Share News

అక్రమ నిర్మాణాలు కోకొల్లలు

ABN , Publish Date - Aug 22 , 2025 | 01:19 AM

డాబాగార్డెన్స్‌లో కొన్నాళ్ల కిందట ఓ అపార్టుమెంట్‌ నిర్మాణంలో ఉండగానే కూలిపోయింది.

అక్రమ నిర్మాణాలు కోకొల్లలు

చిన్న చిన్న సందుల్లో భారీ భవంతులు

ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు

కానరాని సెట్‌బ్యాక్స్‌

ప్లాన్‌ కంటే అదనంగా రెండేసి అంతస్థులు...

కళ్లు మూసుకుంటున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు

నేల స్వభావం ఏమిటనేది పరిశీలించకుండానే అనుమతులు జారీ

తాజాగా వన్‌టౌన్‌లో ఒరిగిపోయిన అపార్టుమెంట్‌, ఫంక్షన్‌హాల్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

డాబాగార్డెన్స్‌లో కొన్నాళ్ల కిందట ఓ అపార్టుమెంట్‌ నిర్మాణంలో ఉండగానే కూలిపోయింది. ఆ సమయంలో పనివాళ్లెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

వన్‌టౌన్‌లోని వెలంపేట పోస్టాఫీస్‌ సమీపంలో రెండేళ్ల కిందట నిర్మించిన అపార్టుమెంట్‌తోపాటు దానిపక్కనే ఉన్న కల్యాణమండపం తాజాగా ఒరిగిపోయాయి. అధికారులు అప్రమత్తమై అందులో ఉన్నవారిని బయటకు పంపించేశారు. పొరపాటున కూలిపోయి ఉంటే అందులో నివసిస్తున్న కుటుంబాలు సజీవ సమాధి అయిపోయేవి.

నగరంలో భవన నిర్మాణాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. నిర్మాణాలన్నీ నిబంధనల ప్రకారం జరిగేలా చూడాల్సిన జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బంది మామూళ్లకు అలవాటుపడి అక్రమార్కులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంతో ఇరుకు సందుల్లో కూడా బహుళ అంతస్థుల భవనాలు నిర్మితమవుతున్నాయి. వన్‌టౌన్‌లోని వెలంపేట పోస్టాఫీసు సమీపంలో సుమారు 300 గజాల స్థలంలో కశిరెడ్డి ప్లాజా పేరుతో గ్రూప్‌హౌస్‌ నిర్మాణానికి 2022లో జీవీఎంసీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు పరిశీలించి గ్రౌండ్‌+2 భవన నిర్మాణానికి అనుమతిచ్చారు. కానీ బిల్డర్‌ మాత్రం ప్లాన్‌ కంటే అదనంగా రెండు అంతస్థులు నిర్మించారు. సెల్లార్‌ను కూడా పార్కింగ్‌కు వినియోగించకుండా, డిపార్టుమెంటల్‌ స్టోర్‌ పెట్టేందుకు వీలుగా షట్టర్‌ ఏర్పాటుచేశారు. ప్లాన్‌కు విరుద్ధంగా రెండు అంతస్థులు అదనంగా నిర్మించడంతోపాటు కనీసం సెట్‌బ్యాక్‌లు విడిచిపెట్టకుండా పది అడుగుల రోడ్డులో భారీ భవనం నిర్మించినా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చూసీచూడనట్టు ఊరుకున్నారు. అంతా నిబంధనల ప్రకారమే నిర్మించారనే భావనతో చాలామంది అందులో ఫ్లాట్‌లు కొనుగోలు చేసుకుని కుటుంబాలతో నివాసం ఉంటున్నారు. వెలంపేటలోని ఒక అపార్టుమెంట్‌ కుడి వైపునకు ఒరిగిపోయి, కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని కొందరు బుధవారం రాత్రి నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన స్థానిక పోలీసులను అక్కడకు పంపించారు. భవనం పక్కకు ఒరిగిపోయిందని నిర్ధారించడంతో జీవీఎంసీ, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారంతా అక్కడకు చేరుకుని భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి వేరేచోటకు తరలించారు. ఆ భవనంతోపాటు దానికి అనుకుని ఉన్న ఫంక్షన్‌హాల్‌ భవనం కూడా ఎడమ వైపునకు ఒరిగిపోయి ఉంది. రెండు భవనాలు ఒకే వైపునకు ఒరిగిపోవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ఆ ప్రాంతంలో నివాసముంటున్నవారు బిక్కుబిక్కుమంటూ కాలంగడుపుతునారు.

