అడ్మిషన్లు లేకుంటే అనుమతులు రద్దు
ABN , Publish Date - Jun 26 , 2025 | 01:17 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని పలు డిగ్రీ కళాశాలల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 270 కాలేజీల్లో 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు అవుతుండడాన్ని ఉన్నత విద్యా శాఖ గుర్తించింది. అటువంటి కాలేజీలకు అనుమతులు కొనసాగించడంపై పునరాలోచన చేస్తోంది. ఈ విషయమై కాలేజీల నుంచి కూడా వివరణ తీసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
డిగ్రీ కళాశాలలపై ఉన్నత విద్యా శాఖ అధ్యయనం
ఏయూ పరిఽధిలో 192 డిగ్రీ కాలేజీలు
27 కళాశాలల్లో 25 శాతం కంటే తక్కువ ప్రవేశాలు
అటువంటి కాలేజీల కొనసాగింపుపై పునరాలోచన
కమిటీ ఏర్పాటు
విశాఖపట్నం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని పలు డిగ్రీ కళాశాలల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 270 కాలేజీల్లో 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు అవుతుండడాన్ని ఉన్నత విద్యా శాఖ గుర్తించింది. అటువంటి కాలేజీలకు అనుమతులు కొనసాగించడంపై పునరాలోచన చేస్తోంది. ఈ విషయమై కాలేజీల నుంచి కూడా వివరణ తీసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి విశాఖ పట్నంతోపాటు విజయనగరం జిల్లాలో 192 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 28 వేల మంది చేరారు. అయితే 27 కాలేజీల్లో 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు ఉన్నట్టు ఉన్నత విద్యా శాఖ గుర్తించింది. ఆయా కాలేజీల ప్రతినిధులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ముందుకువెళ్లి అడ్మిషన్లు తగ్గడానికి గల కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి కాలేజీలకు అనుమతులను రద్దు చేశారు. అయితే, కోర్టును ఆశ్రయించి మళ్లీ అనుమతులు తెచ్చుకున్నారు. ఉన్నత విద్యాశాఖ మరోసారి ఇదే తరహా నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధమవుతుండడంతో కాలేజీల యాజ మాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అవకాశం ఇస్తారా..?
అడ్మిషన్స్ తక్కువగా ఉన్న కాలేజీల యాజమాన్యా లను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఉన్నత విద్యా శాఖ పిలిపించి వివరణ తీసుకునే అవకాశం ఉంది. ఆయా కాలేజీలు ఇచ్చే వివరణను ఆధారంగా చేసుకుని ఈ ఏడాది ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారా?, లేక అనుమతులు రద్దు చేస్తారా.? అన్నది చూడాలి. ఈ ఏడాది ప్రవేశాల సంఖ్యను పెంచుకుంటామని, అందుకు అనుగుణంగా అవకాశం కల్పించాలని కాలేజీలు కోరే అవకాశం ఉంది. ఇకపోతే, విద్యార్థులు లేకుండా కళాశాల లను నిర్వహించడం యాజమాన్యాలకు కూడా భారమే. కానీ...ఎలా, ఎందుకు నిర్వహిస్తున్నారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
ఇదే కారణమా?
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల్లో దాదాపు 60 శాతం మందికిపైగా ఇంజనీరింగ్ వైపు వెళ్లిపోతున్నారు. ఇంజ నీరింగ్ కాలేజీలు ఒక్కో బ్రాంచ్‌లో నాలుగు, ఐదు సెక్షన్లు ఏర్పాటుచేసి మరీ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. దీంతో డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ్య రానురాను తగ్గుతోంది. డిగ్రీ పట్ల విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి తగ్గ డమే ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. ఈ పరి స్థితిలో మార్పు రావాలంటే డిగ్రీ పూర్తిచేసిన విద్యా ర్థులకు వస్తున్న ఉద్యోగాలు, వారికి ఉన్న అవకాశాలపై కాలేజీలు విస్తృతమైన ప్రచారాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.