ఇటొస్తే ఒళ్లు హూనమే..
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:38 PM
మండలంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు బలపం కోరుకొండకు వెళ్లే ప్రధాన రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. రాళ్లగెడ్డ నుంచి లోతుగెడ్డ బ్రిడ్జి వరకు రహదారి భారీ గోతులమయమైంది. ఈ రోడ్డుపై ఒకసారి ప్రయాణిస్తే ఒళ్లు హూనం అవుతుందని, వాహనాలు మూలకు చేరినట్టేనని వాహనచోదకులు వాపోతున్నారు.
గోతులమయంగా రాళ్లగెడ్డ- లోతుగెడ్డ రహదారి
89 గ్రామాల ఆదివాసీలకు తప్పని ఇబ్బందులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు నిర్లక్ష్యం
ఇప్పటికీ మారని పరిస్థితి
చింతపల్లి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు బలపం కోరుకొండకు వెళ్లే ప్రధాన రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. రాళ్లగెడ్డ నుంచి లోతుగెడ్డ బ్రిడ్జి వరకు రహదారి భారీ గోతులమయమైంది. ఈ రోడ్డుపై ఒకసారి ప్రయాణిస్తే ఒళ్లు హూనం అవుతుందని, వాహనాలు మూలకు చేరినట్టేనని వాహనచోదకులు వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ఈ రహదారిని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా పరిస్థితి మారలేదు.
మండలంలో పదేళ్ల క్రితం లోతుగెడ్డ-కోరుకొండ బలపం రహదారిని నిర్మించారు. ఈ రోడ్డుపై బలపం, కుడుముసారి, తమ్మంగుల పంచాయతీలకు చెందిన 89 గ్రామాల ఆదివాసీలు రాకపోకలు సాగిస్తుంటారు. లోతుగెడ్డ బ్రిడ్జి నుంచి రాళ్లగెడ్డకు ఎనిమిది కిలోమీటర్లు అడుగడుగునా గోతులున్నాయి. కొన్నిచోట్ల రహదారి ఆనవాళ్లు కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సు, సర్వీసు జీపులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు అతికష్టంపై రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వాహనాలు గోతుల్లో దిగబడిపోతున్నాయి. సర్వీసు ఆటోలు, జీపులు రెండు రోజులు ఈ మార్గంపై ప్రయాణిస్తే మరమ్మతులకు గురవుతున్నాయని డ్రైవర్లు వాపోతున్నారు.
ఐదేళ్ల పాటు పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
రాళ్లగెడ్డ-లోతుగెడ్డ బ్రిడ్జి వరకు రహదారిని మరమ్మతులు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు పట్టించుకోలేదు. రహదారిపై ఏర్పడిన గోతులను పూడ్చలేదు. ఐదేళ్ల పాటు నిర్లక్ష్యం చేయడంతో ఈ రహదారి పరిస్థితి అధ్వానంగా తయారైంది. లోతుగెడ్డ బ్రిడ్జి నుంచి రామారావుపాలెం, కోటగున్నలు, నిమ్మపాడు, రాళ్లగెడ్డ గ్రామ సమీపం వరకు రహదారిపై భారీ గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణిస్తే సర్కస్ ఫీట్లు చేసినట్టు ఉంటోందని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలోనూ మారని పరిస్థితి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికి రహదారి పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. కనీసం రహదారిపై ఏర్పడిన గోతులను అధికారులు పూడ్చేందుకు చర్యలు తీసుకోవడం లేదు. లోతుగెడ్డ బ్రిడ్జి నుంచి రాళ్లగెడ్డ వరకు నూతనంగా రహదారి నిర్మిస్తేనే తప్ప ఆదివాసీల రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించదు. వారం రోజుల క్రితం ఈ ప్రాంత ఆదివాసీలు రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆందోళన చేశారు. అధికారులు రహదారి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఈ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించాలని వాహనచోదకులు కోరుతున్నారు.