Share News

ఎన్నాళ్లీ నిరీక్షణ..?

ABN , Publish Date - Jun 06 , 2025 | 10:54 PM

స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో పోస్టుల భర్తీకి అటు అభ్యర్థులు, ఇటు అధికారులు గత ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నారు. మెడికల్‌ కాలేజీలో వివిధ విభాగాల్లోని 244 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఎన్నాళ్లీ నిరీక్షణ..?
దరఖాస్తులకు బారులు తీరిన అభ్యర్థులు(ఫైల్‌)

మెడికల్‌ కాలేజీలోని ఉద్యోగాల భర్తీకి

వేచిచూస్తున్న అభ్యర్థులు

ప్రభుత్వ అనుమతి కోరిన అధికారులు

ఐదు నెలలుగా ఎదురుచూపులు

244 పోస్టులకు 15,512 మంది దరఖాస్తు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో పోస్టుల భర్తీకి అటు అభ్యర్థులు, ఇటు అధికారులు గత ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నారు. మెడికల్‌ కాలేజీలో వివిధ విభాగాల్లోని 244 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందుకు సంబంధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అయితే మెడికల్‌ కాలేజీలోని పోస్టుల భర్తీకి గిరిజనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పలు సంఘాలు డిమాండ్‌ చేశాయి. దీంతో ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి ఎలా చర్యలు చేపట్టాలనే అంశంపై స్పష్టత ఇవ్వాలని జిల్లా అధికారులు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌కు అనుమతి కోరుతూ లేఖలు రాశారు. అయితే ఆక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో భర్తీకి చర్యలు చేపట్టలేని పరిస్థితి కొనసాగుతున్నది. స్థానిక మెడికల్‌ కాలేజీలో పారామెడికల్‌, సపోర్టింగ్‌ సిబ్బంది కలిపి మొత్తం 244 పోస్టులను భర్తీ చేసేందుకు గతేడాది డిసెంబరులో నోటిషికేషన్‌ జారీ చేశారు. మొత్తం పోస్టుల్లో కాంట్రాక్ట్‌ విధానంలో 107, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో 137 పోస్టులకు 15,512 దరఖాస్తులు అందాయి.

ఒక్కో పోస్టుకు 63 మంది దరఖాస్తు

స్థానిక మెడికల్‌ కాలేజీలో పోస్టులకు ఊహించిన దానికంటే అధికంగానే దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 244 పోస్టులకు గానూ 15,512 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒక్కో పోస్టుకు సగటున 63 మంది దరఖాస్తు చేశారు. ఆయా పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా నుంచి నిరుద్యోగులు దరఖాస్తులు చేయడంతో విపరీతమైన పోటీ నెలకొంది.

పోస్టుల భర్తీకి అనుమతి కోసం ఎదురుచూపులు

మెడికల్‌ కాలేజీలోని పోస్టుల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వివిధ కేటగిరిల్లోని అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. అయితే గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీలో గిరిజనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయా పోస్టుల్లో గిరిజనులను అధికంగా నియమించాలని ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి ఎస్‌టీలకు ప్రాధాన్యతనిచ్చేందుకు అవసరమైన అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.హేమలత ప్రభుత్వానికి, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌కు మూడు నెలల క్రితమే లేఖలు రాశారు. అక్కడి నుంచి వచ్చిన అనుమతి, నిబంధనల మేరకు పోస్టులను భర్తీ చేయాలని అధికారులు ఎదురు చూస్తున్నారు. అయితే ఐదు నెలల క్రితం దరఖాస్తు చేసినా ఇంతవరకు భర్తీ చేయకపోవడంపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన ఆయా పోస్టుల భర్తీకి మార్గం సుగమం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Updated Date - Jun 06 , 2025 | 10:54 PM