Share News

ఎన్నాళ్లీ ఇక్కట్లు!

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:36 AM

భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డులో రావికమతం మండల పరిధిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు నానాపాట్లు పడ్డామని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తమ ఇక్కట్లు తొలగలేదని వాపోతున్నారు.

ఎన్నాళ్లీ ఇక్కట్లు!

వైసీపీ హయాంలో దారుణంగా తయారైన బీఎన్‌ రోడ్డు

కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా మొదలుకాని అభివృద్ధి పనులు

భారీ గోతుల్లో కూరుకుపోతున్న వాహనాలు

రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం

రావికమతం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డులో రావికమతం మండల పరిధిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు నానాపాట్లు పడ్డామని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తమ ఇక్కట్లు తొలగలేదని వాపోతున్నారు. బీఎన్‌ రోడ్డుపై మండల పరిధిలో పలుచోట్ల భారీ గోతులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కొద్దిపాటి వర్షం కురిసినా గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నారు. కొన్నిచోట్ల రెండు, మూడు అడుగుల లోతు వుండడం, గతంలో మట్టితో గోతులను పూడ్చడంతో కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గోతులు బురదగా తయారై ఊబిలా మారాయి. దీంతో వాహనాలు కూరుకుపోయి, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నది. శనివారం సాయంత్రం మేడివాడ పాల కేంద్రం వద్ద ఉన్న భారీ గొయ్యిలో కర్రల లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ కూరుకుపోయింది. తరువాత రెండు ట్రాక్టర్ల సహాయంతో గోతిలో నుంచి బయటకు లాగాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం నర్సీపట్నం నుంచి సరుకుల లోడుతో రావికమతం వైపు వస్తున్న వ్యాన్‌.. మేడివాడ జుత్తాడ కొండమ్మ టిఫిన్‌ సెంటర్‌ ఎదురుగా ఉన్న గొయ్యిలో కూరుకుపోయింది. సుమారు గంటపాటు స్థానికులు శ్రమించి బయటకు తీయాల్సి వచ్చింది. ఇటువంటి సంఘటనలు బీఎన్‌ రోడ్డులో పలుచోట్ల తరచూ జరుగుతున్నాయి. ఈ సమస్య ఎప్పటి తొలగుతుందో తెలియడం లేదని ఈ రోడ్డులో నిత్యం ప్రయాణించే పలు మండలాల ప్రజలు వాపోతున్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:36 AM