనసాగుతోంది. సోమ, మంగళవారాలు ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. దీంతో పలు చోట్ల వరి కోతల మధ్యలో పనాలతో ఉన్న ధాన్యం తడిచి ముద్దవుతోంది. కొందరు రైతులు వరి కుప్పలు వేసుకోగా, మరికొందరు కోతలు ప్రారంభించలేదు. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల వలన కోత దశకు చేరుకున్న వరి పాటు పనాలతో ఉన్న ధాన్యం దెబ్బతినే అవకాశాలు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా రాజ్‌మా పంట చేతికి అందే దశకు వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుత వర్షాలకు పంట కుళ్లిపోయే ప్రమాదం ఉండడంతో రాజ్‌మా రైతులు దిగులు చెందుతున్నారు.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండలంలో మంగళవారం మధ్యాహ్నం పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. దీంతో వరి రైతులు ఆందోళన చెందు తున్నారు. మండలంలో గల 23 పంచాయతీల పరిధిలో సుమారు 7,600 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఇందులో ఇప్పటికే దాదాపు 4 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. రైతులు పంటను నూర్పిడి కోసం కుప్పలుగా వేసి ఉంచారు. సరిగ్గా ఈ సమయంలో రెండు రోజులుగా మోస్తరు వర్షం కురుస్తుండడంతో పొలాల్లో ఉన్న వరి కుప్పలు తడిచిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.