Share News

డీజిల్‌ అక్రమ వ్యాపారం

ABN , Publish Date - May 09 , 2025 | 01:32 AM

మండలంలోని పూడిమడకలో డీజిల్‌ అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

డీజిల్‌ అక్రమ వ్యాపారం

  • పూడిమడకలో బహిరంగంగానే విక్రయాలు

  • సముద్రంలో వెళ్లే ఆయిల్‌ బార్జిల నుంచి అక్రమంగా కొనుగోళ్లు

  • లీటరుపై రూ.20 వరకు తక్కువ..

  • మత్స్యకార బోట్లతోపాటు ఇతర వాహనాలకు విక్రయం

  • భారీగా సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

అచ్యుతాపురం, మే 8 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని పూడిమడకలో డీజిల్‌ అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సముద్రంలో ప్రయాణించే ‘ఆయిల్‌ బార్జి’ల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, పూడిమడకలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మరోవైపు సముద్రంలో ఇంజన్‌ బోట్లతో చేపల వేట సాగించే మత్స్యకారులు రాయితీపై డీజిల్‌ కొనుగోలుకు ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్‌ కార్డులను తమ వ్యాపారానికి అనుకూలంగా వాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇంజన్‌ బోట్లు ఉన్న మత్స్యకారులకు ప్రభుత్వం లీటర్‌కు తొమ్మిది రూపాయలు రాయితీ ఇస్తున్నది. ఇందుకోసం మత్స్యశాఖ వద్ద నమోదైన బోట్ల యజమానులకు ప్రభుత్వం స్మార్ట్‌కార్డులు అందజేసింది. మత్స్యకారులు ఈ కార్డులతో బంకులకు వెళ్లి అక్కడ విక్రయించే ధరకన్నా రూ.9 తక్కువ చెల్లించి డీజిల్‌ కొనుగోలు చేయవచ్చు. ఒక్కో బోటుకు నెలకు 300 లీటర్ల డీజిల్‌ను రాయితీపై పొందవచ్చు. పూడిమడకలో ఎక్కువ మంది మత్స్యకారులు వుండడంతో ప్రభుత్వం మత్స్య శాఖ ఆధ్వర్యంలో గతంలో ఒక పెట్రోలు బంక్‌ని ఏర్పాటుచేసింది. అలాగే మత్స్యకారులకు రాయితీపై డీజిల్‌ ఇవ్వడానికి అచ్యుతాపురంలో ఒక పెట్రోల్‌ బంక్‌కు మత్స్య శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. కాగా పూడిమడకలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ సక్రమంగా తెరవకపోవడంతో మత్స్యకారులు అచ్యుతాపురం వెళ్లి క్యాన్లతో డీజిల్‌ తెచ్చుకోవాల్సి వస్తున్నది. ఆటో చార్జీలను మత్స్యకారులు భరించాల్సి వస్తున్నది.

ఇదిలావుండగా పూడిమడకలో చాలా కాలం నుంచి డీజిల్‌ అక్రమ వ్యాపారం సాగుతున్నది. వీరు ఇటు మత్స్యకారుల నుంచి అటు సముద్రంలో వెళ్లే ఆయిల్‌ బార్జిల నుంచి డీజిల్‌ తక్కువ రేటుకు కొనుగోలు చేసి, ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. విశాఖ నుంచి సముద్ర మార్గంలో నౌకల ద్వారా డీజిల్‌ రవాణా అవుతుంది. వీటిని ఆయిల్‌ బార్జిలుగా పిలుస్తారు. ఇటువంటి నౌకలు తరచూ పూడిమడక సముద్రమార్గం గుండా వెళుతుంటాయి. విశాఖపట్నంలో ఉన్న దళారులు పూడిమడకలో డీజిల్‌ అక్రమ వ్యాపారులతో ఎల్లప్పుడూ టచ్‌లో ఉంటారు. విశాఖపట్నంలో డీజిల్‌తో షిప్‌ బయలు దేరిన వెంటనే పూడిమడక వ్యాపారులకు సమాచారం అందుతుంది. వీరు బోటుతో సముద్రంలో నిర్దేశిత ప్రదేశం వద్ద ఖాళీ డ్రమ్ములతో సిద్ధంగా వుంటారు. ఆయిల్‌ బార్జి సిబ్బంది డీజిల్‌ను పెట్రోలు బంకుల్లో ధర కన్నా లీటరుకి రూ.20 వరకు తక్కువకు ఇస్తున్నారు. అక్రమార్కులు డీజిల్‌ను పూడిమడక తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు.

పూడిమడకలో మత్స్య శాఖ గతంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంకు సరిగా తెరవకపోవడంతో మత్స్యకారులు డీజిల్‌ కోసం అచ్యుతాపురం వెళ్లాల్సి వస్తున్నది. దీనివల్ల అదనపు ఖర్చులు అవుతుండడంతో పూడిమడకలోని డీజిల్‌ అక్రమ వ్యాపారులు దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మత్స్యకారుల నుంచి స్మార్ట్‌ కార్డులను తీసేసుకుని, వారికి ప్రభుత్వం ఇచ్చేరాయితీతో డీజిల్‌ విక్రయిస్తున్నారు. దీనివల్ల తమకు రవాణా చార్జీలు ఆదా అవుతాయని మత్స్యకారులు భావిస్తున్నారు. అయితే మత్స్యకారుల నుంచి తీసుకున్న స్మార్డ్‌కార్డులతో సదరు వ్యాపారులు అచ్యుతాపురంలోని బంకు నుంచి రాయితీపై డీజిల్‌ కొనుగోలు చేసి, లారీలు, ట్రాక్టర్లు, ఆటోలకు విక్రయిస్తున్నారు. పూడిమడకలో డీజిల్‌ అక్రమ వ్యాపారం బహిరంగంగా సాగుతుండగా పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

Updated Date - May 09 , 2025 | 01:32 AM