Share News

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో కూటమికి 9, వైసీపీకి 1

ABN , Publish Date - Aug 07 , 2025 | 01:18 AM

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో కూటమి తొమ్మిది స్థానాలు గెలుచుకోగా, వైసీపీ ఒక స్థానం దక్కించుకుంది. స్టాండింగ్‌ కమిటీలో పది స్థానాలకు టీడీపీ నుంచి తొమ్మిది మంది, బీజేపీ నుంచి ఒకరు, వైసీపీ నుంచి పది మంది నామినేషన్‌ దాఖలు చేశారు.

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో  కూటమికి 9,  వైసీపీకి 1

ఓటింగ్‌కు ఏడుగురు కార్పొరేటర్లు గైర్హాజరు

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో కూటమి తొమ్మిది స్థానాలు గెలుచుకోగా, వైసీపీ ఒక స్థానం దక్కించుకుంది. స్టాండింగ్‌ కమిటీలో పది స్థానాలకు టీడీపీ నుంచి తొమ్మిది మంది, బీజేపీ నుంచి ఒకరు, వైసీపీ నుంచి పది మంది నామినేషన్‌ దాఖలు చేశారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత కౌన్సిల్‌ హాల్‌లో బుధవారం ఉదయం పది గంటలకు పోలింగ్‌ మొదలైంది. మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు కలిగివుండగా, వారిలో జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌; సీపీఎం కార్పొరేటర్‌ బి.గంగారావు, ఆరో వార్డు కార్పొరేటర్‌ ముత్తంశెట్టి ప్రియాంక, 91వ వార్డు కార్పొరేటర్‌ కుంచెజోత్స్న, 92వ వార్డు కార్పొరేటర్‌ బెహరా వెంకట స్వర్ణలత ఓటింగ్‌కు హాజరుకాలేదు. 92 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో వైసీపీకి 32 మంది కార్పొరేటర్లు మద్దతు ఉండగా, మిగిలిన 60 మంది టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారు ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రౌండ్‌కు 24 ఓట్లు చొప్పున నాలుగు రౌండ్లలో లెక్కింపు జరిగింది. నాలుగురౌండ్‌ల లెక్కింపు పూర్తయ్యేసరికి కూటమి మద్దతుతో పోటీ చేసిన కొణతాల నీలిమకు 58, గంకల కవితకు 57, దాడి వెంకటరామేశ్వరరావుకు 57, మొల్లి హేమలతకు 57, సేనాపతి వసంతకు 54, గేదెల లావణ్యకు 53, మాదంశెట్టి చినతల్లికి 52, రాపర్తి త్రివేణివరప్రసాదరావుకి 52, మొల్లి ముత్యాలకు 51 ఓట్లు రాగా వైసీపీకి చెందిన సాడి పద్మారెడ్డికి 50 ఓట్లు లభ్యమవడంతో వారంతా గెలుపొందినట్టు అధికారులు తేల్చారు. కూటమి మద్దతుతో పోటీకి దిగిన టీడీపీకి చెందిన 79వ వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాసరావుకు 49 ఓట్లు రావడంతో రీకౌంటింగ్‌కు కూటమి నేతలు పట్టుబట్టారు. దీంతో అధికారులు మరోసారి ఓట్ల లెక్కించగా అదే ఫలితం వచ్చింది. ఆ సమయంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకేరాజు, వైసీపీ ఫ్లోర్‌లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ తదితరులు కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ను కలిసి తమ అభ్యర్థికి 50 ఓట్లు వచ్చినా గెలుపును ప్రకటించడంలో జాప్యంచేస్తున్నారని, తక్షణం జోక్యంచేసుకోవాలని కోరారు. దీంతో కమిషనర్‌ ఓట్ల లెక్కింపు జరుగుతున్న హాల్‌కు వెళ్లి నాలుగు రౌండ్ల ఓట్లను పరిశీలించారు. అనంతరం అత్యధికంగా ఓట్లు సాధించిన పది మందిని గెలుపొందినట్టు ప్రకటించారు.

Updated Date - Aug 07 , 2025 | 01:18 AM