కృష్ణాపురం వన విహారిలో మెరుగైన సదుపాయాలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:47 AM
కృష్ణాపురం వన విహారిలో పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అటవీశాఖ అదనపు పీసీసీఎఫ్(వైల్‌లైఫ్, హెచ్‌ఆర్‌డీ) డాక్టర్ శాంతిప్రియ పాండే తెలిపారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా నర్సరీల అభివృద్ధికి ప్రాధాన్యం
అటవీశాఖ అదనపు పీసీసీఎఫ్ డాక్టర్ శాంతిప్రియ పాండే
చింతపల్లి అతిథి గృహం, ఆర్‌వీనగర్ రేంజ్ కార్యాలయం ప్రారంభం
చింతపల్లి/గూడెంకొత్తవీధి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కృష్ణాపురం వన విహారిలో పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అటవీశాఖ అదనపు పీసీసీఎఫ్(వైల్‌లైఫ్, హెచ్‌ఆర్‌డీ) డాక్టర్ శాంతిప్రియ పాండే తెలిపారు. సోమవారం ఆమె చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించారు. తొలుత కృష్ణాపురం వన విహారి, మల్లవరం నర్సరీని పరిశీలించారు. స్థానిక డివిజన్ ఫారెస్టు కార్యాలయం ఆవరణలో రూ.13.5 లక్షల నిధులతో నిర్మించిన అతిథి గృహం, ఆర్‌వీనగర్‌లో రూ.25 లక్షల నిధులతో నిర్మించిన రేంజి కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. డివిజన్, రేంజ్ కార్యాలయాల్లో ఆమె అటవీశాఖ ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె అటవీశాఖ ఉద్యోగులతో మాట్లాడుతూ కృష్ణాపురం వన విహారిలో పర్యాటకులకు మంచి ఆతిథ్యం ఇచ్చే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెంట్లతో పాటు సెమీ పర్మినెంట్ కాటేజీలు నిర్మించేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా అభివృద్ధి చేస్తున్న నర్సీరీలను రానున్న రోజుల్లో రెట్టింపు చేయాలని సూచించారు. మారుజాతి మొక్కలను అత్యధిక సంఖ్యలో పెంపొందించి ప్రజలకు పంపిణీ చేయాలన్నారు. గిరిన ప్రాంతంలో అటవీ సంపద పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డివిజన్ పరిధిలో అటవీశాఖ కార్యాలయాలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఎం.దివాన్ మైదీన్, స్థానిక డీఎఫ్‌వో వై.నరసింహరావు, ఎఫ్‌ఆర్‌వోలు అప్పారావు, వెంకటరావు పాల్గొన్నారు.