ఇంకెన్నాళ్లీ మహా దోపిడీ!?
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:17 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో ప్రజారోగ్య విభాగం పనితీరు తరచూ వివాదాస్పమవుతోంది.
ప్రజాధనం దుర్వినియోగం
అక్రమాలకు నిలయం ప్రజారోగ్య విభాగం
నగరంలో ఏ కార్యక్రమం జరిగినా భారీగా పనులు చేపట్టాలంటూ ప్రతిపాదనలు
అత్యవసరం పేరిట నామినేషన్‌పై అస్మదీయులకు కాంట్రాక్టులు
రెట్టింపు మొత్తానికి బిల్లులు
అధికారులకు వాటాలు
పారిశుధ్య కార్మికులు ఉన్నా...రోజువారీ వేతనంపై వందలాది మందిని తీసుకున్నట్టు తప్పుడు లెక్కలు
తాత్కాలిక టాయిలెట్ల వద్ద డ్రమ్ముల ఏర్పాటు పేరిట రూ.కోట్లు చెల్లింపు
ముందువెనుకా ఆలోచించకుండా స్టాండింగ్ కమిటీ ఆమోదించడంపై విమర్శల వెల్లువ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో ప్రజారోగ్య విభాగం పనితీరు తరచూ వివాదాస్పమవుతోంది. నగరంలో ఏదైనా కార్యక్రమం తలపెట్టడమే తరువాయి భారీగా పనులు చేయాల్సి ఉందంటూ ప్రతిపాదనలు తయారుచేస్తోంది. ఆయా పనులకు టెండర్లు పిలవకుండా అత్యవసరం పేరుతో అస్మదీయులకు నామినేషన్‌పై అప్పగిస్తోంది. కాంట్రాక్టర్లు చేసిన ఖర్చు కంటే రెండు, మూడింతలు బిల్లు పెట్టి జీవీఎంసీ ఖజానాను కొల్లగొడుతున్నారు.
నగరంలో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన పనులన్నీ ప్రజారోగ్య విభాగం పర్యవేక్షిస్తుంది. పారిశుధ్యం కోసం శాశ్వత, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఆరు వేల మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా తమకు కేటాయించిన ప్రాంతాల్లో రోడ్లను శుభ్రం చేయడం, డ్రైనేజీల్లో పూడికతీయడం చేస్తుంటారు. అయితే నగరంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు, ప్రముఖులు వచ్చినప్పుడు రోడ్లు శుభ్రం చేయడం కోసం రోజువారీ వేతనం ప్రాతిపదికన తాత్కాలిక కార్మికులను నియమించామంటూ భారీగా బిల్లులు పెడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో ఐఎఫ్‌ఆర్, జూన్‌లో యోగాంధ్ర, జూలైలో సింహగిరి ప్రదక్షిణ కార్యక్రమాలతోపాటు గత నెలలో జరిగిన పారిశ్రామిక పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా భారీగా తాత్కాలిక పారిశుధ్య సిబ్బందిని నియమించినట్టు అధికారులు రికార్డుల్లో చూపించారు. వారిని సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించాలంటూ గత ఐదు స్టాండింగ్ కమిటీ సమావేశాల్లోనూ రూ.కోట్లు చెల్లింపునకు ఆమోదం తెలిపారు.
అయితే తాత్కాలిక పారిశుధ్య కార్మికుల నియామకంపై ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా నియమించిన సిబ్బందికి ఐదారు రెట్లు ఎక్కువ మందిని తీసుకున్నట్టు చూపించి అడ్డగోలుగా బిల్లులు డ్రా చేస్తున్నారని కొంతమంది అధికారులే చెబుతున్నారు. అయినాసరే తాత్కాలిక కార్మికుల నియామకానికి సంబంధించి ఎప్పటికప్పుడు బిల్లు చెల్లింపు అంశాన్ని స్టాండింగ్ కమిటీ అజెండాలో అధికారులు పొందుపరుస్తూనే ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా యోగాంధ్రకు తాత్కాలిక కార్మికులను వివిధచోట్ల నియమించినట్టు చూపించి బిల్లు చెల్లింపు కోసం ప్రతిపాదనలను అజెండాలో చేర్చారు. ఈ వ్యవహారంలో అధికారులకు సైతం వాటాలు అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఐదో వార్డు నుంచి ఏడో వార్డు వరకూ రోడ్లను శుభ్రం చేసేందుకు ఇప్పుడున్న సిబ్బంది సరిపోనందున అదనపు సిబ్బందిని నియమించామని వారికి వేతనాలు చెల్లించేందుకు అనుమతించాలని కోరుతూ స్టాండింగ్ కమిటీ అజెండాలో ప్రతిపాదించారు. అలాగే ఈ ఏడాది జూలైలో జరిగిన సింహగిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన తాత్కాలిక మరుగుదొడ్ల వద్ద నీటిని అందుబాటులో ఉంచేందుకు వంద లీటర్లు, రెండు వందల లీటర్లు సామర్థ్యం కలిగిన ప్లాస్టిక్ డ్రమ్ములను కొనుగోలు చేశామని, వాటికి బిల్లు చెల్లించాలని గత స్టాండింగ్ కమిటీ సమావేశంలో పొందుపరిచారు. వంద లీటర్ల డ్రమ్ము రూ.1,200కు, 200 లీటర్ల డ్రమ్ము రూ.రెండు వేలకు కొన్నట్టు చూపించారు. వందల సంఖ్యలో డ్రమ్ములు కొన్నట్టు చూపించి సూమారు రూ.25 లక్షలు డ్రా చేసేశారు. వాస్తవంగా 200 లీటర్ల డ్రమ్ము మార్కెట్‌లో రూ.వెయ్యికే లభిస్తుంది. అదే హోల్‌సేల్‌గా వందల డ్రమ్ములను ఒకేసారి కొంటే రూ.650కే దొరుకుతాయి. అయినా, స్టాండింగ్ కమిటీ సభ్యులు మాత్రం ఆయా అంశాలకు ఆమోదం తెలపడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా యోగాంధ్ర సందర్భంగా బీచ్‌రోడ్డు, ఏయూ మైదానం వంటి చోట్ల ఏర్పాటుచేసిన బయో టాయ్‌లెట్లకు రూ.16 వేలు చొప్పున సుమారు రూ.1.6 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించే అంశాన్ని శనివారం జరిగే స్టాండింగ్ కమిటీ అజెండాలో చేర్చారు. ఇదే బయో టాయిలెట్లను గిరి ప్రదక్షిణకు ఏర్పాటుచేశారంటూ గత స్టాండింగ్ కమిటీ సమావేశం అజెండాలో పెట్టి, ఒక్కోదానికి రూ.5,900 చొప్పున అద్దె చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు అద్దె పెంచుతూ అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. ఆయా పనులన్నీ టెండర్ పద్ధతిలో కాకుండా నామినేషన్‌పై అస్మదీయులకు అధికారులకు కట్టబెట్టారనే ప్రచారం జరుగుతోంది. పనుల విలువను భారీగా పెంచి బిల్లు పెట్టినా అభ్యంతరం చెప్పకుండా స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదించడానికి కారణం అధికారులకు వాటాలు అందడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాలపై కమిషనర్ కేతన్‌గార్గ్ సీరియస్‌గా దృష్టిసారించపోతే ప్రజాధనం దుర్వినియోగం అవుతూనే ఉంటుంది.