Share News

ఉత్తరాంధ్ర అంటే ఎంతో ఇష్టం

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:42 AM

ఉత్తరాంధ్ర అంటే ఎంతో ఇష్టమని, వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు కొణిదెల నాగబాబు అన్నారు. గురువారం అనకాపల్లి విచ్చేసిన ఆయన సత్యా గ్రాండ్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు.

ఉత్తరాంధ్ర అంటే ఎంతో ఇష్టం
నాగబాబుకు వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరిస్తున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

త్వరలో ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు

అనకాపల్లిలో కార్యకర్తల సమావేశం

హాజరైన ఉమ్మడి విశాఖ రూరల్‌ జిల్లా జనసైనికులు

కొత్తూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ఉత్తరాంధ్ర అంటే ఎంతో ఇష్టమని, వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు కొణిదెల నాగబాబు అన్నారు. గురువారం అనకాపల్లి విచ్చేసిన ఆయన సత్యా గ్రాండ్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులు, ప్రజలు అంటే ఎంతో గౌరవమని, అతి త్వరలోనే ఈ ప్రాంతంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్రస్థాయి కమిటీలు వేసేందుకు అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో త్వరలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాడేరుకు చెందిన గిరిజన వీరమహిళ పద్మ.. తన భర్త ఆరోగ్య పరిస్థితి బాలేదని చెప్పగా.. నాగబాబు వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. మెరుగైన వైద్యం అందించేందుకు మరింత సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబుకు స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ఈ సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, ఉమ్మడి విశాఖ రూరల్‌ జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ కార్యాలయం సందర్శన

అనకాపల్లి రింగురోడ్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయాన్ని నాగబాబు గురువారం ఉదయం సందర్శించారు. తొలుత ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆయనకు స్వాగతం పలికారు. నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందించి పట్టువస్ర్తాలతో సత్కరించారు. ఆయన వెంట అనకాపల్లి నియోజకవర్గం ఇన్‌ఛార్జి భీమరశెట్టి రామకృష్ణ (రాంకీ), కూటమి నాయకులు దూలం గోపి, మంగా ఈశ్వర్‌, భీశెట్టి సుధ, గొంతిన శ్రీనివాసరావు, ఉగ్గిన రమణమూర్తి తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 12:42 AM