ఇకపై గ్రీన్ పడితే రైట్..రైట్
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:40 AM
నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి వాహనచోదకులకు త్వరలో విముక్తి లభించనున్నది.
వడివడిగా నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్
నాలుగు సంస్థలతో ట్రయల్ రన్ పూర్తి
అక్టోబరులో టెండర్లు పిలవనున్న జీవీఎంసీ
నవంబరు నుంచి ప్రాజెక్టు అమలులోకి వచ్చే అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి వాహనచోదకులకు త్వరలో విముక్తి లభించనున్నది. ఒకచోట ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ పడితే తరువాత వేరే జంక్షన్‌కు వెళ్లేసరికి కూడా గ్రీన్ సిగ్నల్ పడేలా సిగ్నల్స్ సింక్రనైజేషన్ ప్రక్రియకు అధికారులు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే నాలుగు సంస్థలతో నగరంలో నాలుగు చోట్ల నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో జీవీఎంసీ అధికారులు ఆసక్తి వ్యక్తీకరణ (ఆర్‌ఎఫ్‌పీ), తరువాత టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. నవంబరు నాటికి నగరంలో కొత్త సిగ్నల్ విధానం అందుబాటులోకి వస్తుందని జీవీఎంసీ, పోలీస్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య అధికమవుతోంది. జాతీయ రహదారిపై ఎయిర్‌పోర్టు నుంచి ఆనందపురం జంక్షన్‌కు చేరుకోవాలంటే కనీసం గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. అదే ఉదయం, సాయంత్రం వంటి రద్దీ వేళల్లో అయితే మరో గంట సమయం అదనంగా పడుతుంది. ఒకచోట రెడ్ సిగ్నల్ పడితే రెండు నిమిషాలు వేచివున్నాక గ్రీన్ సిగ్నల్ పడింది కదా అని ముందుకు వెళితే అక్కడ రెడ్ సిగ్నల్ పడి ఉంటుంది. దీంతో అక్కడ మరోసారి నిరీక్షించాల్సి ఉంటుంది. కొమ్మాది, కార్ షెడ్, హనుమంతవాక, ఇసుకతోట వంటి కూడళ్ల వద్ద అయితే రెండుసార్లు సిగ్నల్ పడితే గానీ జంక్షన్ దాటలేని పరిస్థితి ఉంటుంది. దీనివల్ల నగరంలో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, వేగంగా వెళ్లిపోవాలనే ఆత్రుతలో వాహనచోదకులు ప్రమాదాలకు గురికావడం జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్ చేయాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉన్నప్పటికీ అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, ప్రజాప్రతినిధుల నుంచి సహకారం లోపించడం వంటి కారణాలతో ఇది ప్రతిపాదనలకే పరిమితమైపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, దేశ ప్రధాని, రాష్ట్రపతి వంటి ప్రముఖులు పర్యటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా తయారైంది. దీనిని అధిగమించేందుకు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను సింక్రనైజేషన్ చేయడం ద్వారా ఒక పరిమిత వేగంతో ప్రయాణించే వాహనం ఒకచోట గ్రీన్ సిగ్నల్ దాటి వెళితే తరువాత జంక్షన్‌లో కూడా గ్రీన్ సిగ్నల్ పడివుండేలా సాంకేతిక పరిజ్ఞానంతో సిగ్నల్ వ్యవస్థను మార్చే ప్రతిపాదనపై సీపీ శంఖబ్రత బాగ్చి దృష్టిసారించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో నిధుల సర్దుబాటు గురించి రెండు నెలల కిందట సీపీ ప్రస్తావిచంగా.. ఆయన సుముఖత వ్యక్తం చేశారు. దీనిని కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తోపాటు ఎంపీ శ్రీభరత్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపీ శ్రీభరత్ వీలైనంత వేగంగా దీనిపై చర్యలు ప్రారంభించాలని సీపీ, జీవీఎంసీ కమిషనర్‌లకు సూచించడంతో గతనెలలో ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్ ప్రాజెక్టు నిర్వహణలో అనుభవం కలిగిన సంస్థలతో సంప్రతింపులు జరిపారు. హైదరాబాద్, బెంగళూరు, లక్నో, ఢిల్లీ, ఇండోర్ వంటి నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న బృహస్పతి, అవిరోస్, అర్కడిస్, నయన్ సంస్థలు నగరంలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాల్లో సర్వే చేపట్టాయి. నాలుగు సిగ్నల్ పాయింట్ల వద్ద ట్రయల్ రన్ నిర్వహించగా విజయవంతమైంది. ఇందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటీవల ఎంపీ శ్రీభరత్ సమక్షంలో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్‌లకు ఆయా సంస్థలు వివరించాయి. ఎంపీ శ్రీభరత్ సంతృప్తి వ్యక్తం చేయడంతో తక్షణమే ఈ ప్రాజెక్టు నిర్వహణకు ఆర్‌ఎఫ్‌పీ పిలిచి, అక్టోబరు చివరి నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు దీనికి అనుగుణంగా చర్యలను వేగవంతం చేశారు. అంతా అనుకున్నట్టు జరిగితే నవంబరు నాటికి నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పోలీస్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.