Share News

గడువులోగా ప్రారంభిస్తే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

ABN , Publish Date - Sep 30 , 2025 | 01:02 AM

ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని నిర్ణీత గడువులోగా అంటే ఏడాది నుంచి ఏడాదిన్నరలోపు పరిశ్రమలు కార్యకలాపాలు/ఉత్పత్తి ప్రారంభిస్తే...వారికి అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు.

గడువులోగా ప్రారంభిస్తే  పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ సదస్సులో కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

ఎనిమిది జిల్లాల పారిశ్రామికవేత్తలు, అధికారులతో రీజనల్‌ అవుట్‌రీచ్‌ వర్క్‌ షాపు నిర్వహణ

విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని నిర్ణీత గడువులోగా అంటే ఏడాది నుంచి ఏడాదిన్నరలోపు పరిశ్రమలు కార్యకలాపాలు/ఉత్పత్తి ప్రారంభిస్తే...వారికి అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో ఎనిమిది (విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం) జిల్లాల పారిశ్రామికవేత్తలు, అధికారులతో సోమవారం ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ రీజనల్‌ అవుట్‌రీచ్‌ వర్క్‌ షాపు నిర్వహించారు. దీనికి హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ, గత ఏడాదిన్నర కాలంలో పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు వచ్చాయని, సింగిల్‌ విండో విధానం ద్వారా అనుమతులు ఇవ్వడమే కాకుండా నిర్ణీత గడువు దాటిన తరువాత ఆయా ప్రాజెక్టులకు ‘డీమ్డ్‌ టు బి అప్రూవల్‌’ మంజూరవుతోందన్నారు. గత ఏడాది కాలంలో విశాఖ జిల్లాలో లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగాయని, వాటి ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. పారిశ్రామికవేత్తలను వేధించకుండా ఉండేందుకు వివిధ శాఖల తనిఖీలు తొలగించారని, అంతా కలిసి ఒకేసారి ఇన్‌స్పెక్షన్‌ చేసేలా కేంద్రీయ విధానం అమలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా రెన్యువల్స్‌కు కూడా ఆటోమేటిక్‌ విధానం పాటిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌పై ర్యాంకింగ్‌ ఇస్తుందని, సుమారు ఆరు వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరిస్తుందని, అనుకూలంగా వారికి సమాధానాలు చెబితే మళ్లీ ఏపీకి మొదటి ర్యాంకు వస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలు సూచించిన మార్పులు చేయడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి విశాఖ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి.ఆదిశేషు అధ్యక్షత వహించగా, అడిషనల్‌ డైరెక్టర్‌ రామలింగరాజు, శ్రావణ్‌ షిప్పింగ్‌ ఎండీ సాంబశివరావు, వాశిశ్వ అధ్యక్షులు పాండురంగ ప్రసాద్‌ పాల్గొన్నారు.

పారిశ్రామికవేత్తలు చేసిన సూచనలు

- సింగిల్‌ విండో ద్వారా డీమ్డ్‌ టు బి అప్రూవల్‌ పొందిన ప్రాజెక్టులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఒరిజినల్‌ ఫైల్‌ కావాలని అడుగుతున్నాయి. దీనిపై బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటుచేసి మార్గదర్శకాలు ఇవ్వాలి.

- పరిశ్రమలకు ఈపీడీసీఎల్‌ స్మార్ట్‌ మీటర్లను అమర్చింది. అయితే వాటికి సరైన కెపాసిటర్లు అమర్చుకునే విషయంలో సహకారం లేదు. ఖర్చులు పెరిగాయి. వారితో అవగాహన సదస్సు నిర్వహించాలి.

- పరిశ్రమలకు ఆస్తి పన్ను విధానం మార్చాలి. గతంలో అద్దె ఆధారంగా, ఇప్పుడు కేపిటల్‌ విలువ ఆధారంగా పన్నులు వేస్తున్నారు. ఇవి భారంగా ఉన్నాయి. తక్కువ పన్ను ఉండేలా కొత్త విధానం తీసుకురావాలి.

Updated Date - Sep 30 , 2025 | 01:02 AM