గీత దాటితే... పట్టేస్తుంది
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:57 AM
కూడలిలో రెడ్‌సిగ్నల్ పడినా వెనుకాముందు ఆలోచించుకోకుండా దూసుకుపోయేవారి ఆటలు ఇకపై సాగవు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కు ఏఐ అస్త్రం
పైలట్ ప్రాజెక్టుగా ఐదు కూడళ్లు ఎంపిక
నాలుగు సంస్థలకు బాధ్యతలు అప్పగింత
ఆయా సంస్థల నుంచి డీపీఆర్ అందాక నగరమంతా అమలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కూడలిలో రెడ్‌సిగ్నల్ పడినా వెనుకాముందు ఆలోచించుకోకుండా దూసుకుపోయేవారి ఆటలు ఇకపై సాగవు. ఒకవేళ పోలీసులు చూడకపోయినా...జంక్షన్‌లో అమర్చిన ఏఐ టెక్నాలజీతో పనిచేసే సీసీ కెమెరాల నుంచి మాత్రం తప్పించుకోలేరు. వాహనం నంబర్, ఉల్లంఘనకు సంబంధించిన ఫొటో, సమయం, ప్రదేశం వంటి వివరాలతో ఈ-చలాన్ నేరుగా వాహన యజమాని ఇంటికి చేరిపోతోంది. అలాగే వాహనం నడుపుతున్న వ్యక్తి ముఖం ఆధారంగా అతని వివరాలు, చిరునామాను తెలుసుకుని పోలీసులకు అందజేస్తుంది.
నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలతోపాటు రోడ్డుప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, జీవీఎంసీ సంయుక్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోడ్డు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలకు ఏఐ టెక్నాలజీని అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే అన్నిచోట్ల ఒకేసారి కాకుండా పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో ఐదు కూడళ్లలో అమలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం ఆసక్తి ఉన్న సంస్థలు, కంపెనీలు నుంచి ప్రతిపాదనలను జీవీఎంసీ ఆహ్వానించింది. నోయిడాకు చెందిన మెటా ఫ్యూజన్, బెంగళూరుకు చెందిన డేటాకార్ట్, హైదరాబాద్‌కు చెందిన బృహస్పతి టెక్నాలజీస్, ముంబైకు చెందిన సీఎంఎస్ కంప్యూటర్స్ సంస్థలు తమ ఆసక్తిని తెలియజేశాయి. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ సంయుక్తంగా దీనిపై చర్చించారు. ఏఐ ట్రాఫిక్స్ సిగ్నల్స్ పనితీరు, దానివల్ల కలిగే ప్రయోజనాలను ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ సిగ్నల్ విధానం అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడేవారి వాహనాలకు సంబంధించిన ఫొటోలను తీసి, వాటి ఆధారంగా జరిమానాలను ఈ-చలాన్ ద్వారా విధించడం, ట్రాఫిక్ రద్దీని బట్టి సిగ్నల్స్ పడడం, పోలీసుల రికార్డుల్లో ఉండే పాత నేరస్థుల డేటాను అప్‌లోడ్ చేసిన సాఫ్ట్‌వేర్ ఆధారంగా వారెవరైనా రోడ్లపై కనిపిస్తే వారి ఫొటోలను తీసి సమాచారాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు చేరవేయడం, ట్రాఫిక్ రద్దీగా ఉండే రోడ్ల వివరాలను కమాండ్ కంట్రోల్‌రూమ్ ద్వారా నగరంలో ప్రయాణించే వారికి తెలియజేయడంతోపాటు ప్రత్యమ్నాయ రోడ్ల వివరాలను సూచించడం వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. నాలుగు సంస్థలకు ఐదు కూడళ్లలో పైలట్ ప్రాజెక్టుగా ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అమలు బాధ్యతలు అప్పగించారు. తొలిదశలో అక్కయ్యపాలెం, ఊర్వశి జంక్షన్, ఆర్‌అండ్‌బీ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్, ఎండాడ జంక్షన్‌లను ఎంపిక చేశారు. ఆయా జంక్షన్లన్నీ ‘వై’ జంక్షన్లు కావడంతో వాటిని తొలిదశ కింద ఎంపిక చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద ఐదు కూడళ్లలో అమలు చేసి, తరువాత ఫలితాలు, ఆయా కంపెనీలు ఇచ్చే డీపీఆర్ ఆధారంగా నగరంలోని అన్ని జంక్షన్లకు దీనిని అందుబాటులోకి తీసుకురావాలని సీపీ శంఖబ్రతబాగ్చి భావిస్తున్నట్టు ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన కూడళ్లు
1. అక్కయ్యపాలెం, 2. ఊర్వశి జంక్షన్, 3.ఎండాడ, 4.ఆర్‌అండ్‌బి జంక్షన్, 5.గోపాలపట్నం పెట్రోల్‌బంక్