ఆడిట్ పేరుతో యూసీడీ దందా
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:59 AM
జీవీఎంసీలోని అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (యూసీడీ) విభాగంలో వసూళ్లరాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఆడిట్ పేరుతో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) నుంచి అదనంగా డబ్బులు వసూలుచేస్తున్నారు. ఆడిట్‌కు ప్రతి సంఘం నుంచి రూ.300 వసూలు చేసుకునేందుకు అధికారులు అవకాశం ఇవ్వడంతో అదనంగా మరో రూ.200 చొప్పున వసూలుచేసి వాటాలు పంచుకుంటున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన యూసీడీ ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ఒక్కో స్వయం సహాయక సంఘం నుంచి రూ.500 వసూలు
ఆడిట్‌కు రూ.300 వసూలు చేయాలని
మెప్మా ఎండీ ఆదేశం
అదనంగా రూ.200 వసూలు చేస్తున్న సిబ్బంది
జీవీఎంసీ పరిఽదిలో సుమారు 35 వేల గ్రూపులు
రూ.70 లక్షల వరకూ అదనంగా వసూలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీలోని అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (యూసీడీ) విభాగంలో వసూళ్లరాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఆడిట్ పేరుతో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) నుంచి అదనంగా డబ్బులు వసూలుచేస్తున్నారు. ఆడిట్‌కు ప్రతి సంఘం నుంచి రూ.300 వసూలు చేసుకునేందుకు అధికారులు అవకాశం ఇవ్వడంతో అదనంగా మరో రూ.200 చొప్పున వసూలుచేసి వాటాలు పంచుకుంటున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన యూసీడీ ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటుచేసింది. పది మంది మహిళలు కలిసి ఒక సంఘంగా ఏర్పడితే ప్రభుత్వపరంగా వివిధ పథకాలను అందజేయడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను పెంచుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయిస్తుంది. జీవీఎంసీ పరిధిలో సుమారు 35 వేల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్రస్థాయిలో మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ ఏరియా (మెప్మా) ఆధ్వర్యంలో కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. జీవీఎంసీ పరిధిలో యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. మహిళ సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించడం ప్రారంభించి దశాబ్దాలు గడిచిపోవడంతో ప్రస్తుతం ఒక్కో సంఘం రూ.20 లక్షల వరకు రుణాలు తీసుకునే స్థాయికి చేరుకుంది. సంఘాలు తీసుకున్న రుణాలను ఆ సంఘంలోని సభ్యులు ఏదైనా వ్యాపారం, స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. తాము సంపాదించే ఆదాయంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని రుణం తీర్చేందుకు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కొన్ని సంఘాలు తాము బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేయడం, నిధులను పక్కదారి పట్టించడం వంటివి జరగడంతో లావాదేవీలను ఆడిట్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెప్మా ఎండీ ఆధ్వర్యంలో రెండు సంస్థలకు ఆడిట్ బాధ్యతలను అప్పగించారు. ఆడిట్ చేసినందుకు ప్రతి సంఘం రూ.300 చొప్పున ఆ సంస్థకు చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు. డబ్బులు వసూలుచేసే బాద్యతను ఆ జోన్‌లోని ఏపీడీలు సంబంధిత వార్డు కమ్యూనిటీ ఆర్గనైజర్(సీఓ)లకు అప్పగించారు. గత నాలుగు రోజులుగా నగరంలో మహిళా సంఘాల రికార్డుల ఆడిట్ జరుగుతోంది. ఆడిట్ కోసం రూ.300 చొప్పున సంఘాల నుంచి వసూలు చేయాలని మెప్మా ఎండీ ఆదేశాలు జారీచేయగా, ఇదే అదనుగా కొందరు యూసీడీ అధికారులు, సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు. ఒక్కో గ్రూపు నుంచి రూ.300కి బదులుగా, ఆడిట్ సిబ్బందికి భోజనం, వసతి ఖర్చులు పేరుతో రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారు. వాస్తవంగా ఆడిట్ చేసేవారికి ఎలాంటి ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదు. జీవీఎంసీ పరిధిలో 35 వేల సంఘాల నుంచి రూ.70 లక్షలు అదనంగా వసూలుచేసి వాటాలుగా పంచుకునేందుకు సిద్ధమయ్యారు. కొందరైతే నాలుగేళ్ల ఆడిట్ చేయాల్సి ఉందని చెప్పి రూ.రెండు వేలు వసూలు చేస్తున్నారు. దీనిపై యూసీడీ పీడీ సత్యవేణి వివరణ కోరగా సంఘాల ఆడిట్ జరుగుతోందని, అదనపు వసూళ్ల సంగతి తనకు తెలియదన్నారు. దీనిపై అన్నిజోన్‌ల ఏపీడీలు, ఆర్పీలు, సీఓలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు ఇస్తానని తెలిపారు.