అన్నదాతకు అండగా ఐఎండీ
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:32 AM
వ్యవసాయ రంగంలో పంటలు సాగు యావత్తూ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. దుక్కి దున్నడం నుంచి పంట ఇంటికి చేరే వరకు వివిధ దశల్లో వ్యవసాయాన్ని వాతావరణం ప్రభావితం చేస్తుంది. సకాలంలో సరైన వర్షాలు కురవకపోతే విత్తనాలు చల్లడం, నాట్లు వేయడం కష్టమే. పంట పూతదశలో, గింజకట్టే తరుణంలో ఎక్కువ రోజులు మబ్బు పట్టినా, వర్షాలు ముంచెత్తినా నష్టాలు తప్పవు. పంటలు నీటి ఎద్దడికకి గురైతే కొన్ని రకాల చీడపీడలు దాడి చేస్తాయి.
అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ ద్వారా నాలుగు జిల్లాల రైతులకు సేవలు
వర్షం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం, గాలిలో తేమ శాతంపై కచ్చితమైన లెక్క
వాతావరణంలో మార్పులపై నాలుగైదు రోజుల ముందే సమాచారం
గ్రామీణ కృషి మౌసం సేవా పథకం దోహదం
వాతావరణ ఆధారిత వ్యవసాయంతో పలు ప్రయోజనాలు
అనకాపల్లిఅగ్రికల్చర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):
వ్యవసాయ రంగంలో పంటలు సాగు యావత్తూ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. దుక్కి దున్నడం నుంచి పంట ఇంటికి చేరే వరకు వివిధ దశల్లో వ్యవసాయాన్ని వాతావరణం ప్రభావితం చేస్తుంది. సకాలంలో సరైన వర్షాలు కురవకపోతే విత్తనాలు చల్లడం, నాట్లు వేయడం కష్టమే. పంట పూతదశలో, గింజకట్టే తరుణంలో ఎక్కువ రోజులు మబ్బు పట్టినా, వర్షాలు ముంచెత్తినా నష్టాలు తప్పవు. పంటలు నీటి ఎద్దడికకి గురైతే కొన్ని రకాల చీడపీడలు దాడి చేస్తాయి. అతిశీతల వాతావరణం, అధిక తేమ లేదా తీవ్ర వర్షాల కారణంగా మరికొన్ని చీడపీడలు పంటలను ఆశిస్తాయి. పంట కోత సమయంలో భారీ వర్షాలు పడినా, వరదలొచ్చిన పరిస్థితి అతలాకుతలం అవుతుంది. కొన్నేళ్ల నుంచి వాతావరణంలో వస్తున్న మార్పులు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం కావడం, మండు వేసవిలో భారీ వర్షాలు కురవడం, వర్షాకాలంలో వేసవిని తలపించేలా ఎండలు మండుతుండడం, మండే ఎండలు, ఏడాది మొత్తంలో కురవాల్సిన వర్షం వారం రోజుల్లోనే పడడం వంటివి జరుగుతున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేలా శాస్త్ర, శాంకేతిక రంగాలు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వ్యవసాయ రంగానికి దన్నుగా నిలిచి రైతులను ఆదుకుంటున్నది. వాతావరణంలో వచ్చే మార్పులను ముందుగానే పసిగట్టి అన్నదాతలను హెచ్చరించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వాన రాకడను నాలుగైదు రోజులు ముందుగానే చెప్పగలుగుతున్నారు. ఉష్ణోగ్రతలు, గాలి వేగం, గాలిలో తేమ శాతం వంటి వాటిని కచ్చితంగా లెక్కగట్టగలుగుతున్నారు. ప్రతి నెలలో సాధారణ వర్షపాతంలో విపరీతమైన హెచ్చతగ్గులు, పంటలు వేసే సమయం, పంట కాలం, పంట కోత సమయాల్లో వస్తున్న మార్పులకు తగిన యాజమాన్య పద్ధతులను వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. పంటల ప్రణాళికలో మార్పులు చేపట్టి ఆశించిన దిగుబడులు సాధించడం కోసంు రైతులకు వాతావరణ ఆధారిత సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు.
