Share News

బడికి వెళ్లాలంటే 10 కి.మీ.లు నడవాల్సిందే

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:28 AM

మండలంలోని అర్ల పంచాయతీ శివారు పెదగరువు, కొత్తలోసింగి, పాతలోసింగి గిరిజన గ్రామాలకు చెందిన పిల్లలకు చదువు భారంగా మారింది. పాఠశాలకు వెళ్లిరావడానికి రోజూ పది కిలోమీటర్లు నడవాల్సి వస్తున్నది. రాకపోకల సమయంలో వర్షం కురిస్తే తడిసిపోయి జ్వరాలబారిన పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

బడికి వెళ్లాలంటే 10 కి.మీ.లు నడవాల్సిందే
పుస్తకాల బ్యాగులతో నడుచుకుంటూ వై.బి.పట్నం పాఠశాలకు వెళుతున్న గిరిజన విద్యార్థులు

రోజూ ఇబ్బంది పడుతున్న గిరిజన చిన్నారులు

ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు వినతి

రోలుగుంట, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అర్ల పంచాయతీ శివారు పెదగరువు, కొత్తలోసింగి, పాతలోసింగి గిరిజన గ్రామాలకు చెందిన పిల్లలకు చదువు భారంగా మారింది. పాఠశాలకు వెళ్లిరావడానికి రోజూ పది కిలోమీటర్లు నడవాల్సి వస్తున్నది. రాకపోకల సమయంలో వర్షం కురిస్తే తడిసిపోయి జ్వరాలబారిన పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగా గత ఏడాది వరకు మండలంలోని వై.బి.పట్నం పాఠశాల ఉపాధ్యాయుడుని డిప్యూటేషన్‌పై నియమించి లోసింగిలో పాఠాలు బోధించారు. గత ఏడాది ఏప్రిల్‌లో డిప్యూటేషన్‌ ముగిసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు వారాలు అయ్యింది. డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయుడుని నియమించలేదు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన సుమారు 15 మంది విద్యార్థులు రోజూ వై.బి.పట్నం పాఠశాలకు వెళ్లాల్సి వస్తున్నది. కలెక్టర్‌ స్పందించి తమ గ్రామంలో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి ఉపాధ్యాయుడుని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా వచ్చే నెల ఒకటో తేదీలోగా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయకపోతే పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని గిరిజన సంఘం నాయకులు కె.గోవిందరావు, కిల్లో నరసయ్య, కామేశ్‌ హెచ్చరించారు.

కాగా లోసింగికి డిప్యూటీషన్‌పై ఇంతవరకు ఉపాధ్యాయుడుని నియమించకపోవడంపై ఎంఈఓ జాన్‌ ప్రసాద్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కొరగా... సమస్య తన దృష్టికి కూడా వచ్చిందన్నారు. ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆగస్టులో ఆదేశాలు జారీ చేస్తుందని, అనంతరం లోసింగిలోనే పాఠశాలను నిర్వహిస్తామని చెప్పారు. అయితే పిల్లల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అప్పటి వరకు లోసింగిలోనే వలంటీర్‌ను ఏర్పాటు పాఠాలు బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Jun 27 , 2025 | 12:28 AM