ఆరిలోవ లోని ఐ బొమ్మ రవి ఇల్లు
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:43 AM
కొత్త సినిమాల పైరసీ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి స్వస్థలం విశాఖ. అతడి అరెస్టు నేపథ్యంలో అక్కడి పోలీసులు నగరానికి వచ్చి సోదాలు చేశారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.
ఐ బొమ్మ రవి ఇంట్లో సోదాలు?
నగరంలో విస్తృత ప్రచారం
ఖండించిన నగర పోలీసులు
విశాఖపట్నం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):
కొత్త సినిమాల పైరసీ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి స్వస్థలం విశాఖ. అతడి అరెస్టు నేపథ్యంలో అక్కడి పోలీసులు నగరానికి వచ్చి సోదాలు చేశారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే నగర పోలీసులు దానిని ఖండిస్తున్నారు.
పెదగదిలికి చెందిన రవి ఎంవీపీకాలనీలోని శాంత ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్ వరకు చదువుకున్నాడు. రవి తండ్రి ఇమంది చిన్నఅప్పారావు బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. రవి తల్లి సుమారు 20 ఏళ్ల కిందటే ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగిరాలేదు. ఇంటర్ తర్వాత రవి ముంబయి వెళ్లి ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొంతకాలం పనిచేసి విదేశాలకు వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే పదేళ్ల కిందట ఒక యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారికి ఒక అబ్బాయి కూడా ఉన్నట్టు సమాచారం. భార్యతో విభేదాలు తలెత్తడంతో గత రెండేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నట్టు తెలిసింది. కంప్యూటర్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో పట్టు సాధించి కొత్తసినిమాల సర్వర్లను హ్యాక్‌చేసి ఐబొమ్మ, బప్పం, ఐవిన్ వంటి పేర్లతో వైబ్‌సైట్‌లు రూపొందించి సినిమాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉంచేవాడు. దీనిపై సినిమా నిర్మాతలు హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో వారు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ వచ్చిన రవిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఆరిలోవలోని అతని ఇంట్లో సోదాలు చేశారని నగరంలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై విశాఖ నగర పోలీస్ ఉన్నతాధికారులతోపాటు, ఆరిలోవ పోలీసులను ఆరా తీయగా తమకు ఎలాంటి సమాచారం లేదని, తనిఖీల ప్రచారాన్ని ఖండించారు. రవి తండ్రి ఒక్కరే ప్రస్తుతం పెదగదిలిలోని ఇంట్లో నివసిస్తున్నట్టు తెలిసింది.
నేడు స్టీల్‌ప్లాంటు కార్మికుల మహా ధర్నా
ఉక్కుటౌన్‌షిప్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధిస్తేనే పూర్తి వేతనం చెల్లిస్తామని, లేదంటే ఉత్పత్తికి తగ్గ వేతనం మాత్రమే ఇస్తామని శనివారం యాజమాన్యం ఇచ్చిన ఉత్తర్వులపై స్లీల్‌ప్లాంటు కార్మికులు మండిపడుతున్నారు. ఈ మేరకు సోమవారం ప్లాంటు గేటు ఎదుట ధర్నా చేస్తామని అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు తెలిపారు. ఉక్కు యాజమాన్యం కార్మికులు, ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, కార్మికుల్లో ఆత్మస్ధైర్యం దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. యాజమాన్యం ఉత్తర్వులకు వ్యతిరేకంగా చేపట్టే ధర్నాలో భారీఎత్తున ఉద్యోగులు పాల్గొనాలని కోరారు.