Share News

నగరంలో ఐకానిక్‌ భవనం

ABN , Publish Date - Nov 17 , 2025 | 01:41 AM

నగరంలో 50 అంతస్థులతో ఐకానిక్‌ భవనం నిర్మిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు.

నగరంలో ఐకానిక్‌ భవనం

50 అంతస్థులతో నిర్మించనున్న వీఎంఆర్‌డీఏ

కొత్తవలస, శొంఠ్యాంలో థీమ్‌బేస్డ్‌ సిటీస్‌

పురపాలక, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి నారాయణ

సిరిపురం, నవంబరు 16 ( ఆంధ్రజ్యోతి):

నగరంలో 50 అంతస్థులతో ఐకానిక్‌ భవనం నిర్మిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. వీఎంఆర్డీఏ సమావేశమందిరంలో సంస్థ చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై అధికారులతో ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా ఏడు బృహత్తర ప్రణాళిక రహదారుల నిర్మాణంపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. విమానాశ్రయం ప్రారంభించే సమయానికి పూర్తి చేయాలన్నారు. ఒప్పందం మేరకు గడువులోగా పనులు పూర్తిచేసేలా కాంట్రాక్టర్లను అప్రమత్తం చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఎంఐజీ లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ పెట్టాలన్నారు. కొన్ని డిసెంబరు నెలాఖరు, మిగిలినవి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌/బీపీఎస్‌ ధరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, తద్వారా సంస్థకు ఆర్ధిక పరిపుష్టి కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కొత్తవలసలో 120 ఎకరాలు, శొంఠ్యాంలో 80 ఎకరాల్లో థీమ్‌ బేస్డ్‌ సిటీస్‌ నిర్మాణం, ల్యాండ్‌ పూలింగ్‌, పీపీపీ ప్రాజెక్టుల స్థితిగతులపై ఆరా తీసి, పలు సూచనలు చేశారు. సమీక్ష సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, వీఎంఆర్డీఏ కమిషనర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌, జాయింట్‌ కమిషనర్‌ రమేష్‌, కార్యదర్శి మురళీ కృష్ణ, ప్రధాన ప్రణాళిక అధికారి శిల్ప, ప్రధాన ఇంజనీర్‌ వినయ్‌కుమార్‌, జీవీఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


అనకాపల్లి, రాజమండ్రిలో పీసీబీ ఆఫీసులు

విశాఖలో చీఫ్‌ ఇంజనీరు కార్యాలయం

కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ కృష్ణయ్య

విశాఖపట్నం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):

పనిభారం తగ్గించడం, నాణ్యమైన సేవలు అందించడం, సకాలంలో సమర్ధంగా పనిచేసే దిశగా ప్రతి జిల్లాలో కార్యాలయాలు ఏర్పాటుచేస్తున్నట్టు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్య తెలిపారు. ఇందులో భాగంగా అనకాపల్లి, రాజమండ్రిలో కార్యాలయాల ఏర్పాటుకు బోర్డు, ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.

పరిశ్రమల పర్యవేక్షణ, తనిఖీలు, ప్రమాదాలు జరిగినపుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేలా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరివరకు ఫార్మా, ఇతర పరిశ్రమలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా విశాఖపట్నంలో చీఫ్‌ ఇంజనీరు ఉండాలని అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా చాలా శాఖలకు జిల్లా స్థాయి అధికారులను నియమించారని, కాలుష్యనియంత్రణమండలి ఈఈ కేడర్‌లో కార్యాలయం ఉండాలన్నారు. మండలిల సంస్కరణలు అమలుచేశామన్నారు. బోర్డుకు అధికారుల కొరత ఉందని, చీఫ్‌ ఇంజనీరు నుంచి నాలుగు జోన్‌లకు జాయింట్‌ చీఫ్‌ ఇంజనీరు పోస్టులు, ఎస్‌ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నామనానరు. ఇటీవల 21 ఏఈ పోస్టులు భర్తీచేశామని, త్వరలో జిల్లాలకు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్న తరుణంలో కాలుష్యనియంత్రణమండలి పాత్ర కీలకమన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అనుమతుల కోసం పారిశ్రామికవేత్తలు/వారి ప్రతినిధి జిల్లాల్లోని పీసీబీ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నంలో కాలుష్యనిర్ధారణ కోసం ప్రస్తుతం ఒక ఆన్‌లైన్‌ యాంబియంట్‌ ఎయిర్‌క్వాలిటీ యంత్రం ఉందని, మరో రెండు మూడు యంత్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 01:41 AM