గ్రామీణ కృషి మౌసం సేవా పథకం
భారత వాతావరణ సంస్థ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులకు వాతావరణ హెచ్చరికలు ఎప్పటికప్పుడు అందిస్తూ వాతావరణానికి అనుగుణంగా చేపట్టాలల్సిన సాగు పద్ధతులను వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘గ్రామీణ కృషి మౌసం సేవా (జీకేఎంఎస్)’ పథకాన్ని ప్రారంభించింది. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉన్న ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ ద్వారా వారంవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల రైతులకు వాతావరణ హెచ్చరికలు, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు తెలియజేస్తున్నారు. ఆర్‌ఎఆర్‌ఎస్‌లో శాస్త్రవేత్తలు ప్రతి మంగళవారం సమావేశమై భారత వాతావరణ సంస్థ అందజేసిన సమాచారం ఆధారంగా రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. వీటిని రైతుల మొబైల్ ఫోన్లు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా అందజేస్తున్నారు. రాగల ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు, గాలివేగం, గాలిలో తేమశాతం, వర్ష సూచనలతోపాటు వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుకూలంగా రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను సూచిస్తుంటారు. వర్షాలు పడే పరిస్థితి ఉంటే పంట కోతలు, నూర్పు పనులను వాయిదా వేసుకోవాలని సూచిస్తారు. మబ్బు పట్టిన వాతావరణం వల్ల పంటలను ఆశించే చీడపీడలు వాటి నివారణ చర్యలను వెల్లడిస్తారు. భారీ వర్షాల కారణంగా పంటలు ముంపునకు గురైతే పొలంలో చేపట్టాల్సిన పనులను సూచిస్తారు. గత ఏడాది వరి కోతలు, నూర్పుల సమయంలో వచ్చిన వర్షాల గురించి రైతులను ముందుగా అప్రమత్తం చేయడం వల్ల వారు నష్టాన్ని తగ్గించుకోగలిగారు.
విస్తృతమవుతున్న నెట్ వర్క్
డాక్టర్ వి.గౌరీదేవి, ప్రధాన శాస్త్రవేత్త, ఆర్‌ఏఆర్‌ఎస్, అనకాపల్లి (22ఎకెపిఅగ్రికల్చర్2)
గ్రామీణ కృషి మౌసం యోజన నెట్‌వర్క్ మరింత విస్తృతం అవుతున్నది. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఇప్పుడున్న ఆటోమెటిక్ వెదర్ స్టేషన్‌కు అదనంగా మరొక వెదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వున్న ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ రోజూ ఉష్ణోగ్రతలు వర్షపాతం, గాలిలో తేమ శాతం, గాలి వేగం తదితర సమాచారం సేకరించి భారత వాతావరణ సంస్థకు అందజేస్తుంది. వాతావరణ సంస్థ సమస్త వాతావరణ సమాచారాన్ని క్రోడీకరించి తుది వాతావరణ బులెటిన్‌ను విడుదల చేస్తుంది. అనకాపల్లిలోని గ్రామీణ కృషి మౌసం సేవా పథకంలో ఆరు వేల మంది రైతులు రిజిస్టరై ఉన్నారు. 70 వాట్సప్ గ్రూపులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.
ఎంతో ప్రయోజనంగా ఉంది
పి.సత్తిబాబు రైతు, కానాడ, రావికమతం మండలం
వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఎంతో ప్రయోజనాత్మకంగా ఉంది. నేను కూడా శాస్త్రవేత్తలతో నేరుగా సంభాషించి ఆ సమాచారాన్ని మిగతా రైతులకు ఆందజేస్తున్నాను. (22ఎకెపిఅగ్రికల్చర్4)
వాతావరణ ఆధారితక సాగుపై రైతులకు అవగాహన
డాక్టర్ కె.వి.రమణమూర్తి, నోడల్ అధికారి, గ్రామీణ కృషి మౌసం సేవా పథకం (22ఎకెపిఅగ్రికల్చర్3)
వివిధ వాతావరణ పరిస్థితులకు అవసరమైన సాగు పద్ధతులను రూపొందించాం. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, పైరు విత్తిని తొలి దశలో నీటి ఎద్దడికి గురైతే, పెరిగే దశలో నీటి ముంపుకు గురైతే, రుతుపవనాలు నాలుగు వారాలు ఆలస్యం అయినప్పుడు, ఎనిమిది వారాలు ఆలస్యం అయినప్పుడు.. ఇలా వివిధ పరిస్థితుల్లో ఆయా పంటలకు అవసరమైన యాజమాన్య పద్ధతులను సిద్ధంచేశాం. అవసరం, సమయాన్నిబట్టి రైతులకు తెలియజేస్తాం. రైతులకు, వ్యవసాయ విద్యార్థులకు వాతావరణ ఆధారిత వ్యవసాయంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.