Share News

హోటళ్లు ఫుల్‌

ABN , Publish Date - Dec 12 , 2025 | 01:24 AM

నగరంలోని హోటళ్లన్నీ అతిథులు, పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి.

హోటళ్లు ఫుల్‌

ఏ స్టార్‌ హోటల్‌లోనూ గది లభించని పరిస్థితి

ఏకకాలంలో రెండు చోట్ల జాతీయ స్థాయి వైద్య రంగ సదస్సులు జరుగుతుండడమే కారణం

మరోవైపు నేడు 8 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన

ఆయా సంస్థల ప్రతినిధుల రాక

విశాఖపట్నం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని హోటళ్లన్నీ అతిథులు, పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. ఏ స్టార్‌ హోటల్‌లోనూ గదులు లభించడం లేదు. ప్రముఖ హోటళ్లన్నీ రెగ్యులర్‌ టారిఫ్‌ కాకుండా ప్రీమియం రేట్లతో బుకింగ్స్‌ ఇస్తున్నాయి. డిసెంబరు నెల పర్యాటక సీజన్‌ కావడం ఒక కారణం కాగా, నగరంలో రెండు భారీ వైద్య సదస్సులు జరుగుతుండడం మరో కారణం.

నేషనల్‌ నియోనాటాలజీ-2025 వార్షిక సదస్సు నోవాటెల్‌ హోటల్‌లో గురువారం ప్రారంభమైంది. ఇది శనివారం వరకూ జరుగుతుంది. అదేవిధంగా అసోసియేషన్‌ ఆఫ్‌ ఓరల్‌ అండ్‌ మాక్సిలోఫేసియల్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా 49వ వార్షిక సదస్సు రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జరుగుతోంది. ఇది కూడా గురువారం నుంచి శనివారం ఉంది. ఈ రెండు సదస్సులకు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు వచ్చారు. మరోవైపు నగరంలో ఎనిమిది ఐటీ కంపెనీలకు శుక్రవారం ఐటీ శాఖా మంత్రి లోకేశ్‌ శంకుస్థాపనలు చేస్తున్నారు. అందులో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ ఒకటి. ఇందులో సీఎం చంద్రబాబునాయుడు కూడా పాల్గొంటున్నారు. ఈ సంస్థలకు సంబంధించిన యాజమాన్య ప్రతినిధులు, ఉన్నతాధికారులు రెండు రోజుల నుంచి నగరంలోనే ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా పలువురు అధికారులు వస్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ అభివృద్ధి కోసం శుక్రవారం రుషికొండలోని ఏ-1 గ్రాండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సదస్సు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, పరిశ్రమలు, పర్యాటక శాఖ, పలు పారిశ్రామిక సంస్థల అధికారులతో సీఎం చంద్రబాబునాయుడు అక్కడ సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి హాజరయ్యేందుకు ఆయా జిల్లాల నుంచి అధికారులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని హోటళ్లలో గదులకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. నగరంలో త్రీ, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో 2,500 గదులు ఉన్నాయి. ఇవన్నీ ఫుల్‌ అయిపోయాయి. ఒక హోటల్‌లో సూట్‌ కోసం రూ.40 వేలు డిమాండ్‌ చేస్తున్నారు. అంత వెచ్చించడానికి కొందరు ముందుకువచ్చినా సూట్‌లు లభించడం లేదు. ఇవి కాకుండా అంతకంటే తక్కువ రేటింగ్‌ కలిగిన బడ్జెట్‌ హోటళ్లు, లాడ్జీల్లో 5 వేల గదులు ఉన్నాయి. వాటికి కూడా డిమాండ్‌ ఏర్పడింది. రూమ్‌ బుక్‌ చేసుకొని హోటల్‌కు వెళ్లాక రెండు మూడు గంటలకు గానీ ఆక్యుపెన్సీ ఇవ్వడం లేదు. అంత డిమాండ్‌ ఉంది.

సీజన్‌ కావడం వల్లనే డిమాండ్‌

పవన్‌ కార్తీక్‌, ప్రెసిడెంట్‌, హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ

డిసెంబరు నెల అంతా పర్యాటక సీజన్‌. ఈ నెలలో ఐటీ ఉద్యోగులు ఇయర్‌ ఎండింగ్‌ సెలవులన్నీ ఉపయోగించుకుంటారు. కుటుంబాలతో టూర్లకు వస్తారు. ఇదే సమయంలో వైద్య సదస్సులు, ప్రముఖుల కార్యక్రమాలు ఉండడం వల్ల గదులు డిమాండ్‌ ఏర్పడింది. ఈ సీజన్‌ బాగానే నడుస్తోంది.

Updated Date - Dec 12 , 2025 | 01:24 AM