ప్రతీసందులోనూ అక్రమ నిర్మాణాలే

నగరంలో ఏ సందులో చూసినా అక్రమ నిర్మాణాలే కనిపిస్తున్నాయి. రెండు, మూడు అడుగులు దారి ఉండే సందుల్లో కూడా బహుళ అంతస్థుల భవనాలు నిర్మించేస్తున్నారు. సీతంపేట వినాయక ఆలయం సమీపంలో మూడు అడుగుల సందులో రెండు అపార్టుమెంట్‌లను నిర్మిస్తున్నారు. జీవీఎంసీ ఇచ్చిన ప్లాన్‌ కంటే అదనంగా ఒక అంతస్థు నిర్మించడంతోపాటు కనీసం సెట్‌బ్యాక్‌లు కూడా విడిచిపెట్టలేదు. దీనిపై స్థానికులు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. మద్దిలపాలెం చేపలబజారు రోడ్డులో జీవీఎంసీ అధికారులు ఇచ్చిన ప్లాన్‌ కంటే అదనంగా రెండు అంతస్థులు నిర్మించినా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. అలాగే శివాజీపాలెం వినాయకుడి గుడి వెనుక సందులో జీ+2 నిర్మాణానికి జీవీఎంసీ ప్లాన్‌ జారీచేస్తే బిల్డర్‌ ఏకంగా రెండు అంతస్థులు అదనంగా నిర్మించేస్తున్నారు. దీనిపై కొందరు జీవీఎంసీకి ఫిర్యాదు చేస్తే టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండానే సమస్యను పరిష్కరించినట్టు ఫిర్యాదుదారుడికి సమాచారం పంపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మద్దిలపాలెం దయారాం స్వీట్స్‌ వెనుక వైపు సందులో వ్యక్తిగత ఇల్లు నిర్మాణానికి జీవీఎంసీ అనుమతిస్తే అందులో ఏకంగా 16 ఫ్లాట్లతో భారీ అపార్టుమెంట్‌నే నిర్మించేశారు. నగరంలో ఇలాంటి నిర్మాణాలు కోకొల్లలుగా ఉంటున్నాసరే టౌన్‌ప్లానింగ్‌ అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిసినా సరే తమ వ్యక్తిగత లబ్ధిని దృష్టిలో పెట్టుకుని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

వార్డు సచివాలయం నుంచే కలెక్షన్‌ మొదలు...

నగరంలో ఎవరైనా భవన నిర్మాణం చేయాలంటే ముందుగా లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ వద్దకు వెళ్లి స్థలానికి సంబంధించి పత్రాలు, భవనం డిజైన్‌, డ్రాయింగ్‌, సాయిల్‌ టెస్ట్‌ రిపోర్టును ఏపీడీపీఎంఎస్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ దరఖాస్తు సంబంధిత ప్రాంత వార్డు సచివాలయంలోని ప్లానింగ్‌ సెక్రటరీకి చేరుతుంది. అక్కడే వసూళ్ల పర్వం మొదలవుతుంది. దరఖాస్తును చూడగానే స్థలాన్ని చూడాలంటూ లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ ద్వారా వార్డు ప్లానింగ్‌ సెక్రటరీ భవన నిర్మాణదారుడిని కలుస్తాడు. స్థలంపై వివాదాలు, రోడ్డు సదుపాయం, నేల స్వభావం వంటివి పరిశీలించిన తర్వాత వాటిపై రిమార్కు రాసి ఉన్నతాధికారికి దరఖాస్తును పంపించాల్సి ఉంటుంది. కానీ భవనం స్థాయిని బట్టి అధికారులందరికీ ఇవ్వాలంటూ కొందరు కనీసం రూ.ఐదు నుంచి రూ.పది లక్షలు వసూలు వసూలుచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు అందితే వారం రోజుల్లో ప్లాన్‌ ఆన్‌లైన్‌లో ఆమోదం పొందేస్తుంది. అలా కానట్టయితే ఏవో కొర్రీలు కారణంగా నెలలపాటు పెండింగ్‌లో ఉండిపోతుంది. అనుకున్నంత డబ్బులు ఇచ్చేస్తే తర్వాత భవన నిర్మాణం వైపు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చూడడం లేదు. సెట్‌బ్యాక్‌లు వదలకపోయినా, రోడ్డు వెడల్పు అవసరమైనంత లేకపోయినా సరే అంతా సక్రమంగానే ఉన్నట్టు నిర్మాణదారుడికి అండగా నిలుస్తారు. జారీచేసిన ప్లాన్‌ కంటే అదనపు అంతస్థులు నిర్మిస్తే...అందుకు తగ్గట్టు వసూలు చేస్తున్నారు.

Updated Date - Aug 22 , 2025 | 01:19 AM