Share News

పేదల ఇంట పండగ

ABN , Publish Date - Nov 13 , 2025 | 01:10 AM

జిల్లాలో పేదల నూతన గృహ ప్రవేశాలు పండగలా జరిగాయి. బుధవారం జిల్లాలో 13,569 గృహ ప్రవేశాలను అట్టహాసంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో 13,569 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి, బుధవారం గృహ ప్రవేశాలు చేసింది

పేదల ఇంట పండగ
అనకాపల్లి పట్టణంలో నాగరత్నంకు ఇంటి తాళం నమూనాను అందజేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

- జిల్లాలో 13,569 ఇళ్లకు గృహ ప్రవేశాలు

- ఆయా నియోజకవర్గాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పేదల నూతన గృహ ప్రవేశాలు పండగలా జరిగాయి. బుధవారం జిల్లాలో 13,569 గృహ ప్రవేశాలను అట్టహాసంగా నిర్వహించారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో 13,569 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి, బుధవారం గృహ ప్రవేశాలు చేసింది. అనకాపల్లిలో 3,200, నర్సీపట్నంలో 2,241, చోడవరంలో 1,612, మాడుగులలో 2,152, ఎలమంచిలిలో 996, పాయకరావుపేటలో 2,946, పెందుర్తిలో 422 గృహ ప్రవేశాల కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనకాపల్లి మండలంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జేసీ జాహ్నవి హాజరై లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన సామూహిక గృహ ప్రవేశాలకు హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలో పోతనపూడి అగ్రహారంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎలమంచిలిలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ హాజరయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అందుబాటులో లేనందున గృహప్రవేశాల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. చోడవరం నియోజకవర్గంలో గృహ ప్రవేశాలు జరగలేదు. ఒకటి రెండు రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లోనూ గృహ ప్రవేశాలు జరపనున్నట్టు గృహ నిర్మాణ సంస్థ అధికారులు తెలిపారు.

Updated Date - Nov 13 , 2025 | 01:10 AM