అంధకారంలోనే ఎలమంచిలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:32 AM
ఎలమంచిలి పట్టణంలోని పలు ప్రాం తాల్లో సోమవారం రాత్రి కూడా అంధకారం లోనే వున్నాయి.
రెండో రోజూ విద్యుత్ సరఫరాకు నోచుకోని పలు ప్రాంతాలు
విరిగిన స్తంభాలు, తెగిన వైర్ల పునరుద్ధరణ పనుల్లో సిబ్బంది బిజీ
ఎలమంచిలి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
ఎలమంచిలి పట్టణంలోని పలు ప్రాం తాల్లో సోమవారం రాత్రి కూడా అంధకారం లోనే వున్నాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధ రణకు విద్యుత్, మునిసిపల్, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపపట్టినప్పటికీ గాంధీనగర్, ఎల్‌ఐసీ కార్యాలయం రోడ్డు, ఎంపీడీవో కార్యాలయం రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ జంంక్షన్, పోస్టాఫీసు రోడ్డు ప్రాంతాల్లో సోమవారం రాత్రి పది గంటలకు కూడా కరెంటు రాలేదు. ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులతోపాటు భారీ వర్షం కారణంగా చెట్లు కూలిపోయి విద్యుత్ వైర్లుపై పడడంతో స్తంభాలు విరిగిపోయిన విషయం తెలిసిందే. విద్యుత్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పునరుద్ధరణ పనులు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటలకు మిలట్రీ కాలనీ, కొత్తపేట, కోర్టుపేట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పట్టణంలో మిగిలిన ప్రాంతమంతా అంధకా రంలోనే వుంది. దీంతో ఉక్కపోత, దోమల బెడదతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది సోమవారం ఉద యాన్నే రంగంలోకి దిగి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రధాన రహదారి వెంబడి వున్న ప్రాంతాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వినియోగ దారులతోపాటు విద్యుత్‌పై ఆధారపడి వ్యాపారాలు చేసే వారు ఇబ్బంది పడ్డారు.
విద్యుత్ శాఖకు రూ.30 లక్షలకుపైగా నష్టం
ఈదురుగాలుల కారణంగా విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టణంలో గాంధీనగర్, కొత్తపేట, పెదపల్లిరోడ్డు, నాగేంద్ర కాలనీ, మెయిన్ రోడ్డు, ఎల్‌ఐసీ కార్యాలయం జంక్షన్, రైల్వే స్టేషన్ రోడ్డు, తులసీనగర్, ద్వారకానగర్, పోస్టాఫీసు కార్యాలయం రోడ్డు, సీహెచ్‌సీ ప్రాంతంతోపాటు కొక్కిరాపల్లి, అగ్రహారం ప్రాంతాల్లో విద్యుత్ విద్యుత్ స్తంభాలు విగిపోయి వైర్లు తెగిపోయాయి. మొత్తం మీద రూ.30 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నామని విద్యుత్ శాఖ ఏఈ కనకరాజు తెలిపారు.