Share News

హుద్‌హుద్‌ ఇళ్లను అమ్మేశారు

ABN , Publish Date - May 18 , 2025 | 12:31 AM

నగరంలోని పైనాఫిల్‌ కాలనీలో నిర్మించిన హుద్‌హుద్‌ గృహ సముదాయంలో కొన్నింటిని లబ్ధిదారులు అమ్మేశారు..

హుద్‌హుద్‌ ఇళ్లను అమ్మేశారు

ఇంకొందరు అద్దెలకు ఇచ్చేశారు..

పైనాపిల్‌ కాలనీలో గల గృహ సముదాయంలో 106 మంది ఇతర ప్రాంతాల వారు నివాసం

విశాఖపట్నం/ఆరిలోవ, మే 17 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని పైనాఫిల్‌ కాలనీలో నిర్మించిన హుద్‌హుద్‌ గృహ సముదాయంలో కొన్నింటిని లబ్ధిదారులు అమ్మేశారు.. మరికొందరు అక్కడ నివాసం ఉండకుండా అద్దెకు ఇచ్చేశారు. మొత్తం ఇక్కడ 320 ఇళ్లకు గాను 106 మంది స్థానికేతరులే నివాసం ఉంటున్నారు. జీవీఎంసీ యూసీడీ విభాగం చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హుద్‌హుద్‌ తుఫాన్‌కు ఇళ్లు కోల్పోయిన బాధితులకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నగరంలో పలుచోట్ల ఇళ్లు నిర్మించింది. ఇందులో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన బాధితులకు పైనాఫిల్‌ కాలనీతోపాటు మరో రెండు మూడుచోట్ల గృహ సముదాయాలను నిర్మించారు. ఆయా కాలనీల్లో ఇళ్ల కేటాయింపుల కోసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు. అయితే ఇళ్ల నిర్మాణం తరువాత మౌలికవసతుల కల్పనలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల జాబితాలో మార్పులు చేసి కొందరు వైసీపీ సానుభూతిపరులకు ఇళ్లను కేటాయించారు. దీనిపై తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పలు దఫాలు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఆ తరువాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇళ్ల సముదాయంలో అసలైన లబ్ధిదారులు ఎవరనేది తేల్చాలని రామకృష్ణబాబు జీవీఎంసీ కమిషనర్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మధురవాడ జోనల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో యూసీడీ విభాగం ఉద్యోగులు విచారణ చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఎవరు నివాసం ఉంటున్నారు? వారు గతంలో ఆమోదించిన లబ్ధిదారుల జాబితాలో వారు ఉన్నారా? అద్దెకు ఉంటున్నారా? కొనుగోలు చేశారా? అనే కోణంలో విచారణ నిర్వహించారు. పైనాపిల్‌ కాలనీలో గల హుద్‌హుద్‌ గృహ సముదాయంలో మొత్తం పది బ్లాకులలో 320 ఇళ్లను నిర్మించారు. విచారణ సమయంలో 51 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. లబ్ధిదారుల జాబితాలో ఉన్న 163 మంది ఇక్కడ

నివాసం ఉంటున్నారు. మరో 26 మంది ఇళ్లను విక్రయించగా, 53 మంది అద్దె ప్రాతిపదికన ఉంటున్నారు. ఇంకా 22 ఇళ్లు ఖాళీగా ఉండగా ఒకరి ఇళ్లు డాక్యుమెంట్లు నకిలీవని తేలింది. మొత్తంగా 180 మంది వరకు స్థానికులు ఉండగా, మరో 106 మంది స్థానికేతరులు ఉన్నారని విచారణలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన నివేదికను

జీవీఎంసీ కమిషనర్‌కు మధురవాడ జోనల్‌ కమిషనర్‌ అందజేశారు. నివేదికలో పేర్కొన్న విధంగా అనర్హులపై చర్యలు తీసుకుంటారా? లేదా అన్నడి వేచి చూడాలి.

ఇసుక సరఫరాలో గోల్‌మాల్‌పై కలెక్టర్‌ ఆరా

క్షేత్రస్థాయిలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు

అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న వైనం

కార్లను వినియోగిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఏఈలు

విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి):

గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో సెంటు భూమిలో నిర్మిస్తున్న ఇళ్లకు సరఫరా చేసే ఇసుక గోల్‌మాల్‌పై జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌ ఆరా తీశారు. ‘ఇసుక సరఫరాలో గోల్‌మాల్‌’ శీర్షికతో శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. నగర శివార్లలోని లేఅవుట్లలో ఇళ్లకు సరఫరా చేసే ఇసుక వినియోగంపై వివరాలు సమర్పించాలని హౌసింగ్‌ అధికారులకు ఆయన ఆదేశించారు. దీంతో శనివారం కలెక్టర్‌ను హౌసింగ్‌ ఇంజనీరింగ్‌ అధికారి ఒకరు కలిసి వివరాలను నివేదించారు. జేసీ మయూర్‌ అశోక్‌ను కలిసి పూర్తి వివరాలు నివేదించాలని కలెక్టర్‌ సూచించడంతో ఆ ఇంజనీరింగ్‌ అధికారి జేసీని కలిశారు. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలావుండగా క్షేత్ర స్థాయిలో ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించే హౌసింగ్‌ అఽధికారులు కొందరు భారీగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీగా పర్సంటేజీలు వసూలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు, క్షేత్రస్థాయిలో పనిచేసే పలువురు అధికారులు కలిసి ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక, ఐరన్‌, సిమెంటు నుంచి కొంతమేర పక్కదారి పట్టించారనే ఫిర్యాదులున్నాయి. నాణ్యత లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నా సైట్‌ ఇంజనీర్లను హెచ్చరించే సందర్భాలు ఒక్కటి కూడా లేదు. దీంతో ప్రతిపాదనల్లో పేర్కొన్న సిమెంటులో కొంత మొత్తాన్ని పక్కదారి పట్టించారని, ఇసుక విషయంలోనూ అక్రమాలు జరిగాయని పలు ఫిర్యాదులున్నాయి. గత ఏడాది ప్రభుత్వం మారిన తరువాత ఇసుకకు కొరత ఏర్పడే సమయంలో రీచ్‌ల నుంచి వచ్చే ఇసుకలో కొన్ని లోడ్లను దారిమళ్లించారు. పెద్ద కాంట్రాక్టర్లతో మిలాఖత్‌ అయి చిన్నపాటి కాంట్రాక్టర్లకు కేటాయించే ఇసుక సరఫరాలో గోల్‌మాల్‌ చేశారనే వాదన ఉంది. కాగా అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేసే ముగ్గురు ఏఈలు సొంతంగా కార్లు వినియోగిస్తుండడం గమనార్హం. హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఈఈ, డీఈలకు మాత్రమే వాహన సదుపాయం ఉంది. ఏళ్లతరబడి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అనేకమంది ఏఈలు ద్విచక్ర వాహనం, లేదా ఈఈ/డీఈతోపాటు వాహనాల్లో తిరిగేవారు. అటువంటిది నగర శివార్లలో 98 వేల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో పలు అక్రమాలకు పాల్పడుతున్న ఏఈలు కార్లు వినియోగిస్తుండడంపై జిల్లా స్థాయి అధికారులు ఆరా తీశారు.

Updated Date - May 18 , 2025 | 12:31 AM