ఇళ్లకు వెళ్లేదెలా?
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:10 PM
జాతీయ రహదారి నిర్మాణంతో చింతపల్లి సాయిబాబా ఆలయం సమీపంలోని ఇళ్లకు వెళ్లేందుకు దారి లేకుండాపోయింది. హైవే అథారిటీ అధికారులు వారి సౌలభ్యం చూసుకున్నారే తప్ప ఇక్కడి నివాసుల గురించి పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జాతీయ రహదారి నిర్మాణం కోసం 18 అడుగుల లోతున తవ్వకాలు
ఎత్తులో ఉండిపోయిన గృహాలు
పెద్ద నిచ్చెనలు వేసుకుంటే గానీ కిందకు రాలేని పరిస్థితి
నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లలేని దుస్థితి
వర్షాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం
అధికారులు స్పందించాలని ప్రజల వేడుకోలు
చింతపల్లి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి నిర్మాణంతో చింతపల్లి సాయిబాబా ఆలయం సమీపంలోని ఇళ్లకు వెళ్లేందుకు దారి లేకుండాపోయింది. హైవే అథారిటీ అధికారులు వారి సౌలభ్యం చూసుకున్నారే తప్ప ఇక్కడి నివాసుల గురించి పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజమహేంద్రవరం నుంచి చింతపల్లి, పాడేరు, అరకు మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి 516-ఈ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. చింతపల్లి మండల కేంద్రంలో ప్రస్తుతం జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే స్థానిక సాయిబాబా ఆలయం వద్ద రహదారి నిర్మాణానికి అంతకు ముందు ఉన్న రహదారిని 18 అడుగుల లోతున తవ్వేశారు. అప్పట్లో ఈ ప్రాంతవాసులు అప్పటి రోడ్డుకు తగ్గట్టుగా ఇరువైపులా అదే ఎత్తులో ఇళ్లు నిర్మించుకున్నారు. కాగా ప్రస్తుతం జాతీయ రహదారి పనుల్లో భాగంగా ఎత్తుగా ఉన్న ఈ ప్రాంతాన్ని హైవే అథారిటీ అధికారులు 18 అడుగుల లోతున తవ్వేయడంతో ఈ ప్రాంతవాసులు కిందకు వచ్చే మార్గం లేకుండాపోయింది. రోడ్డు మార్జిన్ కోసం ఆ ఇళ్లను కూడా తొలగిస్తే కనీసం నష్టపరిహారం అయినా వచ్చేది. అయితే కేవలం రోడ్డు వరకే తవ్వకాలు జరిపారు. దీని వల్ల వారం రోజులుగా ఈ ప్రాంతవాసులు పెద్ద నిచ్చెనలు వేసుకుని కిందకు రావలసి వస్తోంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అయితే రోడ్డు మీదకు రాలేని పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా కష్టంగా ఉంది. పైగా ఈ ప్రాంతాన్ని తవ్వి వదిలేయడం వల్ల వర్షాలు కురిసినప్పుడు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. అలాగే ఇళ్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం జరగక ముందే అధికారులు మేల్కోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఇళ్లకు ప్రత్యామ్నాయ రహదారి నిర్మించడంతో పాటు కొండచరియలు జారిపడకుండా రక్షణ గోడ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.