అగ్గిపుడితే బుగ్గే!
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:21 AM
బాణసంచా దుకాణాల ఏర్పాటులో వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.
బాణసంచా దుకాణాల ఏర్పాటులో ఇష్టారాజ్యం
దుకాణానికి దుకాణానికి మధ్య పది అడుగులు దూరం ఉండాలని నిబంధన
మూడు అడుగులు మాత్రమే విడిచిపెట్టిన వైనం
వ్యాపారుల పేరుతో చక్రం తిప్పుతున్న దళారులు
ఇప్పటికీ అనుమతివ్వని పోలీస్ శాఖ
చోద్యం చూస్తున్న అగ్నిమాపక, టౌన్‌ప్లానింగ్ అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
బాణసంచా దుకాణాల ఏర్పాటులో వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. పోలీస్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే ఏయూ, అళ్వార్‌దాస్ మైదానాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. పొరపాటున ప్రమాదం జరిగితే ఆస్తి, ప్రాణనష్టాలు జరగకుండా రెండు దుకాణాల మధ్య కనీసం పది అడుగుల దూరం ఉండాలని నగర పోలీసు కమిషనర్ విడుదల చేసిన ఆదేశాల్లో ఉంది. వీటిని పట్టించుకోకుండా మూడు అడుగుల దూరం మాత్రేమ ఖాళీ ఉంచి దుకాణాలు ఏర్పాటుచేశారు. పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దుకాణాలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎడం పాటించకుండా ఏర్పాటుచేసిన దుకాణాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దీపావళి పండగ వస్తే ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం, ఎంవీపీకాలనీలోని ఏఎస్ రాజా కళాశాల మైదానం, తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున బాణసంచా దుకాణాలు ఏర్పాటుచేస్తారు. దీపావళికి రెండు రోజులు ముందుగా బాణసంచా విక్రయాలు ప్రారంభిస్తారు. అయితే గతంలో బాణసంచా దుకాణాల ఏర్పాటు విషయంలో వ్యాపారులు కాకుండా వైసీపీ నేతలు ‘ఫైర్ మర్చంట్స్ అసోసియేషన్’ పేరుతో గంపగుత్తగా బినామీపేర్లతో అనుమతులు తెచ్చుకున్నారు. ఏయూ, ఏఎస్ రాజా కళాశాల మైదానాల్లో వారే దుకాణాలు ఏర్పాటుచేసి వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ ఏడాది దీపావళికి బాణసంచా దుకాణాల కోసం వ్యాపారులు కాకుండా కూటమి ప్రజా ప్రతినిధి అనుచరులు ఇద్దరు రంగంలోకి దిగారు. గతంలో వైసీపీ నేతల మాదిరిగానే అసోసియేషన్ పేరుతో ఏయూ, ఏఎస్ రాజా మైదానాల్లో దుకాణాల ఏర్పాటుకు బినామీ పేర్లతో దరఖాస్తులు చేశారు. వాటిని జీవీఎంసీ, ప్రాంతీయ అగ్నిమాపక శాఖ, ఈపీడీసీఎల్ అధికారులు పరిశీలించి నిబంధనలు పాటించినట్టు నిర్ధారించుకుని అనుమతులు జారీచేయాల్సి ఉంది. అన్ని శాఖల నుంచి ఎన్‌వోసీలు తీసుకుని దరఖాస్తుకు జతచేసి పోలీస్ శాఖకు అందజేస్తే, వారు పరిశీలించి అనుమతులు జారీచేస్తారు. ఈ ఏడాది ఏయూ ఇంజనీరింగ్, ఏఎస్ రాజా మైదానాల్లో దుకాణాల ఏర్పాటుకు జీవీఎంసీ, అగ్నిమాపక శాఖ, ఈపీడీసీఎల్, పోలీస్ శాఖల నుంచి అనుమతులు జారీకాకుండానే కూటమి ప్రజాప్రతినిధి అనుచరులు దుకాణాల ఏర్పాటు పనులు పూర్తిచేశారు. ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో 126, ఏఎస్ రాజా కళాశాల మైదానంలో 36 దుకాణాలు ఏర్పాటుచేసి ఒక్కోటి రూ.1.2 లక్షలకు వ్యాపారులకు విక్రయించేయడం విశేషం. కొమ్మాదిలో కూడా ఇదే మాదిరి అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటుచేస్తే జోన్-2 టౌన్‌ప్లానింగ్, పోలీస్ అధికారులు వాటిని శుక్రవారం తొలగించారు. కానీ నగరంలో అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. అనుమతులు వస్తాయనే ధీమాతో ఒకవేళ ఎవరైనా దుకాణాలు ఏర్పాటుచేసినా అగ్నిమాపక శాఖ అధికారులు వాటిని పరిశీలించి అభ్యంతరాలు ఉంటే వెంటనే సరిచేసేలా ఆదేశించాలి. దుకాణాల వద్ద అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేని విధంగా జాగ్రత్తలు పాటించడంతోపాటు ఏదైనా జరిగితే సకాలంలో మంటలను అదుపుచేయగలిగే పరిస్థితి ఉండేలా చూడాలి. కానీ మూడు అడుగులు దూరంలోనే దుకాణాలు ఏర్పాటుచేస్తుంటే అగ్నిమాపకశాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఆ శాఖ పనితీరుకు అద్దంపడుతోంది. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే దుకాణాలన్నింటికీ క్షణాల్లో మంటలు వ్యాపించే అవకాశం ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని నివాసాలు, భవనాలకు సైతం ముప్పు పొంచి ఉంటుందనే విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని పలువురు హెచ్చరిస్తున్నారు.