Share News

వానరాలతో హడల్‌!

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:56 AM

స్థానిక మునిసిపాలిటీలో కోతుల బెడద నానాటికీ అధికం అవుతున్నది. ఏళ్ల తరబడి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వానర దండుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి వచ్చినప్పటికీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నిరంతరం తమను ఇబ్బంది పెడుతున్న కోతులను పట్టుకొని, అటవీ ప్రాంతంలో వదిలేయడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వానరాలతో హడల్‌!
యర్రవరం ప్రాంతంలో రహదారిపై తిష్ఠవేసిన కోతులు

ఎలమంచిలి వాసులను బెంబేలెత్తిస్తున్న కోతులు

పట్టణంలో గుంపులుగా సంచారం

పట్టించుకోని అధికారులు

నానాటికీ పెరిగిపోతున్న సంతతి

ఎలమంచిలి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిసిపాలిటీలో కోతుల బెడద నానాటికీ అధికం అవుతున్నది. ఏళ్ల తరబడి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వానర దండుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి వచ్చినప్పటికీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నిరంతరం తమను ఇబ్బంది పెడుతున్న కోతులను పట్టుకొని, అటవీ ప్రాంతంలో వదిలేయడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మునిసిపాలిటీలో సుమారు ఆరు సంవత్సరాల నుంచి కోతుల సంతతి అధికంగా వుంది. వీధుల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. దారినపోయే వారిపై దాడి చేస్తున్నాయి. ఇళ్ల ఆవరణల్లోకి, మేడలపైకి యథేచ్ఛగా చొరబడుతున్నాయి. ఆహార పదార్థాలను తిన్నంత మేర తినేసి, మిగిలిన వాటిని పాడు చేస్తున్నాయి. తరుముదామంటే.. మీదకు వచ్చి కరుస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. వీటి ఆగడాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కోతుల దాడిలో ప్రాణాలు పోతే తప్ప.. అధికారులు పట్టించుకోరా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోతులకు భయపడి చిన్నారులు, మహిళలు రహదారులపై రాకపోకలు సాగించాలంటే హడలిపోతున్నారు. పట్టణంలో ప్రధానంగా రామ్‌నగర్‌, అల్లూరి సీతారామరాజు కాలనీ, కొత్తపేట, మిలట్రీ కాలనీ, గాంధీనగర్‌, రైల్వే స్టేషన్‌ రోడ్డు, యానాద్రి కాలనీ, యర్రవరం ప్రాంతాల్లో కోతుల సంచారం అధికంగా వుంది. అటవీ శాఖ అధికారులు గతంలో ఒకసారిఇ కోతులను పట్టించి, అటవీ ప్రాంతాలకు తరలిచేలా చర్యలు చేపట్టారు. అయితే కొద్ది కాలానికే వానర దండు తిరిగి వచ్చేసింది. కొంతకాలం క్రితం పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌.. కోతుల గుంపులను చూసి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వుండేందుకు వీటిని పట్టించి అటవీప్రాంతాని తరలించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇంతవరకు స్పందనలేదు.

సామాన్లు పట్టుకెళుతున్నాయ్‌

ఎ.చిన్నారావు, చిరువ్యాపారి 18వైఎల్‌ఎమ్‌5:

పట్టణంలోని మిలట్రీ కాలనీ ప్రాంతంలో ఉన్న నా దుకాణం తలుపులు మూసుకుని వ్యాపారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోతులు మూకుమ్మడి వచ్చి షాపులో ఉన్న సామాన్లు పట్టుకుపోతున్నాయి అడ్డుకుంటే.. మీదకు వచ్చి కరిచేలా ప్రవర్తిస్తున్నాయి. అధికారులు స్పందించి, కోతులను పట్టించి అడవుల్లో విడిచిపెడితే బాగుంటుంది.

Updated Date - Jul 23 , 2025 | 12:56 AM