Share News

అగమ్యగోచరంగా అసంపూర్తి భవనాలు

ABN , Publish Date - Jul 16 , 2025 | 11:34 PM

మండలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండి దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. అప్పట్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. అయితే ఈ భవనాలు పూర్తవుతాయా? లేదా? అనేది సందిగ్ధంగా ఉంది.

అగమ్యగోచరంగా అసంపూర్తి భవనాలు
కొత్తభల్లుగుడలో అసంపూర్తిగా ఉన్న గ్రామ సచివాలయ భవనం

గత వైసీపీ ప్రభుత్వంలో సచివాలయ, ఆర్‌బీకే, వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణాలు ప్రారంభం

నిధులు విడుదల చేయకపోవడంతో నిలిచిపోయిన పనులు

నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి

అరకులోయ, జూలై 16(ఆంధ్రజ్యోతి): మండలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండి దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. అప్పట్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. అయితే ఈ భవనాలు పూర్తవుతాయా? లేదా? అనేది సందిగ్ధంగా ఉంది.

గత వైసీపీ ప్రభుత్వం మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు గాను 18 గ్రామ సచివాలయాలు, 18 ఆర్‌బీకే కేంద్రాలు, 8 వెల్‌నెస్‌ సెంటర్లకు భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఒక్కో గ్రామ సచివాలయానికి రూ.40 లక్షలు, ఆర్‌బీకే కేంద్ర భవనానికి రూ.21.8 లక్షలు, వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణానికి రూ.17.5 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. అయితే 18 గ్రామ సచివాలయాలకు గాను పద్మాపురం, పెదలబుడు, లోతేరు, గన్నెల, చొంపిలో మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన 13 గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. అలాగే 18 ఆర్‌బీకే భవనాలకు గాను లోతేరు, గన్నెల, అరకులోయ, పద్మాపురం, మాదల, పద్మాపురం, చినలబుడులో భవనాలు పూర్తయ్యాయి. మిగిలిన 11 భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. 8 హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లకు గాను ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు. అప్పట్లో కాంట్రాక్టర్లకు గత వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. అయితే ఈ భవనాలు పూర్తవుతాయా? లేక అసంపూర్తిగా మిగిలిపోతాయా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. కూటమి ప్రభుత్వం దృష్టి సారించి ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 16 , 2025 | 11:34 PM