Share News

రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషిచేస్తా

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:42 AM

రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తానని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషిచేస్తా

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్‌

సింహాచలం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తానని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. ఆయన కుటుంబ సమేతంగా శుక్రవారం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాధవ్‌ మాట్లాడుతూ కూటమి పార్టీల నేతలందరితో కలిసి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని నిశ్చయించుకున్నట్టు చెప్పారు. అదేవిధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయ వైభవాన్ని, అవతార విశిష్టతలను ప్రపంచానికి తెలిపేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వరాహ పుష్కరిణి, పూదోట, గోశాల వంటి వాటి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, భైరవస్వామి క్షేత్రానికి వెళ్లే మార్గాన్ని సంబంధిత అధికారులతో చర్చించి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. మాధవ్‌కు సింహాచల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేశారు. ఆ తరువాత కప్ప స్తంభ ఆలింగనం, గోదాదేవి దర్శనం చేసుకున్న మాధవ్‌కు పండితులు వేదాశీర్వచనాలీయగా, ఈఓ శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. మాధవ్‌ వెంట బీజేపీ నగర అధ్యక్షులు పరశురామరాజు, 98వ వార్డు పార్టీ అధ్యక్షుడు రచ్చా ఆనందవర్మ, తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:42 AM