ఉక్కు విద్యాలయాలకు చిక్కులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:47 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది.
విశాఖ విమల విద్యాలయం మూసేసినట్టే?
భవనం లీజుపై ఒప్పందం చేయని స్టీల్‌ప్లాంటు యాజమాన్యం
కోర్టును ఆశ్రయించిన నిర్వహణ సంస్థ
వేరే విద్యా సంస్థలో చేరిన విద్యార్థులు
కేంద్రీయ విద్యాలయంపైనా అదే తీరు
ఒకటో తరగతి, ప్లస్ 1లో రెండేళ్లుగా ప్రవేశాలు నిలిపివేత
క్రమేణా మూసివేత దిశగా అడుగులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. ప్రాజెక్టు స్కూళ్లుగా ప్రారంభించిన విశాఖ విమల విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం నిర్వహణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటోంది. ఆర్థిక ఇ్బందులు ఉన్నాయని విద్యా సంస్థల నిర్వహణకు ఇంతకు ముందులా నిధులు ఇవ్వలేమని చెబుతోంది. స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకు గత ఏడాది విశాఖ విమల విద్యాలయాన్ని నడిపినా ఈ ఏడాది ఇక తమ వల్ల కాదని చేతులు ఎత్తేసింది. దాంతో అది మూత పడింది.
స్టీల్‌ప్లాంటుకు టౌన్ షిప్‌లో విశాఖ విమల విద్యాలయం, దానికి అనుబంధంగా బాలచెరువు రోడ్డులో మరొక స్కూల్ ఉన్నాయి. ఈ రెండింటిలో సుమారుగా రెండువేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విద్యాలయం నిర్వహణ బాధ్యతలను డయసిస్ సంస్థకు స్టీల్‌ప్లాంటు అప్పగించింది. ఏడాదికి రూ.5 కోట్ల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. మిగిలిన మొత్తాన్ని డయసిస్ విద్యార్థుల నుంచి ఫీజుల రూపేణా వసూలుచేస్తోంది. ఓ దశాబ్దం నుంచి స్టీల్‌ప్లాంటు డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఫీజులు పెంచి నిధులు సమకూర్చుకోవాలని చెబుతోంది. అయితే ఎక్కువ మంది పేద పిల్లలు ఉన్నందున, వారు అధిక ఫీజులు భరించలేరని డయసిస్ చెబుతోంది. గత ఏడాదే ఈ విద్యా సంస్థను మూసేయడానికి యాజమాన్యం యత్నించింది. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కల్పించుకొని ఆ ఏడాదికి సాయం ఇప్పించారు. ఈ ఏడాది కూడా విద్యా శాఖ నుంచి అనుమతి కావాలంటే...యాజమాన్యం భవనం లీజు అగ్రిమెంట్‌ను డయసిస్‌కు ఇవ్వాలి. దానిని జిల్లా విద్యా శాఖాధికారికి సమర్పిస్తే అనుమతి లభిస్తుంది. అయితే స్టీల్ యాజమాన్యం విద్యా సంస్థను మూసేయాలనే ఉద్దేశంతో ఒప్పందం చేయలేదు. దాంతో అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో నిర్వహణ సంస్థ కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావడం, పాఠశాలలు తెరవకపోవడం, గొడవలు జరగడంతో విద్యార్థులను తల్లిదండ్రులు వేరే పాఠశాలల్లో చేర్పించేశారు. మరికొంతమంది మాత్రం పాఠశాల తెరిస్తే చేరుదామని వేచి ఉన్నారు.
కేంద్రీయ విద్యాలయం పరిస్థితీ అంతే
స్టీల్ ప్లాంటు, సీఐఎస్‌ఎఫ్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లల కోసం 70 ఎకరాల్లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు క్లాసులు ఉన్నాయి. వేయి మంది వరకు విద్యార్థుల ఉన్నారు. బోధన సిబ్బంది మాత్రం అందుకు తగినట్టుగా లేరు. సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని నిర్వహణను కూడా స్టీల్ ప్లాంటు యాజమాన్యం భారంగా భావిస్తోంది. గత ఏడాదే ఒకటో తరగతి, 11వ తరగతి (ప్లస్ వన్) అడ్మిషన్లు ఆపేసింది. ఈ ఏడాది కూడా అదేవిధంగా చేసింది. దాంతో తరగతులు తగ్గిపోయాయి. ఈ ఏడాది ప్లస్ టు చదువుతున్న విద్యార్థులు వెళ్లిపోతే ఇకపై పదో తరగతి వరకే ఉంటుంది. గత ఏడాది ఒకటో తరగతి అడ్మిషన్లు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది రెండో తరగతికి వచ్చేవారు ఎవరూ లేరు. ఈ ఏడాది కూడా ఒకటో తరగతికి ఎవరినీ తీసుకోలేదు. అంటే రెండు తరగతులు తగ్గిపోయాయి. క్రమంగా దీనిని కూడా మూసేయాలనేది యాజమాన్యం వ్యూహంగా చెబుతున్నారు.