పేటలో అక్రమ లేఅవుట్లు
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:54 AM
పాయకరావుపేట, చుట్టుపక్కల గ్రామాల్లో అనుమతుల్లేని లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీఎంఆర్డీఏ అనుమతులు లేకుండా దర్జాగా ఇళ్ల స్థలాల లేఅవుట్లు వేస్తున్నారు. వీటిని అధికారులు పరిశీలించి, పనులు నిలిపివేయాలని ఆదేశించినా.. రియల్టర్లు బేఖాతరు చేస్తున్నారు.
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లు
ల్యాండ్ కన్వర్షన్‌కు పంచాయతీ, రెవెన్యూ శాఖలకు అందని దరఖాస్తులు
లేఅవుట్లలో అభివృద్ధి పనులు
నిలిపివేయాలన్న అధికారుల ఆదేశాలు బేఖాతరు
పాయకరావుపేట, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట, చుట్టుపక్కల గ్రామాల్లో అనుమతుల్లేని లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీఎంఆర్డీఏ అనుమతులు లేకుండా దర్జాగా ఇళ్ల స్థలాల లేఅవుట్లు వేస్తున్నారు. వీటిని అధికారులు పరిశీలించి, పనులు నిలిపివేయాలని ఆదేశించినా.. రియల్టర్లు బేఖాతరు చేస్తున్నారు. పాయకరావుపేట పంచాయతీలో వివిధచోట్ల సుమారు 200 ఎకరాల్లో వేసిన లేఅవుట్లలో ఒకటి, రెండు తప్పించి మిగిలినవన్నీ వీఎంఆర్డీఏ అనుమతుల్లేకుండా, కనీస నిబంధనలు పాటించలేదు. కొన్ని లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టి, పలువురు నివాసం వుంటున్నారు. ఈ లేఅవుట్లు వేసిన రియల్టర్లు.. రహదారులు, డ్రైనేజీలు వంటి సరిగా నిర్మించకపోవడంతో నివాసితులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో నీరు నిలిచిపోయి రహదారులు ముంపునకు గురవుతున్నాయి. వీటితోపాటు కొత్తగా వేస్తున్న అక్రమ లేఅవుట్లపై తరచూ పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నా సంబంధిత అధికారులు పెద్దగా స్పందించడంలేదు. దీంతో నెలకొకటి చొప్పున కొత్తగా అనుమతి లేని లేఅవుట్లు వెలుస్తున్నాయి. పట్టణ శివారులోని శ్మశానవాటికను ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమిలో లేఅవుట్ వేయడానికి ‘ల్యాండ్ కన్వర్షన్’కు పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. లేఅవుట్ వేయడంతో పంచాయతీ అధికారులు వెళ్లి పనులు నిలిపివేయాలని, అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే పనులు చేపట్టాలని ఆదేశించారు. అయినా లేఅవుట్ వేస్తున్న వ్యక్తులు ఈ ఆదేశాలను పట్టించుకోలేదు. కొద్దిరోజుల నుంచి లేఅవుట్‌లో పనులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ల్యాండ్ కన్వర్షన్‌కి ఎటువంటి దరఖాస్తు చేయలేదని రెవెన్యూ అధికారులు చెబుతుండగా, లేఅవుట్ అనుమతి కోసం తమకు కూడా దరఖాస్తు అందలేదని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. కానీ లేఅవుట్‌లో పనులు మాత్రం జరుగుతుండడం విశేషం. లేఅవుట్ వేస్తున్న వారికి రాజకీయ నాయకుల అండ ఉందన్న సమాచారంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈఓపీఆర్డీని సీహెచ్.చంద్రశేఖర్‌ను వివరణ కోరగా... వెంటనే పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.