Share News

కరెంటు కష్టాలు ఇంకెన్నాళ్లు?

ABN , Publish Date - Nov 03 , 2025 | 10:57 PM

వర్షం కురిస్తే చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని సుమారు 650 గ్రామాలు అంధకారంలో ఉంటున్నాయి. తరచూ ఇదే సమస్య ఆయా గ్రామాల ప్రజలను వేధిస్తోంది. మొంథా తుఫాన్‌ సమయంలో సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

కరెంటు కష్టాలు ఇంకెన్నాళ్లు?
చింతపల్లి 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌

వానొస్తే చీకట్లోనే సుమారు 650 గ్రామాలు

మొంథా తుఫాన్‌ సమయంలో 40 గంటల పాటు అంధకారం

ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

రూ.4 కోట్ల నిధులు విడుదల

పనులు ప్రారంభానికి మోకాలడ్డుతున్న అటవీశాఖ

ప్రతిపాదనలు పంపి ఏడాది గడిచినా మంజూరుకాని అనుమతులు

చింతపల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): వర్షం కురిస్తే చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని సుమారు 650 గ్రామాలు అంధకారంలో ఉంటున్నాయి. తరచూ ఇదే సమస్య ఆయా గ్రామాల ప్రజలను వేధిస్తోంది. మొంథా తుఫాన్‌ సమయంలో సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో చింతపల్లి, జీకేవీధి మండలాల ప్రజలు 40 గంటల పాటు అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి నిధులు మంజూరు చేసినా అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో ఇప్పటికీ ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌ పనులు ప్రారంభంకాలేదు.

చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని సుమారు 650 గిరిజన గ్రామాలకు బలిఘట్టం 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. బలిఘట్టం 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌కి కొరుప్రోలు 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అవుతోంది. కొరుప్రోలు నుంచి చింతపల్లి వరకు ఎక్కడ సాంకేతిక సమస్య తలెత్తిన ఈ రెండు మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. సాంకేతిక సమస్య పరిష్కరించే వరకు చింతపల్లి, జీకేవీధి మండలాలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గంలేదు. దీంతో గంటల తరబడి ఆదివాసీ గ్రామాల ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. ప్రధానంగా వర్షాకాలంలో ఈ సమస్యను ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నారు. వర్షాల వలన కొరుప్రోలు నుంచి చింతపల్లికి వస్తున్న 33 కేవీ విద్యుత్‌లైన్‌పై చెట్ల కొమ్మలు విరిగి పడడం, పిడుగులు పడి ఇన్సులేటర్లు పగిలిపోవడం, విద్యుత్‌ తీగలు తెగిపోవడం వంటి సమస్యల వలన విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో విద్యుత్‌శాఖ సిబ్బంది సాంకేతిక సమస్యను పరిష్కరించే వరకు చింతపల్లి, జీకేవీధి మండలాలు చీకట్లో ఉండాల్సి వస్తోంది.

ప్రతిపాదనలను పట్టించుకోని గత ప్రభుత్వం

పాడేరు 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి చింతపల్లి 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌కి విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కాలయాపన చేసిందే తప్పా పనులు ప్రారంభించలేదు. పాడేరు 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి జి.మాడుగుల వరకు 33 కేవీ విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. జి.మాడుగుల నుంచి చింతపల్లికి 39 కిలోమీటర్లు అదనపు విద్యుత్‌ లైన్‌ నిర్మించి విద్యుత్‌ సరఫరా చేయాల్సి వుంది. ఈ అదనపు విద్యుత్‌ లైన్‌ నిర్మాణానికి 2016-17లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను మరుగునపడేసింది.

ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌కు రూ.4 కోట్లు మంజూరు

సీలేరు ఏపీ ట్రాన్స్‌కో నుంచి ప్రత్యామ్నాయ 33 కేవీ విద్యుత్‌ లైన్‌ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చింతపల్లి నుంచి దుప్పిలవాడ వరకు ఇప్పటికే 33 కేవీ విద్యుత్‌లైన్‌ నిర్మాణంలో ఉంది. ఈ విద్యుత్‌ లైన్‌ ద్వారానే జీకే వీధి మండల ప్రజలకు విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది. సీలేరు నుంచి దుప్పిలవాడ వరకు తొమ్మిది కిలోమీటర్లు 33 కేవీ విద్యుత్‌ లైన్‌ నిర్మాణం చేపడితే సరిపోతుంది. ఈ మేరకు 2024 సెప్టెంబరు 8వ తేదీన ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఈపీడీసీఎల్‌ సీఎండీ సీలేరు నుంచి ప్రత్యామ్నాయంగా చింతపల్లికి విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. సీలేరు నుంచి ధారకొండ వరకు 33 కేవీ విద్యుత్‌ లైన్‌ నిర్మాణాలకు అవసరమైన రూ.4 కోట్ల నిధులను ప్రభుత్వం 2024 నవంబరులో విడుదల చేసింది.

ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌ నిర్మిస్తే..

సీలేరు నుంచి చింతపల్లికి ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌ నిర్మిస్తే చింతపల్లి, జీకేవీధి మండలాల గిరిజన గ్రామాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. కొరుప్రోలు, నర్సీపట్నం విద్యుత్‌ లైన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినా గంటల తరబడి విద్యుత్‌ కోసం ఈ ప్రాంత ప్రజలు నిరీక్షించే పరిస్థితి ఉండదు. బలిఘట్టం 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి చింతపల్లికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే సీలేరు జెన్‌కో నుంచి నిర్మించిన 33 కేవీ విద్యుత్‌ లైన్‌ ద్వారా రెండు మండలాల ప్రజలకు విద్యుత్‌ను సరఫరా చేసే అవకాశముంటుంది.

ఏడాది గడిచినా మంజూరుకాని అనుమతులు

సీలేరు నుంచి దుప్పిలవాడ వరకు 33 కేవీ విద్యుత్‌ లైన్‌ రిజర్వుడ్‌ ఫారెస్టు భూమిలో నిర్మించాల్సివుంది. సుమారు 20 ఏళ్ల క్రితం సీలేరు నుంచి దుప్పిలవాడ వరకు విద్యుత్‌లైన్‌ నిర్మించారు. అయితే వినియోగంలో లేక ఈ విద్యుత్‌లైన్‌ పాడైపోయింది. అప్పట్లో విద్యుత్‌ లైన్‌ నిర్మాణానికి ఈపీడీసీఎల్‌ అధికారులు అటవీశాఖ అనుమతులు తీసుకున్నారు. తాజాగా నూతన విద్యుత్‌ లైన్‌ నిర్మాణానికి పాత అనుమతులను మళ్లీ పరిశీలించి కొత్త అనుమతులు మంజూరు చేయాల్సి వుంది. ఈ అనుమతుల కోసం చింతపల్లి డివిజనల్‌ కార్యాలయం అటవీశాఖ అధికారులు సర్వే నిర్వహించి అమరావతి ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టుకి ప్రతిపాదనలను 2024 నవంబరు ఆఖరిలో పంపించారు. ప్రతిపాదనలు పంపించి ఏడాది గడిచినా అటవీశాఖ ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ విద్యుత్‌లైన్‌ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయలేదు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయమై అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌ నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేసినప్పటికి పనులు ప్రారంభించే పరిస్థితిలేక ఆదివాసీలకు విద్యుత్‌ కష్టాలు తప్పడం లేదు.

Updated Date - Nov 03 , 2025 | 10:57 PM