ప్రజల ఆకాంక్షలను గుర్తించండి
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:50 AM
జనసేన పార్టీ నిలదొక్కుకోవడానికి జన సైనికులు, వీర మహిళలే కారణమని అధినేత కె.పవన్‌కల్యాణ్ అన్నారు.
అందుకు అనుగుణంగా నడుచుకోండి
నాయకులకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దిశానిర్దేశం
పార్టీ నిలదొక్కుకోవడానికి జన సైనికులు, వీర మహిళలే కారణం
విశాఖ నగరంతో పార్టీకి విడదీయలేని అనుబంధం
కూటమితో కలిసి ఉంటూనే పార్టీ బలోపేతం: ఎమ్మెల్యే సుందరపు
రుషికొండ ప్యాలెస్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటరీ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో తీర్మానం
నేడు ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశం
విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):
జనసేన పార్టీ నిలదొక్కుకోవడానికి జన సైనికులు, వీర మహిళలే కారణమని అధినేత కె.పవన్‌కల్యాణ్ అన్నారు. శుక్రవారం బే వ్యూ హోటల్‌లో నిర్వహించిన పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఓటమిని తాను అనేకసార్లు, అనేక విధాలుగా ఎదుర్కొన్నానన్నారు. అయితే జనసైనికులంతా తనకు కష్టాల్లో అండగా నిలిచారని ప్రశంసించారు. తాను ఒక ఫ్రేమ్ వర్క్‌లోనే పనిచేస్తానని, ఏదైనా చేయాలని అనుకుంటే చేస్తానని, చేయకూడదని అనుకుంటే చేయబోనని స్పష్టంచేశారు. ఈరోజు జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే..కోట్లాది మంది జన సైనికుల వల్లనేనని అంతా గుర్తుంచుకోవాలన్నారు. వారందరికీ ఏమి కావాలో వాటి కోసం పనిచేయాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని నాయకులకు సూచించారు. విశాఖపట్నం ఎప్పుడూ జనసేన పార్టీకి అండగా ఉందని, ఇక్కడి ప్రజలు తాము ఉన్నామనే భరోసా ఇచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. జనవాణి కార్యక్రమం కోసం విశాఖపట్నం వస్తే నోవాటెల్ హోటల్‌లో పోలీసులు నిర్బంధించారని, బయటకు రానివ్వలేదని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి ఓ మహిళా అభిమాని చంటిబిడ్డను చంకలో ఎత్తుకొని వచ్చి, పార్టీకి అండగా నడిరోడ్డుపై నిలబడిందన్నారు. అదేవిధంగా అంతకుముందు 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు తొలుత విశాఖపట్నం వస్తే వేలాది మంది అభిమానంతో వచ్చి స్వాగతం పలికారన్నారు. విశాఖతో జనసేన పార్టీ బంధం విడదీయరానిదన్నారు.
కూటమితో కలిసి ఉంటూనే పార్టీ బలోపేతం
కూటమితో కలిసి ఉంటూనే సొంతంగా జనసేన బలోపేతం అవుతుందని, దానికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తెలిపారు. బీచ్‌రోడ్డులోని బే వ్యూ హోటల్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో పవన్ కల్యాణ్ మాట్లాడిన అంశాలను సుందరపు వెల్లడించారు. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యేలా నాయకత్వం అభివృద్ధి చెందాలని సూచించారన్నారు. రుషికొండ ప్యాలెస్‌పై త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానం చేశామని, దానిని సీఎం చంద్రబాబునాయుడుకు అందజేస్తామన్నారు. రుషికొండ పెద్ద అంశం కాదని వైసీపీ నేతలు అంటున్నారంటే...వారికి ప్రజాధనం రూ.453 కోట్లు అంటే లెక్కలేదని అర్థం చేసుకోవాలన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం జరిగేది బహిరంగ సభ కాదని, పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశం అని, రాత్రి 7.30 గంటల వరకు జరుగుతుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా వస్తున్నారన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు తోట నగేశ్ పాల్గొన్నారు.