గుర్రంపాలెంలో అక్రమ క్వారీయింగ్
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:11 AM
పెందుర్తి మండలం గుర్రంపాలెం ఏపీఐఐసీ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన పలు కంపెనీలు గ్రావెల్ కోసం పక్కనున్న కొండలను తవ్వేశాయి. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టడంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించడంతో ఏపీఐఐసీ సహా తొమ్మిది సంస్థలకు గనుల శాఖ ఈ ఏడాది మార్చిలో షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నిబంధనల ప్రకారం నోటీసులు తీసుకున్న పక్షం రోజుల్లో వివరణ ఇవ్వాలి. అయితే ఏపీఐఐసీతో పాటు రెండు కంపెనీలు మాత్రమే వివరణ ఇచ్చాయి. మిగిలిన కంపెనీల నుంచి స్పందన శూన్యం.
ఎటువంటి అనుమతులు లేకుండా
గ్రావెల్ తవ్విన సంస్థలు
గనుల శాఖ నోటీసులు ఇచ్చినా
కనీసం వివరణ కూడా ఇవ్వని వైనం
చర్యలకు అధికారుల మీనమేషాలు
విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండలం గుర్రంపాలెం ఏపీఐఐసీ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన పలు కంపెనీలు గ్రావెల్ కోసం పక్కనున్న కొండలను తవ్వేశాయి. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టడంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించడంతో ఏపీఐఐసీ సహా తొమ్మిది సంస్థలకు గనుల శాఖ ఈ ఏడాది మార్చిలో షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నిబంధనల ప్రకారం నోటీసులు తీసుకున్న పక్షం రోజుల్లో వివరణ ఇవ్వాలి. అయితే ఏపీఐఐసీతో పాటు రెండు కంపెనీలు మాత్రమే వివరణ ఇచ్చాయి. మిగిలిన కంపెనీల నుంచి స్పందన శూన్యం.
పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం పలు సంస్థలకు ఏపీఐఐసీ భూములు కేటాయించింది. అందువల్ల ఆయా కంపెనీలకు కేటాయించిన భూముల స్థితిగతులు ఏపీఐఐసీకి తెలుసు. భూములు చదును చేయడానికి గ్రావెల్ ఎక్కడ నుంచి తీసుకువచ్చారు?, సమీపంలోని కొండల నుంచి తెచ్చారా?, అందుకు అనుమతి ఉందా?...అనేది ఆయా కంపెనీలు వివరణ ఇవ్వాలి. ఇందుకు ఏపీఐఐసీ కూడా ప్రత్యేకించి చొరవ తీసుకుని కంపెనీల నుంచి నివేదిక తెప్పించి గనుల శాఖకు పంపాలి. ఈ విషయమై ఏపీఐఐసీకి గనుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు లేఖలు రాయడంతో పాటు కలెక్టరేట్‌లో కలిసినప్పుడు నోటీసులకు వివరణ గురించి అడుగుతున్నారు. ఇదిలావుండగా గడువులోగా వివరణ రానందున గనుల శాఖ సుమోటోగా ఆయా కంపెనీలకు డిమాండ్ నోటీసులు ఇవ్వవచ్చు. కానీ ఆ శాఖ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుర్రంపాలెం లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన కంపెనీలు సమీపంలో కొండల నుంచి సుమారు లక్షన్నర క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వినట్టు గనుల శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. అందుకు రూ.కోట్లలో జరిమానా చెల్లించాల్సి ఉంది. ఒకవేళ సకాలంలో జరిమానా చెల్లించకపోతే ఆర్‌ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తునకు నోటీసులు ఇచ్చే అధికారం కూడా గనుల శాఖకు ఉంది. దీనిపై గనుల శాఖ చొరవ తీసుకోవాలి.