Share News

వన్‌టౌన్‌లో ఒరిగిన భారీభవనం

ABN , Publish Date - Aug 21 , 2025 | 01:30 AM

వన్‌టౌన్‌లోని వెలంపేట పోస్టాఫీస్‌కు కూతవేటు దూరంలో గల పువ్వల వీధిలో బుధవారం రాత్రి ఐదు అంతస్థుల భవనం పక్కకు ఒరిగింది. దాంతో అందులో నివసిస్తున్న కుటుంబాలవారు, స్థానికులు భీతిల్లారు.

వన్‌టౌన్‌లో ఒరిగిన భారీభవనం
ఒరిగిపోయిన భవంతి

పక్కనున్న ఫంక్షన్‌ హాల్‌ కూడా...

బీటలు వారిన పిల్లర్లు

స్థానికుల ఆందోళన

జీవీఎంసీ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు

అనుమతులు లేకుండా అదనపు అంతస్థులు చేపట్టినట్టు నిర్ధారణ

మహారాణిపేట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి):

వన్‌టౌన్‌లోని వెలంపేట పోస్టాఫీస్‌కు కూతవేటు దూరంలో గల పువ్వల వీధిలో బుధవారం రాత్రి ఐదు అంతస్థుల భవనం పక్కకు ఒరిగింది. దాంతో అందులో నివసిస్తున్న కుటుంబాలవారు, స్థానికులు భీతిల్లారు. జీవీఎంసీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించడంతో వారంతా హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆ భవంతిలో నివాసం ఉంటున్న వారిని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. రెండేళ్ల క్రితం నిర్మించిన ఈ జి+5 బిల్డింగ్‌ (కశిరెడ్డి ప్లాజా)లో పది కుటుంబాలవారు నివాసం ఉంటున్నారు. ఆ పక్కనే మూడేళ్ల క్రితం మరో భవంతి (ధరణి ఫంక్షన్‌ హాల్‌) నిర్మించారు. ఈ రెండూ అనుమతులకంటే ఎక్కువ అంతస్థులు నిర్మించారు. కొద్దిరోజుల క్రితం కశిరెడ్డి ప్లాజా బిల్డింగ్‌ కుడి వైపున ఉన్న ఫంక్షన్‌ హాల్‌ బిల్డింగ్‌ పైకి వాలింది. ఇటీవల వర్షాలు కురవడంతో మరింతగా ఒరిగిపోయింది. భవనం పిల్లర్లు బీటలు వారాయి. దీనిని గమనించిన స్థానికులు ఫిర్యాదు చేయడంతో బుధవారం రాత్రి జీవీఎంసీ అధికారులు, పోలీసులు, దక్షిణ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌తో అక్కడకు చేరుకున్నారు. పది కుటుంబాల వారిని తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. బిల్డింగ్‌ యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీచేశారు. పక్కనే ఉన్న భరణి ఫంక్షన్‌ హాల్‌ కూడా కొద్దిగా పక్కకు ఒరిగినట్టు అధికారులు గుర్తించారు. కశిరెడ్డి బిల్డింగ్‌ యజమాని జి+2 అనుమతులు తీసుకొని జీ+5 నిర్మాణం చేపట్టారు. ధరణి ఫంక్షన్‌ హాల్‌ కూడా జీ+2 అనుమతులు తీసుకొని జీ+3 నిర్మాణం చేపట్టినట్టు అధికారులు గుర్తించారు.

Updated Date - Aug 21 , 2025 | 01:30 AM