పేదలకు గృహయోగం
ABN , Publish Date - Nov 13 , 2025 | 01:33 AM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పేదల కోసం నిర్మించిన ఇళ్లలో బుధవారం గృహప్రవేశాలు జరిగాయి.
జిల్లాలో 38,691 ఇళ్లలో ప్రవేశాలు
పీఎంఏవై 2.0 కింద మంజూరైన ఇళ్లకు శంకుస్థాపనలు
విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పేదల కోసం నిర్మించిన ఇళ్లలో బుధవారం గృహప్రవేశాలు జరిగాయి. అర్హులైన వారి కోసం నగర శివార్లలో రూపొందించిన లేఅవుట్‌లలో ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించింది. అలాగే సొంతంగా స్థలాలు కలిగి ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు మంజూరుచేసింది. ఈ విధంగా కాలనీల్లో, వ్యక్తిగత స్థలాల్లో చేపట్టిన ఇళ్లలో 38,691 వరకూ పూర్తయ్యాయి. వాటిలో బుధవారం గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు అధికారులు పత్రాలు అందజేశారు. ఇందులో లబ్ధిదారులు స్వయంగా నిర్మించుకున్నవి 38,389 ఇళ్లు. ఈ సందర్భంగా పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గృహ ప్రవేశాలు చేసిన ఇళ్లలోకి మంత్రి, ఇతర నాయకులు వెళ్లి లబ్ధిదారులతో ముచ్చటించారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, హౌసింగ్ పీడీ సీహెచ్ సత్తిబాబు, ఇతర అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాగా పీఎంఏవై 2.0లో కొత్తగా మంజూరుచేసిన ఇళ్లకు సంబంధించి పెందుర్తి పరిధిలో 69వ వార్డులో శంకుస్థాపనలు చేశారు. ఇంకా గాజువాక, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలు అందజేశారు.