రంగబోలుగెడ్డలో అక్రమ తవ్వకాలు
ABN , Publish Date - May 26 , 2025 | 12:38 AM
మండలంలోని ఉగ్గినపాలెం రెవెన్యూ పరిధి రంగబోలుగెడ్డలో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పంట భూములను మెరకుచేసుకునే పేరుతో మట్టిని తరలించుకుపోయి ఇళ్ల పునాదులు, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి వినియోగిస్తున్నారు. రంగబోలుగెడ్డలో ఒక ఎక్స్‌కవేటర్‌తో మట్టి తవ్వి, ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు.
చెక్ డ్యామ్‌ను ఆనుకొని భారీ గోతులు
కట్టడానికి పొంచి ఉన్నముప్పు
ఇరిగేషన్ శాఖ అనుమతులు లేకుండా తవ్వకాలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతుల ఆరోపణ
కశింకోట, మే 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉగ్గినపాలెం రెవెన్యూ పరిధి రంగబోలుగెడ్డలో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పంట భూములను మెరకుచేసుకునే పేరుతో మట్టిని తరలించుకుపోయి ఇళ్ల పునాదులు, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి వినియోగిస్తున్నారు. రంగబోలుగెడ్డలో ఒక ఎక్స్‌కవేటర్‌తో మట్టి తవ్వి, ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు.
మినీ రిజర్వాయర్లు, చెక్ డ్యామ్‌లు, ఉపాధి హామీ పథకం కింద కూలీలు మట్టి తవ్వకం చేయని సాగునీటి చెరువుల్లో పేరుకుపోయిన మట్టిని, రైతులు తమ పొలాల్లో వినియోగించుకోవడానికి ఇరిగేషన్ అధికారుల అనుమతితో తవ్వి తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. దీనిని అడ్డంపెట్టుకుని కొంతమంది వ్యక్తులు మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కశింకోట మండలం ఉగ్గినపాలెం రెవెన్యూ పరిధిలో కొత్తపల్లి బుచ్చెయ్యపేట వద్ద రంగుబోలు గెడ్డలో ఎక్స్‌కవేటర్ సహాయంతో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఐదు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని గెడ్డ నుంచి మట్టిని తరలించుకుపోతున్నారు. చెక్ డ్యామ్‌కు అతి చేరువలో భారీ గొయ్యి పడేలా మట్టిని తవ్వేశారు. దీనివల్ల చెక్ డ్యామ్‌కు ముప్పు ఏర్పడింది. గెడ్డలో చెక్ డ్యామ్ వద్ద మట్టి తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా రంగబోలు గెడ్డలో మట్టి తవ్వకాలపై జలవనరుల శాఖ ఏఈ అమూల్యకు ‘ఆంధ్రజ్యోతి‘ ఫోన్ చేసి వివరణ కోరగా.. గెడ్డలో మట్టి తవ్వకాల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, అనుమతులు సైతం ఇవ్వలేదని స్పష్టం చేశారు.