టీడీపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:16 AM
విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్ష పదవికి పలువురు పోటీ పడుతున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేలతో త్రిసభ్య కమిటీ సమావేశం
అనంతరం ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాల సేకరణ
రేస్‌లో గండి బాబ్జీ, పట్టాభి, దువ్వారపు, సీతంరాజు సుధాకర్, గాడు చిన్నికుమారి, రాజబాబు
నివేదికను అధినేతకు అందజేస్తామని కమిటీ సభ్యులు
విశాఖపట్నం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):
విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్ష పదవికి పలువురు పోటీ పడుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు గండి బాబ్జీతో పాటు మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్, సీనియర్ నాయకులు చోడే వెంకట పట్టాభి, మహ్మద్ నజీర్, కోరాడ రాజబాబు రేస్‌లో ఉన్నారు. ఇంకా భీమిలి మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్, రెండో వార్డు కార్పొరేటర్ గాడు చిన్నికుమారిలక్ష్మి, విజయనగరం డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, తెలుగు యువత నాయకుడు లొడగల కృష్ణ, తదితరులు అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు.
మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కుడిపూడి సత్తిబాబుతో కూడిన త్రిసభ్య కమిటీ మంగళవారం పార్టీ కార్యాలయంలో తొలుత ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, గండి బాబ్జీ, సుధాకర్, దువ్వారపు రామారావు, మేయర్ పీలా శ్రీనివాస్, ఇతర ముఖ్య నేతలతో సమావేశమై పార్లమెంటు కమిటీ ఎన్నికపై చర్చించింది. అనంతరం ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు పలువురి పేర్లు సూచించారు. అయితే ఎవరి పేర్లు సూచించారనేది బయటకు చెప్పలేదు. తన పదవి రెండేళ్లు పూర్తికాలేదని పేర్కొంటూ మరోసారి అవకాశం ఇవ్వాలని గండి బాబ్జీ కోరారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి రాష్ట్రంలో ఎక్కడా పదవి ఇవ్వలేదని, అందువల్ల తనకు అవకాశం ఇవ్వాలని సీతంరాజు సుధాకర్ కోరారు. ఇంకా బీసీ వర్గానికి చెందిన దువ్వారపు రామారావు తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. కాగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ చోడే వెంకట పట్టాభి త్రిసభ్య కమిటీని దరఖాస్తు అందజేశారు. పట్టాభికి అవకాశం ఇవ్వాలని పలువురు కార్పొరేటర్లు, కొందరు ఎమ్మెల్యేలు కమిటీ సభ్యులను కోరినట్టు సమాచారం. ఇంకా పట్టాభి కోసం తూర్పు నియోజకవర్గానికి చెందిన నేత ఒకరు కార్పొరేటర్లు సంతకాలు సేకరించారంటున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా పరిశీలకునిగా వెళ్లిన మహ్మద్ నజీర్ ఫోన్‌లో త్రిసభ్య కమిటీకి తన పేరు పరిశీలించాలని కోరగా ఆయనకు మద్దతుగా కొందరు నేతలు లేఖలు అందజేశారు. బీసీ వర్గానికి చెందిన తనకు గతంలో ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, అయితే చివరి నిమిషంలో వేరొకరికి ఇచ్చారని, ఇప్పుడు అధ్యక్ష పదవికి తన పేరు పరిశీలనలోకి తీసుకోవాలని కోరుతూ కమిటీకి భీమిలి మాజీ మునిసిపల్ చైర్మన్, వార్డు కార్పొరేటర్ గాడు చిన్నికుమారిలక్ష్మి దరఖాస్తు ఇచ్చారు. అధ్యక్ష పదవి రేస్ నుంచి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తప్పుకున్నారు. కాగా అందరి అభిప్రాయాలు తీసుకున్న కమిటీ నివేదికను అధినేతకు అందజేస్తామని జిల్లా నాయకులకు వెల్లడించింది.
సమర్థులకే పదవులు
ఆశావహుల దరఖాస్తులు అధినేతకు అందజేస్తాం
తుది నిర్ణయం ఆయనదే
జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు
విశాఖపట్నం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):
తెలుగుదేశం పార్టీలో సమర్థులకే పదవులు వస్తాయని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అందరినీ సమన్వయం చేసుకునే నేర్పరితనం, పార్టీకి తగినంత సమయం కేటాయించగలిగిన వారికి అవకాశాలు వస్తాయన్నారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యవర్గం ఎంపిక కోసం అధిష్ఠానం నియమించిన ముగ్గురి సభ్యులతో కూడిన కమిటీ మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిపై ఉంటుంన్నారు. జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితోపాటు మొత్తం 34 మందితో కూడిన కార్యవర్గం, 17 అధ్యక్ష, కార్యదర్శులతో అనుబంధ కమిటీలు, 54 సాధికార సమితులకు కార్యవర్గాల ఎంపిక చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లా కార్యవర్గ ఎంపికకు సంబంధించి ఆశావహులు ఇచ్చిన దరఖాస్తులను అధినేతకు అందజేస్తామన్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఇతర కార్యవర్గం ఎంపిక బాధ్యత అధినేతదేనన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సంస్థాగత ఎన్నికల్లో సమర్థులకే అవకాశం ఇస్తామన్నారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. పదవుల పంపకంలో సమ న్యాయం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ సంస్థాగత ఎన్నికల్లో అందరి అభిప్రాయాలు తీసుకుని అధినేతకు నివేదిస్తామన్నారు. ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ పార్లమెంటు కార్యవర్గం ఎన్నికల్లో ఎంపీ శ్రీభరత్ అభిప్రాయాలకే మద్దతు ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా అధిష్ఠానం చూడాలన్నారు. పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరిశీలకులు భూమిరెడ్డి రాంగోపాలరెడ్డి, కుడిపూడి సత్తిబాబు, ఇంకా సీతంరాజు సుధాకర్, దువ్వారపు రామారావు తదితరులు మాట్లాడారు. సమావేశంలో కోరాడ రాజబాబు, బండారు అప్పలనాయుడు, బొండా జగన్, మూర్తియాదవ్, లొడగల కృష్ణ, ఈతలపాక సుజాత, పుచ్చా విజయకుమార్, గంటా నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.