వదలని వాన
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:45 AM
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు తీవ్రమైన ఎండకాసింది. ఆ తరువాత వాతావరణం మారిపోయి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
- మన్యంలో కొనసాగుతున్న వర్షాలు
- ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలు
- రాకపోకలకు తప్పని ఇబ్బందులు
పాడేరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు తీవ్రమైన ఎండకాసింది. ఆ తరువాత వాతావరణం మారిపోయి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
జిల్లా కేంద్రం పాడేరులో సుమారుగా రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. వర్షం నీరుతో పంటపొలాలు నిండిపోయి చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండగా, మంగళవారం కూడా కొనసాగింది. పాడేరు మండలంలోని మత్స్యగెడ్డ, రాయిగెడ్డ, చిలకలమామిడి గెడ్డ, పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, జి.మాడుగుల మండలంలోని కోడిమామిడి గెడ్డ, మత్స్యగెడ్డ, ముంచంగిపుట్టు, పెదబయలు, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని గెడ్డల ఉధృతి కొనసాగుతున్నది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది.
పాడేరులో 34.3 డిగ్రీలు నమోదు
మన్యంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండకాస్తుండడంతో ఏజెన్సీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరులో 34.3, జీకేవీధిలో 31.5, కొయ్యూరులో 31.4, జి.మాడుగులలో 31.1, అనంతగిరిలో 30.1, పెదబయలులో 29.8, చింతపల్లిలో 29.5, ముంచంగిపుట్టులో 28.6, డుంబ్రిగుడలో 28.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అరకులోయలో...
అరకులోయ: మండలంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పంట పొలాల్లోకి నీరు చేరింది. దమ్ములు పట్టేందుకు అనుకూలంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జీకేవీధి మండలంలో..
సీలేరు: జీకేవీధి మండలంలో మంగళవారం కూడా భారీ వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధారకొండ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి, పెబ్బంపల్లి, తడకపల్లి వెళ్లే మార్గంలో తడకపల్లి వాగుపై వంతెన లేకపోవడంతో ఆయా గ్రామాల గిరిజనుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆర్వీనగర్ సంతకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్లిన ఆయా గ్రామాల గిరిజనులు ప్రాణాలకు తెగించి గెడ్డ దాటాల్సి వచ్చింది. ప్రయాణికులతో వెళుతున్న జీపు ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలో ముందుకు కదల్లేని పరిస్థితి ఉండిపోవడంతో స్థానికులు అతి కష్టం మీద గెడ్డ దాటించారు.