వేట విస్తృతం
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:14 AM
సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు మరింత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మత్స్యకారులకు కేంద్రం వరం
ప్రాదేశిక జలాలు దాటి జాతీయ జలాల్లోకి వెళ్లడానికి అనుమతి
పెరగనున్న సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు మరింత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ప్రాదేశిక జలాలు దాటి ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్)లోకి వెళ్లి చేపలను వేటాడేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై మత్స్యకారులు డీప్ సీ ఫిషింగ్ చేసి బోట్ల నిండా చేపలను వేటాడి తెచ్చుకోవచ్చు.
సముద్రంలో చేపలను వేటాడే మత్స్యకారులు తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం వరకే వెళ్లాలనేది ఇప్పటివరకూ ఉన్న నిబంధన. ఇవి రాష్ట్ర జలాలు. వీటినే ప్రాదేశిక జలాలు అంటారు. ప్రతి రాష్ట్రానికి ఈ నిబంధన ఉంది. 12 నాటికల్ మైళ్లు దాటి తీరం నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు జాతీయ జలాలు. దీనిని ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఈఈజెడ్)గా పేర్కొంటారు. ఈ జలాల్లోకి ప్రవేశించి చేపలను వేటాడాలంటే ప్రత్యేకంగా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. టూనా చేపలను వేటాడడానికి ఉపయోగించే లాంగ్ లైనర్లకు ఇలాంటి అనుమతులు ఇచ్చేవారు. కొంతమంది అత్యధిక సామర్థ్యం కలిగిన విదేశీ తయారీ బోట్లను తీసుకువచ్చి, వాటికి ఇండియన్ రిజిస్ట్రేషన్ చేయించి లైసెన్స్‌లు తీసుకునేవారు. వాటితో పోటీ పడలేక భారతీయ బోట్లు వెనుకపడేవి. దీనిపై విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా లైసెన్స్‌లు ఇవ్వడం మానేసింది.
కాలుష్యంతో వేట తగ్గి మరింత ముందుకు...
తీరం వెంబడి పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కావడం, వాటి కాలుష్య వ్యర్థాలను సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల తీరాన్ని ఆనుకొని ఉన్న ప్రాదేశిక జలాల్లో చేపల లభ్యత తగ్గిపోయింది. దాంతో మత్స్యకారులు అనధికారికంగా జాతీయ జలాల్లోకి వెళ్లి వేటాడుతున్నారు. కొన్నిసార్లు కోస్టుగార్డుకు దొరికిపోతున్నారు. ఒక్కోసారి చేపలను వెదుక్కుంటూ శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు కూడా వెళ్లిపోతున్నారు. వెనక్కి తీసుకురావడం కత్తిమీద సాముగా మారుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జలాల్లో 200 నాటికల్ మైళ్ల వరకు ఎవరైనా వేట చేసుకోవచ్చునంటూ వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో డీప్ సీ ఫిషింగ్‌కు అవకాశం లభించింది.
జాగ్రత్తలు తప్పనిసరి
లక్ష్మణరావు, జాయింట్ డైరెక్టర్, మత్స్యశాఖ
కేంద్రం ఉత్తర్వులు మత్స్యకారులకు పెద్ద వరం. అయితే వేటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ట్రాన్స్‌పాండర్‌ను వేట సమయంలో ఆన్ చేసి ఉంచాలి. దానివల్ల పరిధి దాటి అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా జీపీఎస్ ఉంచుకోవాలి. లైఫ్ జాకెట్లు, ఫైర్ ఎక్సటింగ్ విషర్లు బోటులో పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి వేటతో క్షేమంగా తీరానికి చేరుకోవచ్చు.