Share News

వానొస్తే.. వణుకే!

ABN , Publish Date - May 31 , 2025 | 01:01 AM

పాడేరు ఘాట్‌ మార్గంలో వర్షం కురిస్తే చాలు ప్రయాణికులు, వాహనదారులకు ఆందోళన మొదలవుతోంది. మోస్తరు వర్షం కురిసినా ఘాట్‌లో చెట్లు కూలడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వారం రోజుల్లోనే పాడేరు ఘాట్‌లో అనేక చోట్ల చెట్లు కూలిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తూ చెట్లు వాహనాలపై పడకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వానొస్తే.. వణుకే!
పాడేరు ఘాట్‌లో డైమండ్‌ మార్క్‌ సమీపంలో గురువారం ఉదయం కూలిన చెట్టు

ప్రమాదభరితంగా ఘాట్‌ ప్రయాణం

వర్షాలు కురిస్తే కూలుతున్న చెట్లు

వారం రోజుల్లో చాలా చోట్ల కూలిన చెట్లు

రాకపోకలకు ప్రయాణికులు, వాహనదారుల ఆందోళన

వాహనాలపై పడితే ఊహించలేని ఘోరం

శాశ్వత ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని వేడుకోలు

(ఆంధ్రజ్యోతి-పాడేరు)

పాడేరు ఘాట్‌ మార్గంలో వర్షం కురిస్తే చాలు ప్రయాణికులు, వాహనదారులకు ఆందోళన మొదలవుతోంది. మోస్తరు వర్షం కురిసినా ఘాట్‌లో చెట్లు కూలడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వారం రోజుల్లోనే పాడేరు ఘాట్‌లో అనేక చోట్ల చెట్లు కూలిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తూ చెట్లు వాహనాలపై పడకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

రోడ్డుకడ్డంగా కూలుతున్న చెట్లు

పాడేరు ఘాట్‌లో ఇటీవల కాలంలో చెట్లు కూలడం అధికమైంది. ఈ వారం రోజుల్లోనే మినుములూరుకు సమీపంలో రెండు చోట్ల, అమ్మవారి పాదాలు, వ్యూపాయింగ్‌, రాజాపురం, డైమండ్‌మార్క్‌ సమీపంలో అనేక చోట్ల, వంట్లమామిడికి సమీపంలో చెట్లు పడిపోయాయి. విషయం తెలిసిన వెంటనే రోడ్ల, భవనాల శాఖ సిబ్బంది, పోలీసులు వెళ్లి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగిస్తున్నారు. అంతవరకు ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. దీంతో వర్షం పడితే ఘాట్‌ రోడ్డులో ఏ క్షణంలో ఎటువంటి సమస్య వస్తుందోననే అటు ప్రయాణికుల్లోను, ఇటు అధికార యంత్రాంగంలోను ఆందోళన మొదలవుతోంది. ఘాట్‌లో చెట్లు, కొండచరియల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఘాట్‌లో పది కిలోమీటర్ల పరిధిలోనే..

పాడేరు ఘాట్‌ రోడ్డు 25 కిలోమీటర్లుండగా దానిలో కేవలం పది కిలోమీటర్ల పరిధిలోని చెట్లు కూలడం, కొండచరియలు విరిగిపడడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా అమ్మవారి పాదాలు నుంచి వంట్లమామిడి గ్రామం వరకు ఉన్న పది కిలోమీటర్ల ఘాట్‌ మార్గంలోనే ఈ పరిస్థితులున్నాయి. ఘాట్‌లో వ్యూపాయింట్‌, రాజాపురం, డైమండ్‌ మార్క్‌ సమీప ప్రాంతాల్లోనే చెట్లు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడుతున్నాయి. అలాగే వ్యూపాయింట్‌కు సమీపంలో ఉన్న రెండు మలుపులు వద్ద భారీ వర్షం కురిస్తే, అక్కడ వరద నీరు నిల్వ ఉండడంతోపాటు కొండ పైనుంచి కిందకు బురద వచ్చి పడుతుంది. ఆ సమయంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనాల డ్రైవర్లు అంటున్నారు. దీంతో వర్షాలు కురిసినపుడు ఘాట్‌లో రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు, వాహనాల డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే పరిష్కారం లభిస్తుందనే వాదన బలంగా వినిపిస్తుంది.

ఘాట్‌ మార్గాల్లో భద్రతకు ఏమి చేయాలంటే..

8 ఘాట్‌లో చెట్లు, కొండచరియల కారణంగా ప్రమాదకరంగా ఉన్న మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలి.

8కూలేందుకు సిద్ధంగా, ప్రమాదకరంగా ఉన్న చెట్లను తక్షణమే తొలగించాలి.

8వర్షం నీరు రోడ్డుపైకి రాకుండా ఘాట్‌కు కొండ వైపున డ్రైన్లు నిర్మించాలి.

8ఘాట్‌లో రోడ్డుపై నుంచి నీరు ప్రవహించకుండా అవసరమైన చోట్ల పైపు కల్వర్టులను నిర్మించాలి.

Updated Date - May 31 , 2025 | 01:01 AM